- జిల్లా సహకార కేంద్రం బ్యాంకు చైర్మన్ పదవి కోసం అప్పుడే లాబీయింగ్
- రేసుల్లో బలమైన కాంగ్రెస్ లీడర్లు
- మాజీ చైర్మన్ కుంభం, వైస్ చైర్మన్ ఏసిరెడ్డి, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, మాజీ ఎంపీపీ లింగారెడ్డి,
- సీనియర్ నేత చింతకుంట్ల లక్ష్మీనారాయాణ రెడ్డి
- ఎన్నికలు రద్ధు చేసి, నామినేట్ చేస్తారనే ప్రచారం
- వ్యవసాయ మార్కెట్ కమిటీల తరహాలోనే చైర్మన్లు, డైరక్టర్లు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సంస్థ చైర్మన్ పదవి కోసం అప్పుడే లాబీయింగ్ మొదలైంది. కాంగ్రెస్లోని స్ట్రాంగ్ లీడర్లు ఈ పదవి కోసం పోటీపడటం ఆసక్తిని రేపుతోంది. ఎప్పటిలాగే ఈ పదవిని మళ్లీ రెడ్లకే కట్టబెడ్తారనే చర్చ జోరుగా సాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు డీసీసీబీ పైన రెడ్ల ఆధిపత్యమే నడుస్తోంది. ఈ క్రమంలో ఈసారి కూడా అదే సామాజిక వర్గానికే కట్టబెడ్తారని విశ్వనీయ సమచారం. ఈ దఫా సహకార సంఘాల ఎన్నికలు రద్ధు చేసి సొసైటీల నుంచి డీసీసీబీ వరకు చైర్మన్లు, డైరక్టర్లను నామినెట్ చేస్తారనే చెప్తున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల తరహాలో రిజర్వేషన్ల పద్ధతిన డైరక్టర్లు, చైర్మన్ లను ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తారని, ఆ మేరకు ప్రభుత్వం జీవో ఇస్తదని అంటున్నారు. ఎన్నికలు లేనందున డీసీసీబీ పదవి పైన అనేక మంది తమ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు.
డీసీసీబీ పైన రెడ్లదే ఆధిపత్యం
డీసీసీబీ పైన మొదటి నుంచి రెడ్లదే ఆధిపత్యం నడుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు పదవుల పంపకాలను బట్టి డీసీసీబీని కైవసం చేసుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తుంగతుర్తికి చెందిన సీనియర్ నేత బీరవోలు సోమిరెడ్డి డీసీసీబీ చైర్మన్గా పనిచేశారు. ఈయన తర్వాత సీనియర్ నేత జానారెడ్డి అనుచరుడు ఎడవెల్లి విజయేందర్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ సన్నిహితుడు కమ్మసామాజిక వర్గానికి చెందిన ముత్తవరపు పాండురంగారావు (కోదాడ), చైర్మన్లు సుధీర్ఘకాలం పాటు పనిచేశారు. మళ్లీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత భర్త, గొంగిడి మహేందర్ రెడ్డి చైర్మన్గా ఎన్నికయ్యారు. ఈయన పదవీకాలం ముగియకముందే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దాంతో మహేందర్ రెడ్డి పైన డైరక్టర్ కుంభం శ్రీనివాస్ రెడ్డి అవిశ్వాస తీర్మానం పెట్టించి చైర్మన్గా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుడైన శ్రీనివాస్ రెడ్డికి మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి సపోర్ట్ కూడా ఉండటంతో శ్రీనివాస్ రెడ్డి చైర్మన్ అయ్యేందుకు కలిసొచ్చింది.
చైర్మన్ రేసులో హేమా హేమీలు
డీసీసీబీ చైర్మన్ రేసులో హేమాహేమీలు పోటీ పడుతున్నారు. వీళ్ల లో ఇప్పటికే తెరవెనక పెద్ద ఎత్తున లాబీ స్టార్ట్ చేశారు. ప్రధానంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అత్యంత సన్నిహితుడు తిప్పర్తి మాజీ జడ్పీటీసీ పాశం రాంరెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి కోమటిరెడ్డి సూచనల మేరకు కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. నల్లగొండ మేయర్ ఎన్నికల్లో రాంరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. పాత కాంగ్రెస్ సీనియర్ నేతగా జిల్లా అగ్రనేతలతో సత్సంబందాలు కలిగి ఉన్నారు. ఇక తాజా, మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ ఏసి రెడ్డి దయాకర్ రెడ్డి లు సైతం చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. ఏడాదిన్నర పాటే చైర్మన్గా పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి ఈ దఫా ఐదేళ్ల పద వీకాలం చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఆయన హాయంలోనే డీసీసీబీ 23 వందల కోట్ల నుంచి దాదాపు 3వేల కోట్ల టర్నోవర్కు చేరింది. కొత్త బ్రాంచీల ఆదునీకీకరణ, ఉద్యోగుల పదోన్నతుల్లో ఎలాంటి పైరవీలకు తావులే కుండా నియామకాలు చేపట్టారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులు కూడా ఉండటం కుంభంకు కలిసొచ్చే అంశం. కాగా వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్ రెడ్డిది చిట్యాల మండలం గుండ్రాంపల్లి. నకిరేకల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎవరికీ నామినేటెడ్ పోస్టు దక్కలేదు. పైగా కోమటిరెడ్డి బ్రదర్స్తో దయాకర్ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. శ్రీనివాస్రెడ్డిని చైర్మన్గా ఎన్నుకున్నప్పుడే దయాకర్ రెడ్డి కూడా పోటీ పడ్డారు. కానీ క్యాంపు రాజకీయాలు నడిపించి, మెజార్టీ డైరక్టర్లు శ్రీనివాస్ రెడ్డి వైపు మొగ్గుచూపడంతో దయాకర్ రెడ్డికి కలిసిరాలేదు.
మాజీ జడ్పీవైస్ చైర్మన్ లింగారెడ్డి
కాంగ్రెస్ సీనియర్ నేత, జానారెడ్డి అత్యంత సన్నిహితుడైన పెద్దవూర మాజీ ఎంపీపీ, జడ్పీటీసీగా, జడ్పీ మాజీ వైస్ చైర్మన్గా సేవలందించిన కర్నాటి లింగారెడ్డి కూడా రేసులో ఉన్నారు. నిజానికి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రెండేళ్లలోనే లింగారెడ్డికి కార్పోరేషన్ పదవి దక్కాల్సి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కార్పోరేషన్ చైర్మన్ చేస్తానని జానారెడ్డి ఎప్పుడో హామీ ఇచ్చారు. కానీ సమీకరణాలు కుదరక లింగారెడ్డి వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
మంత్రి ఉత్తమ్ సన్నిహితుడు చింతకుంట్ల
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అత్యంత సన్నిహితుడు సీనియర్ నేత చింతకుంట్ల లక్ష్మీనారాయాణ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎడమ కాల్వ చైర్మన్గా పనిచేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి లక్ష్మీనారాయణ రెడ్డి ఆయన వెన్నంటే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ న్యాయవ్యాదిగా అనేక సేవలందించారు. ఉమ్మడి ఏపీలో జైళ్ల పాలైన అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు, లీడర్లకు లక్ష్మీనారాయణ రెడ్డి న్యాయపరమైన సేవలు అందించారు. ఎప్పుడో నామినేటెడ్ పదవి రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆయన్ని వెయిట్ చేయించడం వెనక బలమైన కారణం ఉందని, డీసీసీబీ పైనే గురి పెట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
