Breaking News: ప్రత్యక్ష రాజకీయాలకు గుత్తా గుడ్​బై … వచ్చేవి జమిలి ఎన్నికలే

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: ఇక ప్రత్యక్ష రాజకీయాల నుంచి తాను విరమించుకుంటున్నానని, నా కొడుకు అమిత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడని, అప్పటి పరిస్థితులను బట్టి ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం ఉంటదని, ఎక్కడ అనేది ఇప్పుడే చెప్పలేనని మండలి చైర్మన్ గుత్తా సుఖేంద ర్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. రాజకీయాల్లోకి వచ్చాక పోటీ చేయకుండా ఉంటారా? కచ్చితంగా అమిత్ ఎన్నికల్లో పోటీ చేస్తారని, నాకు మాత్రం మళ్లీ అవకాశం ఇస్తే మండలిలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

మళ్లీ మేము అధికారంలోకి వస్తాం అన్న పార్టీలు సైలెంటయ్యాయని, ప్రజా పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికలు జమిలి ఎన్నికలే ఉంటాయని, నియోజకవర్గాల పునర్విభజన కచ్చితంగా జరుగుతదని, దాంట్లో మహిళలకు రిజర్వేషన్లు ఉంటాయని, అట్లాగే ఇప్పుడున్న రిజర్వేషన్లు కూడా మారుతాయని చెప్పారు.

అసెంబ్లీలో ప్రాంగణంలో శాసన మండలి భవనం పునర్నిర్మాణం పనులు చాలా వేగంగా నడుస్తున్నాయని, దాదాపు 99 శాతం పనులు పూర్తియ్యాయని చెప్పారు. ఈ నెల 8న ఉదయం 9:30 శాసన మండలి హల్ ను సీఎం రేవంత్ ప్రారంభిస్తారని చెప్పారు. ఏపీ వాళ్ళు అమరావతికి వెళ్లిన తర్వాత ఆ భవనం  ఖాళీగా ఉందని, దాన్ని అలాగే వదిలేస్తే బిల్డింగ్ శిథిలావస్థకు వచ్చేలా ఉందని,  హెరిటేజ్ బిల్డింగ్ కాపాడుకొని, అసెంబ్లీని సుందరంగా మార్చుకొని, ఒకే చోట శాసన సభ , శాసన మండలి ఉండాలనే , గొప్ప సంకల్పంతో సీఎం పనులను ప్రారంభించారు. పార్లమెంట్ తరహాలో తెలంగాణ శాసన సభ ఉండబోతుంది. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అధికారులకు, మంత్రులకు ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. మన రాష్ట్ర శాసన పరిషత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, మిగిలిన రాష్ట్రాలు కూడా మన తరహాలో సభ సమావేశ హాల్స్ నిర్మించుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మాణం చేపట్టింది. ప్రస్తుతం ఉన్న శాసన మండలిని, జూబ్లీహాల్ ను పునరుద్ధరణ చేసి ప్రభుత్వ కార్యక్రమాలకు వాడుకునే ఆలోచనలో సర్కార్ ఉంది. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అందరికి సెంట్రల్ హల్ నిర్మాణం జరుగుతుంది.

దాదాపు 30 కోట్ల వ్యయంతో శాసన మండలి పనులు పూర్తి చేశారు. డ్రైనేజ్, ఫ్లోరింగ్, ఎలక్ట్రిసిటీ, సీఎం ఛాంబర్, చైర్మన్, వైస్ చైర్మన్  చాంబర్ ,సెక్రటరీ ఆఫీస్, కౌన్సిల్ సెక్రెటరీయేట్, మీడియాకు హాల్ తయారు చేశామని చెప్పారు. బడ్జెట్ సెషన్స్ తర్వాత సెంట్రల్ హాల్ ఏర్పాటు చేస్తామని, పనులు పూర్తి అవడానికి ఏడాదిన్నర సమయం పట్టిందని, హెరిటేజ్ భవనం కావడంతో ఎక్కువ సమయం పట్టిందని, చాలా జాగ్రత్తగా పనులు చెయ్యాల్సి వచ్చిందని, 40 -50 సంవత్సరాల వరకు భవనంకి డొకా లేదన్నారు. అసెంబ్లీ లో ఏర్పాటు చేసే తెలంగాణ తల్లి విగ్రహం మార్చి 8లోపు నిర్మాణం పూర్తి అయితే అదే రోజు విగ్రహ ఆవిష్కరణ చేయడం జరుగుతుందని, ఆదర్శనగర్ లోని 9 ఎకరాల ల్యాండ్ లో  కన్స్టిట్యూషన్ క్లబ్ నిర్మాణము చేయబోతున్నామని చైర్మన్ చెప్పారు.

Share
Share