నల్లగొండ, ఏపీబీ న్యూస్: బాధితులు వివిధ కారణాల వల్ల పోలీస్ స్టేషన్కు వచ్చి స్వయంగా ఫిర్యాదు ఇవ్వలేని ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, తెలంగాణ పోలీస్ శాఖ ప్రజల వద్దకే వెళ్లి న్యాయం అందించే వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా కనగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదనపురం గ్రామానికి చెందిన బొల్లిగొర్ల గురువయ్య అనే వ్యక్తి ఇటీవల ఒక వ్యక్తి దాడిలో గాయపడి, నల్లగొండలోని సంరక్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం పోలీసు అధికారుల దృష్టికి వచ్చింది.
ఈ విషయంపై జిల్లా ఎస్పీ స్పందించి, వెంటనే కనగల్ ఎస్ఐని బాధితుడి వద్దకు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. బాధితుడికి తగిలిన గాయాల కారణంగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు ఇవ్వలేని పరిస్థితి ఉండటంతో, పోలీసులు ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని కలుసుకొని, అతనికి జరిగిన అన్యాయాన్ని వివరంగా అడిగి తెలుసుకున్నారు. బాధితుడి వాంగ్మూలాన్ని అక్కడికక్కడే నమోదు చేసి, స్పాట్లోనే FIR నమోదు చేయడం జరిగింది.