Breaking News: GHMC పునర్విభజనకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పునర్విభజన వ్యవహారం ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ విభజన ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధమని, కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఉందంటూ దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ, మూడు వారాల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జీహెచ్ఎంసీని మూడు వేర్వేరు కార్పొరేషన్లుగా (జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి) విభజిస్తూ ‘తెలంగాణ మున్సిపాలిటీల (సవరణ) చట్టం-2026’ తీసుకువచ్చింది. అయితే, ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ గురువారెడ్డి అనే వ్యాపారి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టులో పలు కీలక వాదనలు వినిపించారు:

జనగణన నిబంధనల ఉల్లంఘన: 2027లో దేశవ్యాప్తంగా జరగనున్న జనగణన (Census) దృష్ట్యా, పరిపాలనా సరిహద్దులను (Administrative Boundaries) మార్చకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు విధించింది. జనగణన పూర్తయ్యే వరకు ఎలాంటి పునర్విభజనలు చేయకూడదని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (RGI) ఆదేశాలు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ విభజన చేపట్టడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.

పారదర్శకత లోపించింది: గతంలో నగర పరిమితులను మార్చాలంటే ముందస్తుగా నోటిఫికేషన్ ఇచ్చి ప్రజల అభిప్రాయాలను కోరాలనే నిబంధన ఉండేదని, కానీ కొత్త సవరణ ద్వారా ప్రభుత్వం ఆ అధికారాన్ని ఏకపక్షంగా తీసుకుందని పిటిషనర్ ఆరోపించారు.

స్టే విధించాలని విజ్ఞప్తి: ఈ విభజన ప్రక్రియ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని, తక్షణమే ఈ పునర్విభజనపై స్టే విధించాలని కోరారు.

వాదనలు విన్న హైకోర్టు.. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పందన అవసరమని భావించింది. “జీహెచ్ఎంసీ పునర్విభజన ఏ ప్రాతిపదికన చేపట్టారు? కేంద్ర ప్రభుత్వ జనగణన నిబంధనలకు ఇది విరుద్ధమా కాదా?” అనే అంశాలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ప్రస్తుతానికి మధ్యంతర స్టే ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు, తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. అప్పటిలోగా కౌంటర్ అఫిడవిట్లు సమర్పించాలని స్పష్టం చేసింది.

Share
Share