- కాంగ్రెస్లో చేరిన మాజీలకు చెక్ పెట్టిన ఓటర్లు
- రెబల్స్ పోటీతో తారుమారవుతున్న ఫలితాలు
- పోలింగ్ పర్సంటేజీలో యాదాద్రి జిల్లా టాప్
- నల్లగొండలో 90.53, సూర్యాపేటలో 89.69, యాదాద్రి జిల్లాలో 92.88 శాతం
నల్లగొండ ప్రతినిధి : ఏపీబీ న్యూస్, డిసెంబర్ 11
తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో నిలిచింది. ఉమ్మడి జిల్లాలో గురువారం 585 పంచాయతీ స్థానాలకు, 4,776 వార్డులకు ఎన్నికలు జరిగాయి. పలు చోట్ల చెదరుమదరు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోనే అత్యధికంగా 92.88 శాతం పోలింగ్ యాదాద్రి జిల్లాలో నమోదైంది. నల్లగొండ జిల్లాలో 90.53శాతం, సూర్యాపేట జిల్లాలో 89.69శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7గంటల నుంచి మొదలైన పోలింగ్ తొలి రెండు గంటల్లో 20 నుంచి 22 శాతం నమోదుకాగా, ఆ తర్వాత రెండు గంటల వ్యవధిలోనే ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. చలి తీవ్రత అధికంగా ఉండటంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ఆలస్యంగా వచ్చారు. ఇతర ప్రాంతాల నుంచి సైతం ఓటర్లు భారీగానే తరలివచ్చారు. దీంతో పోలింగ్ పర్సంటేజీ 28 మండలాల్లో 90 నుంచి 80శాతం వరకు నమోదైంది. మధ్యాహ్నాం 1 గంట వరకు పోలింగ్ ముగిసే సమయానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా క్యూలో నిలుచున్నారు. దీంతో పోలింగ్ ఆలస్యంగా ముగిసింది. మధ్యాహ్నాం 3గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. తదనంతరం వార్డులకు పోలైన ఓట్లను లెక్కించారు. వార్డుల లెక్కింపు తర్వాత సర్పంచ్ అభ్యర్థులకు పోలైన ఓట్లను లెక్కించారు. దీంతో ఫలితాలు ప్రకటించే సరికి అర్ధరాత్రి వరకు పట్టింది.

ఫలితాల్లో కాంగ్రెస్ ఫస్ట్…చీలిన ఓట్లు
ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో నిలిచింది. అయితే ముందు నుంచి ఊహించినట్టుగానే కాంగ్రెస్ రెబల్స్ పోటీవల్ల కాంగ్రెస్ ఫలితాలు తారుమారయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మాజీ సర్పంచ్లకు ఓటర్లు చెక్ పెట్టారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కొత్త అభ్యర్థులను సర్పంచ్లుగా ఎన్నుకున్నారు. నల్లగొండ, నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో ఫలితాలు టెన్షన్ పుట్టించాయి. అన్ని చోట్ల బహుముఖ పోటీ నెలకొనడంతో ఓట్లు చీలిపోయాయి. వార్డు సభ్యులకు పోలైన ఓట్లతో పోలిస్తే సర్పంచ్లకు వచ్చిన మెజార్టీ తగ్గింది. మరికొన్ని చోట్ల వార్డు సభ్యులు ఓడిపోగా, సర్పంచ్లు గెలిచారు. ఎన్నికల ప్రచారంలో సర్పంచ్, వార్డు సభ్యుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. ఎవరికి వారు తమ గెలుపు పైనే ఫోకస్ పెట్టారు. ఎమ్మెల్యేలు మద్ధతు తెలిపిన సర్పంచ్లకు, రెబల్ అభ్యర్థులకు మధ్య ఓట్లు భారీగా చీలిపోవడంతో బీఆర్ఎస్ క్యాండేట్లకు లబ్ధిపొందినట్లు తెలుస్తోంది.

రికార్డు స్థాయిలో పోలింగ్…
నల్లగొండ జిల్లాలో మొత్తం ఓటర్లు 4,51,007 మంది కాగా, 4,08, 316 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ పర్సంటేజీ 90.53శాతం నమోదైంది. పురుషులు 2,22,674 మందికిగాను 2,02,785 మంది ఓటు వేశారు. పోలింగ్ 44.96శాతం నమోదైంది. మహిళలు 2,28,325 మందికిగాను 2,05,529 మంది ఓటు వేశారు. పోలింగ్ 45.57శాతం నమోదైంది. ఇతరులు 8 మందికిగాను ఇద్దరు ఓటు వేశారు. సూర్యాపేట జిల్లాలో మొత్తం ఓట్లు 2,29,227 మందికిగాను 2,05,583 మంది ఓటు వేశారు. పోలింగ్ 89.69శాతం నమోదైంది. పురుషులు 1,13,812 మందికిగాను 1,02,631 మంది (90.18శాతం) ఓటు వేశారు. మహిళలు 1,15,4 10 మందికిగాను 1,02,948 మంది (89.20శాతం) ఓటు వేశారు. ఇతరులు 5 మందికిగాను 4గురు (80శాతం) ఓటు వేశారు. యాదాద్రి జిల్లాలో మొత్తం ఓటర్లు 1,55,552 మందికిగాను 1,44,483 మంది (92.88శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషులు 7,70,077 మందికిగాను 7,20,026 మంది (93.45శాతం), మహిళలు 7,84,073 మందికిగాను 7,24,056 (92.33 శాతం) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇతరులు ఇద్ద రుకుగాను ఒక్కరు ఓటు వేశారు. పోలింగ్ 50శాతం నమోదైంది.

పోలింగ్ సరళి ఇలా…
| జిల్లాపేరు | 7గంటలకు | 11గంటలకు | 1గంటకు (శాతం) |
| నల్లగొండ | 22 | 56.75 | 81.63 |
| సూర్యాపేట | 27.21 | 61.75 | 87.77 |
| యాదాద్రి | 20.29 | 54.84 | 87.99 |

