యాదాద్రి, ఏపీబీ న్యూస్: తెలంగాణలో మరో కీలక పరిపాలనా మార్పు చోటుచేసుకుంది. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఈవోగా (ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) జె. భవాని శంకర్ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జె. భవాని శంకర్ రాజ్భవన్లో గవర్నర్కు జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. నాన్ కేడర్ అధికారిగా ఉన్నప్పటికీ, ఆయన పరిపాలనా అనుభవం, సమర్థతను గుర్తించిన ప్రభుత్వం ఈ కీలక బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం అభివృద్ధి పనులు, భక్తుల సౌకర్యాల మెరుగుదల, పరిపాలనా వ్యవస్థను మరింత పటిష్టం చేయడంలో భవాని శంకర్ కీలక పాత్ర పోషిస్తారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా పరిపాలనా విభాగంలో మార్పులు కొనసాగుతున్నాయి. తాజా ఉత్తర్వుల్లో భాగంగా తెలంగాణలో నాలుగు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. పరిపాలనను మరింత సమర్థవంతంగా నడిపించేందుకు ఈ బదిలీలు దోహదపడతాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. యాదాద్రి వంటి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రానికి కొత్త ఈవో నియామకం జరగడం విశేషంగా మారింది. భవిష్యత్లో దేవస్థానం అభివృద్ధి, సేవల విస్తరణ దిశగా కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.