Breaking News: అప్పు అడిగినందుకు వృద్ధురాలి గొంతుకోసి హత్య.. మృతదేహం ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లోనే పూడ్చివేత!

హాలియా, ఏపీబీ న్యూస్: కేవలం కొన్ని తులాల బంగారం మరియు అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి అడిగినందుకు ఒక వృద్ధురాలిని అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన హాలియా పట్టణంలో సంచలనం సృష్టించింది. నిందితులు మృతదేహాన్ని తమ హోటల్ వెనుక భాగంలోనే పూడ్చిపెట్టి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డారు.

హాలియా పట్టణానికి చెందిన సుంకిరెడ్డి అనసూయమ్మ (65) అనే వృద్ధురాలు ఈనెల 24న ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమయ్యారు. బంధువుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. అనసూయమ్మ స్థానిక ‘ధనలక్ష్మి ఫాస్ట్ ఫుడ్ సెంటర్’ యజమాని చిన్నపాక రాములుకు గతంలో కొంత డబ్బు అప్పుగా ఇచ్చారు. ఆ డబ్బులు తిరిగి అడగడానికి శనివారం ఉదయం ఆమె అక్కడికి వెళ్లారు.

డబ్బులు అడిగిన క్రమంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని రాములు, అతని భార్య ధనలక్ష్మి మరియు కుమారుడు గౌరి కలిసి అనసూయమ్మపై దాడికి దిగారు. కత్తిపీటతో ఆమె తలపై బలంగా కొట్టి, అనంతరం గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. చనిపోయిన తర్వాత ఆమె ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, చెవి దిద్దులను దోచుకున్నారు. సాక్ష్యాలు దొరక్కుండా ఉండేందుకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వెనుక భాగంలో గొయ్యి తీసి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.

haliya old woman murder fast food center body buried

వృద్ధురాలి అదృశ్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో గాలింపు చేపట్టారు. పట్టణంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా, అనసూయమ్మ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వైపు వెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి. దీని ఆధారంగా సోమవారం ఉదయం అక్కడ తనిఖీలు చేయగా, పాతిపెట్టిన మృతదేహం బయటపడింది.

హాలియా సీఐ దేవిరెడ్డి సతీష్ రెడ్డి మరియు ఎస్సై బండి ప్రశాంత్ ఆధ్వర్యంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తహసీల్దార్ రఘు సమక్షంలో మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ముగ్గురు కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Share
Share