గర్భాశయ క్యాన్సర్‌కు ‘చెక్’: రంగారెడ్డి జిల్లాలో ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రారంభం..

రంగారెడ్డి, ఏపీబీ న్యూస్: మహిళల ప్రాణాలను హరిస్తున్న గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ (Cervical Cancer) నివారణకు రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నడుం బిగించింది. మంగళవారం జిల్లా వ్యాప్తంగా 22 ప్రత్యేక కేంద్రాలలో హెచ్పీవీ (Human Papilloma Virus – HPV) వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డాక్టర్ లలితా దేవి అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా డాక్టర్ లలితా దేవి మాట్లాడుతూ వ్యాక్సిన్ గురించి పలు కీలక విషయాలను వెల్లడించారు:

లక్షిత వయస్సు: 9 నుండి 14 ఏళ్ల లోపు ఉన్న బాలికలకు ఈ వ్యాక్సిన్ అత్యంత కీలకం. చిన్న వయస్సులోనే ఈ టీకా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పును సమర్థవంతంగా అడ్డుకోవచ్చు.

క్యాన్సర్ నివారణ: మహిళల్లో సాధారణంగా వచ్చే గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్తో పాటు, వైరస్ల వల్ల వచ్చే ఇతర రకాల క్యాన్సర్లను కూడా ఈ హెచ్పీవీ వ్యాక్సిన్ నివారిస్తుంది.

పూర్తి సురక్షితం: ఈ టీకా పూర్తిగా సురక్షితమైనదని, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిని ధృవీకరించిందని ఆమె స్పష్టం చేశారు.

ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేల రూపాయలు పలుకుతున్న ఈ హెచ్పీవీ వ్యాక్సిన్ను, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. జిల్లాలోని ఎంపిక చేసిన 22 సెంటర్లలో ఈ సదుపాయం అందుబాటులో ఉందని, తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకు ఈ టీకా వేయించి వారి భవిష్యత్తుకు ఆరోగ్య భరోసా కల్పించాలని డాక్టర్ లలితా దేవి కోరారు.

భారతదేశంలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో గర్భాశయ క్యాన్సర్ ఒకటి. సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది చివరి దశలో ఆసుపత్రులకు వెళ్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ హెచ్పీవీ వ్యాక్సిన్ ఒక గొప్ప అవకాశం. ముఖ్యంగా పాఠశాల విద్యార్థినులకు ఈ టీకా వేయించడం ద్వారా రాబోయే తరంలో ఈ మహమ్మారిని పూర్తిగా తరిమికొట్టే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లా యంత్రాంగం తీసుకున్న ఈ చొరవ అభినందనీయం.

Share
Share