- వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు తండ్రి గుత్తా గ్రీన్ సిగ్నల్
- ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన సుఖేందర్ రెడ్డి
- వారసుడిగా అమిత్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశం
- నియోజకవర్గాల పునర్విభజన పైనే దృష్టి
- రిజర్వేషన్లు మారితే నకిరేకల్ లేదంటే మిర్యాలగూడెం
- కుదరకపోతే తండ్రి బాటలోనే పార్లమెంట్‌కు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ముహూర్తం ఖారారైంది. వచ్చే అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో అప్పటి పరిస్థితులను బట్టి అమిత్ పోటీకి సిద్ధమని తండ్రి సుఖేందర్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తండ్రి చేసిన ప్రకటనతో అమిత్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే టాక్ ప్రధానంగా వినిపిస్తోంది. ఇప్పుడున్న ఈక్వేషన్స్ ప్రకారం అమిత్ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఎక్కడా నియోజకవర్గాలు ఖాళీ లేవు. దాంతోనే గత ఎన్నికల్లో నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో ఎక్కడ నుంచైనా పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు, కానీ అప్పటికప్పుడు పార్టీ మారడంతో అమిత్కు బెర్త్ దొరకలేదు. ఇప్పటికీ కాంగ్రెస్లో చేరి రెండేళ్లు పూర్తియ్యింది. పార్టీలో చేరిన తొలి ప్రయత్నంలోనే తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పదవి చేపట్టారు. ఈ రెండేళ్లలో రాజకీయంగా అటుపార్టీ పెద్దలతోపాటు, సీఎం రేవంత్ వద్ద పట్టుసాధించారు. ఈ నమ్మకంతోనే సుఖేందర్ రెడ్డి తన వారసుడు అమిత్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించారు. సీనియర్ పార్లమెంట్ సభ్యులుగా తనకున్న అపార రాజకీయ అనుభవంతోనే నియోజక వర్గాల పునర్విభజన పైన కూడా సుఖేందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉమ్మడి జిల్లా లో ఎస్సీ రిజర్వేషన్లు ఉన్న నకిరేకల్, తుంగతుర్తి జనరల్గా మారే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు చెపుతున్నారు. నకిరేకల్ అమిత్ సొంత నియోజకవర్గం కాబట్టి పరిస్థితులు కలిసొస్తే అక్కడి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది. లేదంటే పార్లమెంట్ సభ్యుడిగా నల్లగొండ, భువనగరి నుంచైనా పోటీ చేసేందుకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి.
నకిరేకల్ పైన గురి
నకిరేకల్ నియోజకవర్గం పైన అమిత్ గురి పెట్టారు. దీనిలో భాగం గానే పార్టీల రహితంగా తాజా, మాజీ ఎమ్మెల్యేలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుంటారనే పేరు అమిత్కు ఉంది. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి గెలుపులో అమిత్ కీలకంగా వ్యవహారించారు. ఆ తర్వాత పార్టీ మారిన క్రమంలో ఎమ్మెల్యే వేముల వీరేశంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగానే ఇటీవల జరిగిన చిట్యాల మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి బాధ్యతలను ఎమ్మెల్యే అమిత్కు అప్పగించారు. వీరేశం సూచన మేరకు అభ్యర్థుల గెలుపు కోసం సర్వేలు చేయించడం, పోల్ మేనేజ్మెంట్ వ్యవహారాలన్నీ అమిత్ తెరవెనక నుంచే నడిపించారు. మున్సిపల్ ఎన్నికల వార్రూమ్ ఇంచార్జి బాధ్యతలు నిర్వర్తించడంలో కూడా అమిత్ సక్సెస్ అయ్యారు. సర్పంచ్ ఎన్నికల్లో ఉరుమడ్లలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా గట్టిపోటీ ఇచ్చారు. తమ వర్గాన్ని సర్పంచ్గా గెలిపించడంలో సక్సెస్ అయ్యారు.
లేదంటే మిర్యాలగూడ ఆప్షన్
సుఖేందర్ రెడ్డికి రాజకీయంగా మెరుగైన సంబంధాలు కలిగిన నియోజకవర్గాల్లో మిర్యాలగూడ కూడా ఒకటి. పార్లమెంట్ మెంబర్గా మిర్యాలగూడ, నాగార్జునసాగర్, నల్లగొండ, దేవరకొండ సెగ్మెంట్లలో సుఖేందర్ రెడ్డికి బలమైన నాయకత్వం పనిచేస్తోంది. దీంతోనే ఒక వేళ అప్పటి పరిస్థితులు కలిసొస్తే మిర్యాలగూడ నుంచి కూడా పోటీ చేసే అవకాశం లేకపోలేదు. రెడ్డి సామాజికవర్గం బలంగా ఉన్న నకిరేకల్, మిర్యాలగూడ నియోజకవర్గాలు అమిత్కు కలిసొచ్చే అంశం. కాగా ఒకవేళ ఎమ్మెల్యే ఛాన్స్ మిస్సైనా నల్లగొండ, భువనగిరి రెండింటిలో ఎక్కడో చోట ఎంపీగా ఛాన్స్ తప్పక లభిస్తుందనే ఆశాభావం పార్టీ కేడర్లో వ్యక్తమవుతోంది. ఇప్పుడున్న ఎంపీ రఘువీర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధమైతే నల్లగొండ ఎంపీగా అమిత్కు ఛాన్స్ లభిస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు తండ్రి సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీచేసి అసెంబ్లీలో అడుగుపెట్టాలనే కలను కొడుకు నెరవేస్తారనే గుత్తా వర్గం ఆశిస్తోంది.