- నల్లగొండ ప్రసాద్ ఉడిపి హోటల్లో డేంజర్ వంటనూనెలు
- పరిమితులకు మించి వాడుతున్న నూనె
- పురుగులు పట్టిన ఫుడ్ ఐటమ్స్, ఎలుకలు, పురుగులు, దుమ్ము దూళితో కిచెన్ రూమ్
- అపరిశుభ్ర వాతావరణంలో కూరగాయాలు
- ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో బయట పడ్డ కల్తీ బాగోతం
నల్లగొండ, ఏపీబీ న్యూస్: నల్లగొండ పట్టణంలో పేరొందిన ప్రసాద్ ఉడిపి హోటల్లో వంట నూనెలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని, ఒకసారి వంటకు వినియోగించిన నూనెను పరిమితులకు మించి వినియోగిస్తున్నట్టు తనిఖీల్లో తేలింది. భారతదేశ ఫుడ్ సేఫ్టీ స్టాండర్స్ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిబంధనల మేరకు ఆర్యూసీఓ (రీ యూజిడ్ కుకింగ్ ఆయిల్) మార్గదర్శకాలకు అనుగుణంగా వంట నూనెల వాడకంలో ఎలాంటి రికార్డులు హోటల్ మేనేజ్మెంట్ మెయింటెన్ చేయడం లేదని బయటపడింది. మంగళవారం టిఫిన్ చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తి ప్లేట్లో సాంబార్లో జెర్రి కనిపించడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. పలు ఛానళ్లలో ఈ దృశ్యాలు ప్రసారమయ్యాయి. దీంతో ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి ఆదేశాల మేరకు నల్లగొండ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ హోటల్ తనిఖీ చేయగా నివ్వెర పోయే నిజాలు బయటపడ్డాయి.

వంటలకు ఉపయోగించే ఫుడ్ ఐటమ్స్ను నేల పైన నిల్వ
హోటల్లో ఫుడ్ లైసెన్స్ బోర్డుమీద లేదని, ఫుడ్ ఐటమ్స్ నిల్వ చేయడంలో కనీస ప్రాథమిక నిబంధనలు కూడా పాటించడం లేదని గుర్తించారు. వంటలకు ఉపయోగించే ఫుడ్ ఐటమ్స్ను నేల పైన నిల్వ చేశారు. రవ్వ, పిండి వంటి ఆహార పదార్ధాలకు పురుగులు పట్టింది. వంటకు పనికిరాని ఇతర ఐటమ్స్ను రవ్వ, పిండిలో నిల్వ చేస్తున్నారు. స్టోర్ రూమ్ ఓపెన్గా ఉంచారు. దాంతో బయటి నుంచి ఎలుకులు, పురుగులు, దుమ్ము ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. అపరిశుభ్రత వాతావరణంలో కూరగాయాలు నిల్వ చేయడం వల్ల పురుగులు, ఈగలు, దుమ్ము పట్టి ఉన్నాయి. వంటగది, స్టోర్ రూమ్లు అపరిశుభ్రంగా ఉన్నాయి. దుమ్ము, నూనెల మరకలతో దుర్వాసన వెదజల్లుతోంది. ఒకసారి వాడిన వంటి నూనెలను మార్చకుండా పరిమితులకు మించి ఫుడ్ ఐటమ్స్ తయారీకీ వాడుతున్నారు. దీనివల్ల ప్రమాధకర రసాయనాలు వినియోగదారుల శరీరంలోకి ప్రవేశిస్తాయి.

పురుగులు పట్టిన ఉప్మా రవ్వ
క్రిమికీటకాలు లోపలికి ప్రవేశించకుండా జాగ్రత్తలు పాటించకపోవడం, క్లీనింగ్ సరిగా లేకపోవడం, స్టోర్ రిజిస్టర్లు, స్టాకు రిజిస్టర్లు మెయింటెన్ చేయడం లేదు. ఈ తనిఖీల్లోభాగంగా పురుగులు పట్టిన ఆరు కిలోల ఉప్మా రవ్వ, 3లీటర్ల వంటనూనెను ధ్వంసం చేశారు. హోటల్ మేనేజ్మెంట్కు నోటీస్ జారీ చేశారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం రెండు నమూనాలు పరీక్షల కోసం సేకరించి ల్యాబ్కు పంపారు. సేకరించిన ఆహార నమూనాల ప్రయోగశాల నివేదికలు ఆధారంగా ఆహార భద్రత, ప్రమాణాల చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి. జ్యోతిర్మయి తెలిపారు.
