- కాంగ్రెస్ లో డిప్యూటీ పదవి ఆశిస్తున్న రమేష్ గౌడ్
- ముస్లిం, లేదా ఎస్సీ లకు ఇవ్వాలనే ఆలోచన
- డిప్యూటీ ఇవ్వకపోతే ఎన్నికల్లో పోటీకి నిరాకరణ
- డైలామాలో వలసొచ్చిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు?
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నీలగిరి కార్పోరేషన్ డెప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్‌లో కొత్త చిచ్చు రాజేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ డిప్యూటీ మేయర్ పదవిని ఆశిస్తున్నారు. ఆయన వార్డు జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. ఈ ఎన్నికల్లో రమేష్ భార్య, మాజీ కౌన్సిలర్ కవితను కార్పోరేటర్‌గా నిలబెట్టాలని భావిస్తున్నారు. ఈ మేరకు డెప్యూటీ పదవి తనకు ఇస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తానని పార్టీ పెద్దలకు స్పష్టం చేసినట్టు తెలిసింది. మేయర్ గా బుర్రి శ్రీనివాస్ రెడ్డి భార్య మాజీ కౌన్సిలర్ చైతన్య అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్టే, కాబట్టి డిప్యూటీ మేయర్ పేరు కూడా ప్రకటించాలని రమేష్ పట్టు బడుతున్నట్టు తెలిసింది. ఒకవేళ తనకు డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వనట్లైతే ఎన్నికల్లో పోటీ చేయనని కూడా చెపుతున్నారు.
ఎప్పటి నుంచో మున్సిపల్ చైర్మన్ కావాలన్నది రమేష్ గౌడ కోరిక
గత రెండు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో చైర్మన్ అయ్యే అవకాశం వచ్చింది. కానీ గతంలో జనరల్ అయినప్పుడు గౌడ వర్గానికే ప్రయార్టీ ఇవ్వడంతో రమేష్ అవకాశం కోల్పోయారు. మళ్లీ ఈ ఎన్నికల్లో మున్సిపాలిటీ యాధావిధిగా కొనసాగితే రొటేషన్ సిస్టమ్‌లో చైర్మన్ స్థానం బీసీలకు రిజర్వు అయితే తనకు అవకాశం వస్తదని భావించారు. కానీ ఊహించని విధంగా కార్పోరేషన్‌గా మారడంతో రిజర్వేషన్ మారింది. జనరల్ మహిళకే మేయర్ స్థానం రిజర్వు చేశారు. జనరల్ మహిళ కావడంతో బీసీలకు మేయర్, చైర్మన్ పదవులు దక్కడం కష్టం. ఆ కోటాలో అగ్రవర్ణాలకే ప్రయార్టీ ఇస్తారు. పక్కనే ఉన్న మిర్యాలగూడ మున్సిపాలిటీ కూడా జనరల్ మహిళలకు రిజర్వు అయ్యింది. గతంలో జనరల్ కోటాలో వైశ్య వర్గానికి చెందిన తిరునగరు భార్గవ్ చైర్మన్ అయ్యారు. కానీ ఇప్పుడు జనరల్ మహిళ కోటాలో కాంగ్రెస్ నుంచి రెడ్డి వర్గానికే ప్రయార్టీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఎలాగూ మేయర్ పదవి అదే వర్గానికి ఇస్తున్నందున డిప్యూటీ మేయర్ పదవి బీసీలకు కాకుండా ముస్లిం మైనార్టీ లేదంటే ఎస్సీ వర్గానికి ఇవ్వాలనే ప్రతిపాధన తెచ్చినట్టు సమాచారం.
వలస కౌన్సిలర్లకు కష్టమే
అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసొచ్చిన కౌన్సిలర్లకు ఈ ఎన్నికల్లో బీఫాం ఇవ్వడం కష్టమేనని అంటున్నారు. నల్లగొండలో రమేష్ తోపాటు 10 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. సర్వే ప్రకారం వీళ్లలో కొందరికి టికెట్ కష్టమే అని చెప్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ మేరకు గతంలో ఓడిపోయిన అభ్యర్థులకు లేదంటే కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వనున్నారు. రమేష్ గౌడ్ కూడా తనకు డిప్యూటీ మేయర్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పక్క వార్డులో పోటీ చేస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది.