APB News Exclusive: వామ్మో e -బస్​…కేర్ లెస్

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఎలక్ట్రిక్ బస్సుల్లో జర్నీ ప్రమాదకరంగా మారింది. బ్యాటరీలతో నడిచే ఈ-బస్సుల్లో సౌండ్ కూడా బయటకు వినిపించదు, గేర్లు, క్లచ్లు కూడా ఉండవు. స్కూటీ మాదిరి ఎక్సలేటర్ ఎంత ప్రెస్ చేస్తే అంతే వేగంతో బస్సులు రోడ్ల పైన దూసుకెళ్తున్నాయి. ఇంజన్ సౌండ్ బస్సు వెనక భాగంలో వినిపిస్తుంది. దాంతో డ్రైవర్లు ఓవర్ స్పీడ్తో బస్సులు నడపడటం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గతేడాది జులై నుంచి ఈ బస్సులు రోడ్ల మీదకొచ్చాయి, కానీ ఇటీవల కాలంలో నల్లగొండ రీజియన్ పరిధిలో ఈ బస్సుల సంఖ్య పెరిగింది. దాంతో ప్రమాదాలు కూడా పెరిగాయి. కేవలం ఐదారు నెలల వ్యవధిలోనే నల్లగొండ, సూర్యాపేట డిపోల పరిధిలోని ఆరు చోట్ల యాక్సిడెంట్లు చేశాయి. దీంతో ఆరుగురు మరణించారు. ఇవన్నీ జాతీయ రహాదారుల పైన జరిగిన ప్రమాదాలే కావడం గమనార్హం. ఫ్రీ జర్నీ స్కీం ఈ బస్సులకు ఉన్నందున మహిళలే ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు. పల్లె వెలుగు బస్సులు వస్తున్నా వాటిల్లో ఎక్కకుండా ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేవరకు వెయిట్ చేసి మరీ ఎక్కుతున్నారు. ఈ బస్సుల్లో జర్నీ హాయిగా ఉందని, స్పీడ్తో వెళ్తున్నాయని వాటిల్లో ప్రయాణించేందుకే ఆసక్తిచూపిస్తున్నారు. కానీ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే భయం మాత్రం ప్రయాణికుల్లో నెలకొంది.

డ్రైవర్లకు మూడు రోజులు మాత్రమే శిక్షణ ఇస్తున్నారు. అదే ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు మూడు నెలల శిక్షణతో పాటు, అనుభవం కలిగిన సిబ్బంది, అధికారులు డ్రైవింగ్ గురించి అవగాహన కల్పిస్తారు. ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చేవరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తారు. కానీ ఈ బస్సుల్లో అవేవీ పాటించడం లేదు. మొక్కుబడిగా మూడు రోజుల శిక్షణ, ఆ తర్వాత నాలుగైదు రోజుల పాటు అవగాహన కార్యక్రమాలతో మమా అనిపిస్తున్నారు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్, లారీలు, బస్సులు నడపడంలో కనీసం రెండేళ్ల అనుభవం కలిగిన వారినే డ్రైవర్లుగా ఎంపిక చేస్తున్నారు. కానీ ఈ బస్సులు నడపడంలో గతంలో వాళ్లకు ఎలాంటి అనుభవం లేదు. శిక్షణ సరిగా ఇవ్వకపోవడంతో ఓవర్ స్పీడ్తో బస్సులు నడుపుతున్నారు.

ఈ బస్సులు గంటకు 80 కి.మీ వేగంతో ప్రయాణించే సామర్ధ్యం కలిగి ఉన్నాయి. కానీ క్లచ్, గేర్లు లేకపోవడంతో డ్రైవర్లు 80 కి.మీ స్పీడ్తో నడుపుతున్నారు. సాధారంగా ఆర్టీసీ బస్సుల్లో అయితే ఇంజన్ డ్రైవర్ పక్కనే ఉంటుంది. గేర్లు, క్లచ్ ఉంటాయి. స్పీడ్ ఎక్కువ పోతే ఇంజన్ సౌండ్ పెరుగుతుంది, దాంతో డ్రైవర్లు స్పీడ్ను కంట్రోల్ చేసుకుంటారు. అదే ఈ బస్సుల్లో క్లచ్, గేర్లు, సౌండ్ లేకపోవడంతో ఓవర్ స్పీడ్తో నడుపుతున్నారు. ఇటీవల ప్రమాదాలు పెరుగుతున్నాయని స్పీడ్ను 70 కి.మీలకు తగ్గించారు. కానీ క్లచ్, గేర్లు లేకపోవడంతో స్పీడ్ కంట్రోల్ కావడం లేదు. డ్రైవర్లకు అనుభవం లేక పట్టణాల్లో, పల్లెల్లో సైతం ఓవర్ స్పీడ్తో నడుపుతున్నారు.

నల్లగొండ డిపో బస్సులు మూడు, సూర్యాపేట డిపో బస్సులు మూడు చోట్ల యాక్సిడెంట్లు చేశాయి. ఇవన్నీ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహాదారి పైన, యాదిగిరిగుట్టలో, నల్లగొండ పట్టణంలో జరిగాయి. నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ డిపోల పరిధిలో 169 బస్సులు నడుపుతున్నారు. ఇవన్నీ భువనగిరి, దేవరకొండ, మాచర్ల, హైదరాబాద్, మునుగోడు వయా హైదరాబాద్, ఖమ్మం, జేబీఎస్(JBS), ఎంజీబీఎస్(MGBS) వరకు రాకపోకలు సాగిస్తున్నాయి. ఉచిత బస్సు స్కీం వల్ల అన్ని సీట్లు ఫుల్ అవుతున్నాయి. కొన్నింటిలో 45 సీట్లు, మరికొన్ని బస్సుల్లో 55 సీట్లు ఉన్నాయి. ఈ బస్సులు కారణంగా ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో పడిపోయింది.

జేబీఎం అనే సంస్థ దేశవ్యాప్తంగా ఈ బస్సులను సప్లై చేసే కాంట్రాక్టు చేజిక్కించుకుంది. దీనిలో భాగంగా తెలంగాణకు 500 బస్సులు ఒప్పందం కుదిరింది. దాంట్లో ఉమ్మడి నల్లగొండకు 167 బస్సులు వచ్చాయి. వీటి మెయింటెన్స్, డ్రైవర్ల ఎంపిక, శిక్షణ అంతా జేబీఎం సంస్థదే బాధ్యత, కేవలం కండక్టర్లు మాత్రమే ఆర్టీసీ సిబ్బంది ఉంటారు. టికెట్ల కలెక్షన్ టీఎస్ఆర్టీసీకి అప్పగిస్తారు. ప్రమాదాలకు నష్ట పరిహారం కూడా థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ ఉంటుంది కాబట్టి బాధిత కుటుంబాలకు సెటిల్మెంట్ చేస్తున్నారు.

ఈ బస్సులు కావాలని ఎమ్మెల్యేలు, మంత్రులు, పలు చోట్ల నుంచి ప్రజాప్రతినిధులు నల్లగొండ రీజియన్కు పంపిన రిక్వెస్ట్ లెటర్లు ఆమోదం లభిస్తే త్వరలోనే మరిన్ని బస్సులు పెరిగే అవకాశం ఉంది. కానీ చార్జింగ్ స్టేషన్ల సమస్య వల్ల బస్సులు తేవడం ఇబ్బందికరంగా మారింది. ఆర్టీసీ బస్సు కేవలం రూ.30, 40 లక్షలే. కానీ ఈ- బస్సుల ఖరీదు ఒక్కటి రూ.1.70 కోట్లు. 9 పెద్దపెద్ద బ్యాటరీలే ఎక్కువ ఖర్చు. వాటితోనే బస్సులు నడుస్తాయి. బస్సుల చార్జింగ్ స్టేషన్ల ఖర్చు సుమారు రూ.5 కోట్ల వరకు ఉంటుంది. ప్రత్యేకంగా సబ్స్టేషన్, 33 కేవీ లైన్లు బిగించాలి. ఒసారి చార్జింగ్ పెడితే 280 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. చార్జింగ్ స్టేషన్లు ఖర్చుతో కూడుకున్న వ్యవహారమనే ఈ బస్సులను విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు నడపడం లేదు. కేవలం డిపో నుంచి 280 కిలోమీటర్ల రేడియస్ పరిధిలోని సిటీలు, టౌన్లకు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి.

Share
Share