నామినేటెడ్​ పోస్టు రేసులో దుబ్బాక! పీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య?

  • నామినేటెడ్​ పోస్టు రేసులో దుబ్బాక!
  • కీలకనేతల మద్ధతు కూడగడుతున్న సీనియర్​ నేత దుబ్బాక నర్సింహారెడ్డి
  • ఎస్సీ కోటాలో పీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య

నల్లగొండ ప్రతినిధి, ఏబీపీ న్యూస్​: ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్న రాష్ట్రస్థాయి నామినేటెడ్​ పోస్టుల్లో జిల్లా నుంచి పార్టీ సీనియర్​ నేత దుబ్బాక నర్సింహారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆహ్వానం మేరకు బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరిన దుబ్బాక అప్పటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహారిస్తున్నారు. బీఆర్​ఎస్​ నుంచి ఎమ్మెల్యే టికెట్​ ఆశించిన దుబ్బాక చివరి నిమిషంలో పార్టీ హైకమాండ్​ హ్యాండిచ్చింది. కంచర్ల భూపాల్​ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్​ ఇవ్వడంతో దుబ్బాక కాంగ్రెస్​లో చేరారు. కాంగ్రెస్​ అగ్రనేత గులాబ్​నబీ ఆజాద్​ స్వయంగా నల్లగొండకు వచ్చి దుబ్బాకను పార్టీలో చేర్చుకున్నారు. అప్పటి నుంచి పార్టీ విధేయుడిగా కొనసాగుతున్న దుబ్బాక హైదరాబాద్​ కేంద్రంగా పార్టీలో పనిచేస్తున్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే దుబ్బాకకు నామినేటెడ్​ పదవి వస్తదని ఆశించారు. కానీ సమీకరణాలు కుదరకపోవడంతో ఆలస్యమైంది. ఈ నెలాఖరు లేదంటే కొత్త ఏడాది ఆరంభంలోనే నామినేటెడ్​ పోస్టులు భర్తీ చేస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేష్​ కుమార్​ గౌడ్​ ప్రకటించిన సంగతి తెలిసింది. మొదటి విడతలో ఉమ్మడి జిల్లా నుంచి నామినేటెడ్​ పదవులు పొందిన చైర్మన్​లు, డైరక్టర్ల పదవీ కాలం త్వరలో ముగియనుంది. వాళ్ల స్థానంలో కొత్తవాళ్లకు చోటు కల్పించేందుకు పైస్థాయిలో కార్యచరణ సిద్ధమవుతోంది. ఇటీవల మహేష్​ కుమార్​ గౌడ్, మీనాక్షి నటరాజన్​ జిల్లాకు చెందిన ఆశావహులతో చర్చించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో దుబ్బాక జిల్లా ముఖ్యనేతలను సంప్రదించి మద్ధతు కూడగడుతున్నట్టు తెలిసింది.

ఎస్సీ కోటాలో పీసీసీ ఉపాధ్యక్షడు కొండేటి మల్లయ్య సైతం కార్పోరేషన్​ రేసులో ఉన్నారు. ఇప్పటికే అనేక ఛాన్స్​లు మిస్సైన మల్లయ్య ఇదే చివరి అవకాశంగా భావిస్తున్నారు. సీనియర్​ నేత జానా రెడ్డి ప్రధాన అనుచరుడైన మల్లయ్య నకిరేకల్​ ఎమ్మెల్యే సీటు కోసం గత మూడు టర్మ్​ల నుంచి తీవ్రంగానే ప్రయత్నించారు. ఇటీవల జరిగిన డీసీసీ పదవుల నియామకాల్లోనూ ఆయన పేరు వినిపించింది. కానీ సామాజిక సమీకరణాల కుదరలేదు. పైగా ఎస్సీ మాదిగ సామాజికవర్గం కోటాలో నల్లగొండ జిల్లాకు ప్రయార్టీ ఇవ్వాలనే హైకమాండ్​ ఆలోచిస్తోంది. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల సపోర్ట్  మల్లయ్యకు ఉండటంతో ఈ దఫా లైన్​క్లియర్​ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు.

Share
Share