- ఒంటరిగానే పోటీ చేయాలని చెప్పిన హైకమాండ్
- బీఆర్ఎస్తో కలిసిపోతే బెస్ట్ అంటున్న కేడర్
- నల్లగొండ కార్పోరేషన్ పదవి పైన సీనియర్ల కన్ను
- గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో గెలిచింది 28 వార్డులే, 10 మున్సిపాలిటీల్లో సున్నా సీటు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అనుసరించే వ్యూహాం పైన పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పార్టీ హైకమాండ్ సింగిల్ గానే పోటీ చేయాలని స్పష్టం చేసింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పార్టీ కేడర్ భావిస్తోంది. ఇప్పటికే నల్లగొండ, సూర్యాపేట మున్సిపాలిటీల్లో పార్టీ ఎన్నికల సన్నాహాక సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాల్లో ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాల గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో ప్రధానంగా నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, దేవరకొండ, భువనగిరి, చౌటుప్పుల్లో పార్టీకి బలమైన కేడర్ ఉంది.
గత ఎన్నికల్లో గెలుపొందిన 28 వార్డుల్లో అత్యధికంగా నల్లగొండ, సూర్యాపేట, భువనగిరిలోనే ఉన్నాయి. మిగితా చోట్ల రెండు, మూడు వార్డులు మాత్రమే గెలుపొందింది. చిట్యాల, హాలియా, నందికొండ, హుజూర్నగర్, కోదాడ, నేరేడుచర్ల, తిరుమలగిరి, ఆలేరు, మోత్కూరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో ఒక్కసీటు కూడా దక్కలేదు. కొన్ని చోట్ల అసలు పోటీ కూడా చేయలేదు. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం అర్బన్ ఓటర్లు బీజేపీ వైపు చూస్తున్నారు. కానీ పార్టీ నాయకత్వం బలహీనంగా ఉండటం వల్ల ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కడం లేదు.
పొత్తు పెట్టుకుంటేనే లాభం
ఒంటిరిగా పోటీ చేసే శక్తి పట్టణాల్లో బీజేపీకి లేదని ఆ పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. కాంగ్రెస్ను అడ్డుకునేందుకు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలని పట్టుబడుతున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటర్ల తుది జాబితా ప్రక్రియ కూడా పూర్తియ్యింది. సంక్రాంతి తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్నికల సన్నహాక సమావేశాలు స్పీడప్ చేసింది. కానీ బీజేపీ మాత్రం వెనకబడి ఉంది. జిల్లా పార్టీ నాయకత్వంలో నెలకొన్న విభేదాలు, లీడర్ల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల పార్టీ కేడర్లో అసంతృప్తి నెలకొంది. బీఆర్ఎస్లో అన్ని చోట్ల బలమైన అభ్యర్థులు దొరకడం కష్టంగా మారింది. రెండు పార్టీలు దోస్తీ కడితే కాంగ్రెస్ను ఇరకాటంలో పెట్టొచ్చని సీనియర్లు అభిప్రాయ పడుతున్నారు. రిజర్వేషన్లు ప్రకటించక ముందే పొత్తుల పైన ఒక అవగాహనకు వస్తే మంచిదని సూచిస్తున్నారు.

నల్లగొండ పైన సీనియర్లు ఫోకస్
నల్లగొండ కార్పోరేషన్ కావడంతో ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పని చేసేందుకు ఆసక్తిచూపిస్తున్నారు. మేయర్ పదవి దక్కించుకునేందుకు రెండుపార్టీలు పక్కగా ప్లాన్ చేస్తున్నాయి. రిజర్వేషన్ జనరల్ లేదా బీసీ అయితే మాత్రం ఆర్ధికంగా, సామాజికంగా బలమైన లీడర్లే బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డితో సహా సీనియర్ నాయకులు బండారు ప్రసాద్, మాదగోని శ్రీనివాస్గౌడ్, వెంకటనారాయణ రెడ్డి, ఓరుగంటి వంశీ, పిల్లి రామరాజు యాదవ్, తదితరులు మేయర్ పదవి పైన ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో పది వార్డుల్లో ప్రభావితం చేయగలిన బీజేపీ ఆరు వార్డుల్లో గెలిచింది. బీఆర్ఎస్ 20 వార్డుల్లో గెలుపొందింది. మొత్తం 48 వార్డుల్లో రెండు పార్టీలు 26 వార్డుల్లో గెలిస్తే, కాంగ్రెస్ 20, ఎంఐఎం ఒకటి, ఇండిపెండెంట్ ఒకరు గెలిచారు. ఈ ఎన్నికల్లో రెండు పార్టీలు ఏకమైతే మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంటదని సీనియర్లు కొత్త ప్రతిపాదన తెరపైకి తెస్తున్నారు.

