- రెండు జిల్లాల మధ్య ‘డిండి’ చిచ్చు !
- ఏదుల రిజర్వాయర్ నుంచి నీటి తరలింపు విషయంలో రగడ
- పాలమూరు రంగారెడ్డికి 436 మీటర్ల ఎత్తునుంచే నీరు
- డిండి స్కీంకు మాత్రం 440 మీటర్లకు పెంపు
- వివాదం రేపిన రిటైర్డ్ ఈఎన్సీ ఇచ్చిన సర్క్యూలర్
- టెండర్లు పూర్తియినా.. మొదలు కానీ బ్యారేజీ పనులు
- దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన సర్కార్
- మంత్రి ఉత్తమ్ పైనే భారం మోపిన ఎమ్మెల్యేలు
- జిల్లాకు అన్యాయం జరగదని చెప్పిన మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ – మహాబూబ్నగర్ జిల్లాల మధ్య డిండి ఎత్తిపోతల పథకం మరోసారి కొత్త వివాదానికి తెరలేపింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పడకేసిన ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కదిలిక వచ్చింది. రూ.1500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన డిండి లిఫ్ట్ స్కీం మొదటి నుంచి వివాదస్పదంగానే మారింది. నీటి వాటాల కేటాయింపులో పాలమూరు జిల్లాతో తలెత్తిన విభేదాల వల్ల అప్పటి ప్రభుత్వం డిండి లిప్ట్ స్కీం పనులు చేపట్టకుండా వదిలేసింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టుబట్టి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఒప్పించి తొలి ప్రయత్నంలోనే టెండర్ల దశ పూర్తి చేశారు. టెండర్లు, అగ్రిమెంట్లు పూర్తికాగా, పాలమూరు వైపు రిజర్వాయర్లు, కాలువల పనులు శరవేగంగా సాగుతున్నాయి. కానీ డిండి వైపు పనులు మాత్రం మొదలు కాలేదు. ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన మొదట్లో డిండి స్కీంకు ఎక్కడి నుంచి నీటిని తరలించాలనే సమస్య రెండు జిల్లాల మధ్య పెద్ద చిచ్చురేపింది. గత ప్రభుత్వం ఈ వివాదాన్ని ఏటూ తేల్చకుండా పక్కన పడేసింది. పదేళ్ల నుంచి పెండింగ్లో ఉన్న వివాదాన్ని కాంగ్రెస్ ఎట్టకేలకు పరిష్కార మార్గాన్ని చూపింది. పాలమూరు కింద చేపడుతున్న రిజర్వాయర్లలో ఏదుల నుంచి నీటిని డిండి లిఫ్ట్ స్కీంకు తరలించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంత వరకు బాగానే ఉందని భావిస్తున్న తరుణంలో ఇప్పుడు కొత్త సమస్య పుట్టుకొచ్చింది.
ప్రాజెక్టు నేపథ్యం ఇదీ
కృష్ణా నదీ నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు రోజుకు 1.50 టీఎంసీ(TMC)లు, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు 0.5 టీఎంసీ(TMC)లు చొప్పున డ్రా చేయాలనేది ఒప్పందం. 60 రోజుల్లో రోజుకు రెండు టీఎంసీలు అంటే నెలకు 120 టీఎంసీలు. దాంట్లో 1.50 టీఎంసీలు 60 రోజుల్లో పాలమూరు రంగారెడ్డికి, 0.5 టీఎంసీ చొప్పున 60 రోజుల్లో డిండి స్కీం కు నీటిని తరలించాలని 2015లో అప్పటి ప్రభుత్వం ప్రతిపాధించింది. దీనిలో భాగంగా పాలమూరు రంగారెడ్డి వైపు ఏదుల, వట్టెం, నార్లాపూర్ మూడు రిజర్వాయర్లు నిర్మించారు. ఈ పనులు ఎప్పుడో కంప్లీట్ చేశారు. అదే క్రమంలో నల్లగొండ జిల్లాలోని 11 రిజర్వాయర్ల చేపట్టారు. దీంట్లో కిష్ట రాంపల్లి, చింతపల్లి రిజర్వాయర్లు మినహా మిగితా రిజర్వాయర్ల పనులు పూర్తి చేశారు. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్(R&R) ప్యాకేజీ వల్ల నాగర్కర్నూల్ జిల్లాలోని ఎర్రబెల్లి గోకారం, రంగారెడ్డి జిల్లాలోని ఇర్విన్ రిజర్వాయర్లు, నల్లగొండ జిల్లాలో ప్రధాన కాలువల పనులు పెండింగ్లో ఉన్నాయి.
కాంగ్రెస్ వచ్చాకే ఏదుల ఫైనల్
నీటి వాటాల కేటాయింపులో రెండు జిల్లాల మధ్య ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా నాయకులు, ఇరిగేషన్ ఆఫీసర్లు ఆ జిల్లా ప్రయోజనాలకే పెద్దపీట వేశారు. దీంతో నల్లగొండ జిల్లాకు జరుగుతున్న అన్యాయం గురించి అప్పటి బీఆర్ఎస్ లీడర్లు ఎవరూ పట్టించుకోలేదు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జోక్యంతో ఏదుల నుంచి డిండి లిఫ్ట్ స్కీంకు నీటిని తరలించే విధంగా రెండు జిల్లాల వైపు ఒప్పందాలు జరిగాయి. కానీ ఇరిగేషన్ ఉన్నతాధికారి పదవీ విమరణ చేయడానికి ముందు ఇచ్చిన సర్క్యూలర్ కొత్త వివాదానికి తెరలేపింది. అక్కడి జిల్లా నాయకుల ఒత్తిళ్ల మేరకు ఈఎన్సీ(ENC) ఇచ్చిన సర్వ్యూలర్ ఇప్పుడు గొడవకు దారి తీసింది.
నీటి తరలింపులో స్పష్టత ఇవ్వని సర్కార్
ఏదుల రిజర్వాయర్ నుంచి ఎన్ని మీటర్ల ఎత్తులో నీటిని డిండికి తరలించాలనే అంశం పైన ప్రభుత్వం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. ఏదుల నుంచి 436 మీటర్ల ఎత్తు నుంచే పాలమూరు-రంగారెడ్డి జిల్లాల రిజర్వాయర్లు నింపాలన్నది ఈఎన్సీ ఉత్తర్వుల సారాంశం. దీని వల్ల డిండి లిఫ్ట్ స్కీంకు భారీ నష్టం జరుగుతుంది. 436 మీటర్లు ఎత్తు నుంచే పాలమూరు వైపు 8 మోటార్లు రన్ చేసి నీటిని తరలించాలని, అదే డిండి లిఫ్ట్ స్కీంకు మాత్రం 443 మీటర్ల ఎత్తు నుంచి నీటిని లిఫ్ట్ చేయాలని ఈఎన్సీ ఉత్తర్వులు ఇచ్చారని చెప్తున్నారు. రెండు జిల్లాల మధ్య 7 మీటర్ల తేడాతో అనుమతులు ఇవ్వడం వల్ల డిండి లిఫ్ట్ స్కీంకు 30 టీఎంసీలకు బదులు కేవలం ఏడు టీఎంసీల నీరు మాత్రమే జిల్లాకు సరఫరా అవుతది. రోజుకు 6 వేల క్యూసెక్కు లకు బదులు కేవలం 1500 క్యూసెక్కులు మాత్రమే డిండి పరిధిలో ని రిజర్వాయర్లకు వస్తాయి. నీటి తరలింపు అంశం పైన ఈఎన్సీ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కూడా ఇచ్చిండని, దాంతోనే వివాదం మొదలైందని అంటున్నారు.
ఎమ్మెల్యేల టార్గెట్ మంత్రి ఉత్తమ్
డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను మంత్రి ఉత్తమ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, బాలూ నాయక్ చొరవ చూపడంతోనే ప్రాజెక్టు ముందుకు కదలింది, కానీ ఇప్పుడు ఈ ప్రాంతం లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రి ఉత్తమ్ను టార్గెట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏదోవిధంగా ఒప్పించాల్సిన బాధ్యత ఉత్తమ్దేనని, ఆయన జోక్యం చేసుకుంటే తప్పా సమస్యకు పరిష్కారం దొరకదని ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు. శనివారం నల్లగొండలో జరిగిన ప్రగతి ప్రణాళిక సమీక్షలో డిండి గురించే ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం లేవనెత్తారు. దీనికి ఎమ్మెల్యేలు బాలు మద్ధతు తెలపడంతో, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోక్యం చేసుకుని సర్ధి చెప్పారు. రెండు జిల్లాల ప్రజలకు అన్యాయం జరగకుండా సీఎం రేవంత్ సానుకూలంగానే నిర్ణయం తీసుకుంటారని హామీ ఇచ్చారు.
డిండి పైన డోంట్ వర్రీ
డిండి లిఫ్ట్ స్కీం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇంజినీరింగ్ నిపుణులు చెప్తున్నారు. సీఎం రేవంత్ రెండు జిల్లాలకు సమానంగా నీళ్లు ఇచ్చేందుకే సముఖుత వ్యక్తం చేశారని అంటున్నారు. 436 ఎత్తులోనే రెండు జిల్లాల వైపు నీటిని తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం అంగీకరించిందని, ఈ మేరకు మంత్రి ఉత్తమ్ నేతృత్వం లో ఇటీవలే చర్చలు కూడా జరిగాయని చెప్తున్నారు. ఏదుల రిజర్వాయర్లో 437 అడుగుల మేర నీటి నిల్వలు వచ్చే వరకు రెండు జిల్లాల వైపు నీటిని విడుదల చేయోద్దని, నిర్ధేశించిన మేరకు నీటి నిల్వలు చేరుకోగానే పాలమూరు వైపు మోటార్లు ఆన్ చేస్తారని, డిండి రిజర్వాయర్లకు నీటిని విడుదల చేస్తారని తెలిపారు.
త్వరలో బ్యారేజీ పనులు మొదలు
నీటిని లిఫ్ట్ చేయడంలో స్పష్టత లేకపోవడం వల్ల డిండి ప్రాజెక్ట్ ఎగువ భాగంలో దుందుంబి నదీ సమీపంలో పోతిరెడ్డిపల్లి చెక్ డ్యాం వద్ద ప్రతిపాధించిన బ్యారేజీ పనులు మొదలు పెట్టలేదు. టెండర్లు, అగ్రిమెంట్లు పూర్తియినప్పటికీ ఏదుల నుంచి ఎన్ని మీటర్ల ఎత్తు నుంచి నీటిని లిఫ్ట్ చేయాలో అర్ధంగాక పనులు చేపట్టలేదు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వియ్యంకుడు డిండి ప్రాజెక్టు పనులు చేపడుతున్నారు. అమిత్ రెడ్డి ప్రాజెక్టు పనులు పర్యవేక్షిస్తున్నందున వీలైనంత త్వరగానే డిండి స్కీం పూర్తివుతుందని భావిస్తున్నారు.