- నీలగిరి మేయర్ రేసులో మళ్లీ…ఆ ముగ్గురు!
- కాంగ్రెస్లో మేయర్ పీఠం పైనే జోరుగా చర్చ
- మంత్రి కోమటిరెడ్డి ప్రధాన అనుచరులైన మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,
- గుమ్మల మోహన్ రెడ్డి, అబ్బగోని రమేష్గౌడ్ గత ఎన్నికల్లోనూ ఈ ముగ్గురే పోటీ
- జనరల్ అయితే రెడ్డి, బీసీ అయితే అబ్బగోని?
- అధికారికంగా గెజిట్ జారీ చేసిన ప్రభుత్వం
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నీలగిరి మేయర్ పీఠం పైన కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. నల్లగొండ పట్టణాన్ని కార్పోరేషన్గా మారుస్తున్నట్టు బుధవారం ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. దీంతో మున్సిపల్ ఎన్నికలతో పాటే నీలగిరి కార్పోరేషన్ ఎన్నికలు కూడా జరుగుతాయని తేలిపోయింది. మొన్నటి వరకు కార్పోరేషన్ ఎన్నికల పైన నెలకొన్న అనుమానాలకు తెరపడినట్లైంది. ఇప్పుడున్న 48 వార్డుల్లో ఎలాంటి మార్పు ఉండదు. బీసీ డెడికేషన్ కమిటీ రిపోర్ట్ ప్రకారం పంచాయతీ ఎన్నికల తరహాలోనే రొటేషన్ పద్ధతిలోనే మున్సిపల్, కార్పోరేషన్ రిజర్వేషన్లు కూడా మారుతాయని అధికారులు స్పష్టం చేశారు. దీంతో నీలగిరి వార్డులు (డివిజన్లు)తోపాటు, మేయర్ పదవి రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ రిజర్వేషన్లు తారుమారైతే ఇప్పుడున్న కౌన్సిలర్లు సైతం ఇచ్చుపుచ్చుకునే దోరణిలో సీట్ల సర్ధుబాటు చేసుకునేందుకు మంతనాలు జరుపుతున్నారు. ఇక అత్యంత కీలమైన మేయర్ పదవి జనరల్ లేదా బీసీలకు రిజర్వు అయితే మాత్రం ప్రముఖంగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అనుచరులైన మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్గౌడ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
మంత్రి అనుచరులుగా గుర్తింపు పొందిన ఈ ముగ్గురిలో ఎవరో ఒకరికి మాత్రం కచ్చితంగా మేయర్ పదవి ఖాయమని పార్టీలో చర్చించుకుంటున్నారు. అసెంబ్లీలో కార్పోరేషన్ బిల్లు ఆమోదం పొందినప్పటి నుంచే ఈ ముగ్గురి పేర్లు చర్చకు వచ్చాయి. కౌన్సిలర్లు సైతం తమ సీటు పదిలం చేసుకునేందుకు వీళ్లతోనే నిత్యం టచ్లో ఉంటున్నారు. దాంతో మంత్రి కోమటిరెడ్డి నిర్ణయం మేరకే అభ్యర్థుల ఎంపిక ఉంటదని, ఎలాంటి అపోహలకు గురికావొద్దని ఈ ముగ్గురు ప్రకటించారు. కానీ మంత్రి మాత్రం కార్పోరేషన్లో 45 సీట్లు గెలుపొందాలని టార్గెట్ పెట్టారు. తాను చేస్తున్న అభివృద్ధికి పట్టణ ప్రజలు రిటర్న్ గిఫ్ట్గా కార్పోరేషన్ ఇవ్వాలని కోరారు. మంత్రి కోరిక మేరకు 45 డివిజన్లు పట్టణంలో గెలుపొందాలంటే బలమైన మేయర్ అభ్యర్థులు బరిలో ఉంటేనే సాధ్యమవుతుందని, అది కూడా ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు కచ్చితంగా ఉండాల్సిందేనని పార్టీ కేడర్ బలంగా కోరుకుంటోంది.
ముగ్గురూ…ముగ్గురే
రాష్ట్ర రాజకీయాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిజీగా ఉండటంతో నల్లగొండలో జరుగుతున్న పట్టణాభివృద్ధి కార్యక్రమాల్లో ఈముగ్గురే కీలకంగా వ్యవహారిస్తున్నారు. పట్టణంలో జరుగుతున్న రెండు వేల కోట్ల పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో సైతం చురుకైన పాత్ర పోషిస్తున్నారు. దాంతో పట్టణంలో ఏ నలుగురు కలిసినా ఈ ముగ్గురి గురించే చర్చ జరుగుతోంది. మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గత ఎన్నికల్లో 20 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. తన సతీమణి చైతన్య రెడ్డిని సైతం గెలిపించి రికార్డు సృష్టించారు. 2014లో బొడ్డుపల్లి లక్ష్మీ చైర్మన్ కాగా, వైస్ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి పనిచేశారు. నిజానికి ఈ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థిగా గుమ్మల మోహన్ రెడ్డి భార్యను ప్రకటించారు. కానీ ఆమె కౌన్సిలర్గా ఓడిపోవడంతో లక్ష్మీకి అవకాశం దక్కింది. మళ్లీ 2020లో జరిగిన ఎన్నికల్లో శ్రీనివాస్ రెడ్డిని చైర్మన్ క్యాండేట్గా ప్రకటించారు. 48 వార్డుల్లో 20 వార్డులు కాంగ్రెస్ గెలుపొందగా బీజేపీ, ఇతర పార్టీలోని కౌన్సిలర్ల మద్ధతుగా చైర్మన్ అయ్యేందుకు మంత్రి కోమటిరెడ్డి సహకారంతో చక్రం తిప్పారు. కానీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఎక్స్ ఆఫిషియో సభ్యుల బలంతో బీఆర్ఎస్ చైర్మన్ పదవి దక్కించుకుంది. అప్పుడు వైస్ చైర్మన్గా అబ్బగోని రమేష్గౌడ్ ఎన్నికయ్యారు. నాలుగేళ్ల తర్వాత చైర్మన్ సైదిరెడ్డి పై అవిశ్వాస తీర్మానం పెట్టించి శ్రీనివాస్ రెడ్డి చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు.
రిజర్వేషన్ల పైన ఆశలు
మేయర్ పదవి జనరల్ లేదా జనరల్ మహిళకు రిజర్వు అయితే శ్రీనివాస్ రెడ్డి, మోహన్రెడ్డి ఇద్దరిలో ఒకరు కచ్చితంగా మేయర్ అవుతారనే టాక్ వినిపిస్తోంది. ఎంపీ, ఎమ్మెల్సీ, డీసీసీ, కార్పోరేషన్ చైర్మన్ ఇలా అనేక పర్యాయాలుగా పదవులు ఆశించి భంగపడ్డ మోహన్రెడ్డి రేసులో ఉండొచ్చని అంటున్నారు. 2014లో జనరల్ మహిళకు రిజర్వు అయినప్పుడు కూడా వీళ్లద్దరి మధ్యనే పోటీ జరిగింది. కానీ మోహన్ భార్య ఓడిపోవడంతో బొడ్డుపల్లి లక్ష్మీని చైర్మన్ చేశారు. మళ్లీ 2020లో జనరల్ రిజర్వు అయ్యింది. దాంతో శ్రీనివాస్ రెడ్డిని చైర్మన్ క్యాండేట్గా బరిలో దింపారు. 20వార్డులు గెలుపొందినప్పటి కీ బీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో చైర్మన్ ఛాన్స్ కొద్దిలో మిస్సైంది.
అబ్బగోని రమేష్ గౌడ్కు చైర్మన్ ఛాన్స్ రెండుసార్లు వచ్చింది. కానీ 2000, 2005లో జనరల్ అయినప్పుడు గౌడ సామా జికవర్గం నుంచి పుల్లెంల వెంకటనారాయాణ గౌడ్ చైర్మన్ అయ్యారు. దాంతో ఆవర్గానికి మళ్లీ ఛాన్స్ ఇవ్వడం కుదరలేదు. ఆ తర్వాత రెండుసార్లు జనరల్, జనరల్ మహిళ అయినప్పుడు రెడ్డి వర్గం లీడర్లు బరిలో దిగారు. కాబట్టి ఈ దఫా మేయర్ పదవి బీసీ లేదా మహిళలకు రిజర్వు అయితే అబ్బగోని రమేష్ గౌడ్, లేదా అతని భార్య మాజీ కౌన్సిలర్ రేసులో ఉంటారని చెప్తున్నారు. ఆమెతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మీ పేరు కూడా ప్రచారం లో ఉంది. ప్రభుత్వం నియమించిన బీసీ డెడ్కేటెడ్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో చైర్మన్, మేయర్ పదవులు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు మెజార్టీ సీట్లు బీసీలకే రిజర్వు అయ్యే అవకాశం ఉందని పార్టీ హైకమాండ్ సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలో సర్వేల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తామని కూడా ప్రకటించింది. దీనిలో భాగంగానే అన్ని చోట్ల సర్వేలు మొదలయ్యాయి.