మంచిర్యాల, ఏపీబీ న్యూస్: జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో అర్ధరాత్రి వేళ ఓ పోలీసు కానిస్టేబుల్ మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా నడిరోడ్డుపై దాడికి దిగడంతో పాటు, అర్ధనగ్నంగా హల్చల్ చేస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేశాడు.
ఘటన వివరాలు:
మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న రవి ప్రసాద్, తన భార్య శిరీషతో కలిసి రెడ్డి కాలనీలో నివసిస్తున్నారు. శిరీష గుడిపేట బెటాలియన్లో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. అయితే, గత కొంతకాలంగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న రవి ప్రసాద్, తరచూ ఆమెతో గొడవ పడుతుండేవాడు.
ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన రవి ప్రసాద్, శిరీషతో గొడవకు దిగాడు. వివాదం ముదరడంతో ఆగ్రహం తట్టుకోలేక ఆమెను రోడ్డుపైకి లాక్కొచ్చి విచక్షణారహితంగా చితకబాదాడు.
రోడ్డుపై వీరంగం:
దాడి సమయంలో రవి ప్రసాద్ అర్ధనగ్నంగా ఉండి, మద్యం మత్తులో నోటికి వచ్చినట్లు బూతులు తిడుతూ బీభత్సం సృష్టించాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిని కూడా బెదిరించడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి, బాధ్యతాయుతమైన పోలీస్ శాఖలో పనిచేస్తూ ఇలా ప్రవర్తించడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసుల విచారణ:
భర్త దాడి నుంచి తప్పించుకున్న శిరీష, వెంటనే మంచిర్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త నుంచి తనకు ప్రాణహాని ఉందని, నిరంతరం వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు రవి ప్రసాద్ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.