నవీన్ యాదవ్‌కు మద్దతుగా పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ విస్తృత ప్రచారం

హైదరాబాద్(APB News): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి వి. నవీన్ యాదవ్కు మద్దతుగా సోమాజిగూడ డివిజన్ లోని ఎల్లారెడ్డి గూడలో పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో స్థానిక వ్యాపారస్తులు, అపార్ట్ మెంట్ వాసులతో మమేకం అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం ఈ రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 కే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తదితర పథకాల్ని లబ్ధిదారులకు అందిస్తున్నామని చెప్పారు. ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ విస్తరణ, అభివృద్ధి పనుల గురించి వివరించారు. చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను ఆశీర్వదించాలని అభ్యర్థించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు. ప్రజలు ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని స్థానిక ఓటర్లను కోరారు. గత ప్రభుత్వం పదేళ్లలో రాష్టాన్ని అప్పులకుప్పగా మార్చిందని, అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తం అయ్యాయని తెలిపారు. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్న మ్యానిఫెస్టోలోని ఒక్కో పథకం అమలు చేస్తూ.. ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకున్నామని వివరించారు. ఇంకా చేయాల్సింది చాలా ఉందని, ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు. ఈ ఉప ఎన్నిక ప్రచారంలో కోట నీలిమ వెంట సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share
Share