- ఇంకా కొలిక్కిరానీ నల్లగొండ, సూర్యాపేట జిల్లాల జాబితా
- యాదాద్రి జిల్లా కార్యవర్గం పైన పార్టీలో వ్యతిరేకత
- ఎంపీ చామల అనుచరులకు దక్కని చోటు
- కార్యవర్గ సభ్యుల లిస్ట్‌లో డీసీసీ మాజీ ప్రెసిడెంట్ సంజీవ రెడ్డి,
- ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్న శంకర్ పేర్లు
- నల్లగొండ జిల్లా కమిటీల్లో సొంత అనుచరులకే ప్రయార్టీ
- పాత కాంగ్రెస్ సీనియర్లను పక్కన పెట్టే ప్రయత్నం.. అందుకే కమిటీల ప్రకటన ఆలస్యం
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం పైన ఎమ్మెల్యేలు పట్టు బిగిస్తున్నారు. పాత కాంగ్రెస్ లీడర్లు, పార్టీ సీనియర్లను కాదని, తమ అనుచరులకు పెద్దపీట వేసినట్టు తెలుస్తోంది. పార్టీలు మారొచ్చిన తమ వెన్నంటి నిలబడే కేడర్‌కే కార్యవర్గంలో ప్రయార్టీ ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు తెలిసింది. దీంతోనే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని కార్యవర్గాన్ని ప్రకటించడం ఆలస్యమవుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గాన్ని గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జిల్లాలో ఇద్దరే ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కార్యవర్గ కూర్పులో తప్పులో కాలేశారు. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు బీసీలకు కార్యవర్గంలో 42 శాతం రిజ ర్వేషన్ కల్పించారు. కానీ కీలకమైన పదవుల్లో తమ అనుచరులకు చోటు కల్పించారు. కార్యవర్గంలో సీనియర్లు, జూనియర్లు ఉండాలనే నిబంధన ఇక్కడ దెబ్బకొట్టింది.
డీసీసీ మాజీ ప్రెసిడెంట్ అండెం సంజీవ రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్న మాజీ సర్పంచ్ శంకర్‌ను సైతం కార్యవర్గ సభ్యులుగా చేర్చారు. పీసీసీ మెంబర్‌గా ఉన్న సంజీవ రెడ్డిని కార్యవర్గ సభ్యుడిగా నియమించడం స్థాయిని తగ్గించినట్లైంది. ఇదిలావుంటే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సిఫార్సు చేసిన పలువురు లీడర్లకు కార్యవర్గంలో చోటు కల్పించలేదు. మోత్కూరు, అడ్డగూడురు మండలాలు భువనగిరి జిల్లాలో ఉన్నందున అక్కడి కమిటీల్లో కూడా స్థానం ఇవ్వాలని ఎంపీ కోరినట్టు తెలిసింది. మొత్తం 60 మంది సభ్యులతో కార్యవర్గం ప్రకటించారు. దీంట్లో 42 శాతం బీసీలకు ఇచ్చారు.
నల్లగొండలో సొంత అనుచరులే…
నల్లగొండ జిల్లాలో మునుగోడు, నకిరేకల్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తమ అనుచరుల పేర్లనే సిఫార్సు చేసినట్టు తెలిసింది. దీంతో పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. కార్యవర్గంలో చోటు కల్పించాలని ఇప్పటికే పలువురు సీనియర్లు జిల్లా మంత్రులను, పీసీసీ పెద్దలను కలుస్తున్నారు. ఎమ్మెల్యేల వైఖరి వల్ల ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో సొంత పార్టీ అభ్యర్థులకు టికెట్లు కూడా ఇవ్వలేదని, దాంతోనే రెబల్స్ పోటీ చేయడంతో పార్టీ పరువు పోయిందని గుర్తు చేస్తున్నారు. మళ్లీ పార్టీ కార్యవర్గంలో కూడా అదే వైఖరిని అవలంభిస్తే జిల్లా కార్యవర్గం అతుకుల బొంతగా మారుతుందని విచారం వ్యక్తం చేస్తున్నారు. కనీసం పార్టీలో ఐదేళ్లు అనుభవం కలిగిన వాళ్లకే మండల, గ్రామ, జిల్లా కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వాలనే పీసీసీ నిబంధనలకు కట్టుబడి ఉండాలని లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తదని హెచ్చరిస్తున్నారు. నల్లగొండ మంత్రి వెంకటరెడ్డి మాత్రం తాను సిఫార్సు చేసే పేర్లను నేరుగా పీసీసీకే సమర్పిస్తానని చెప్పినట్టు తెలిసింది. పాత, కొత్త లీడర్లు కలిపి దాదాపు 200 మందితో కార్యవర్గం రూపొందిస్తున్నట్టు తెలిసింది.
పేటలో తేలని పేచీ…
సూర్యాపేట జిల్లా కార్యవర్గంలో తుంగతుర్తి, సూర్యాపేట మినహా, కోదాడ, హుజూర్నగర్ లో ఎవరికి కార్యవర్గంలో స్థానం కల్పించాలనేది ఇంకా తేల్చలేదు. నియోజకవర్గానికి ఇద్దరు వైస్ ప్రెసిడెంట్లు, నాలుగురు కార్యదర్శులు ఉండాలనేది నిబంధన. కాగా జిల్లా ఉపాధ్యక్షులుగా మాజీ మంత్రి దామన్న వర్గీయుడు తుంగతుర్తి నేత యోగానందచార్యులు (బ్రహ్మణ), ఎమ్మెల్యే మందుల సామేలు కోటాలో అశోక్ రెడ్డి (తిరుమలగిరి) నియమించినట్టు తెలిసింది. సూర్యాపేట, తుంగతుర్తి జాబితా పీసీసీకి చేరింది. కానీ కోదాడ, హుజూర్నగర్ నుంచి సీనియర్లు కీలక పదవులు ఆశిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం సూర్యాపేటలో మండల కమిటీల నియామకం జరుగుతోంది. అన్ని చోట్ల కార్యవర్గం ఏర్పాటుకాగానే, పూర్తిస్థాయిలో మండల కమిటీలు నియామకం జరుగుతుందని, ఇప్పటికే చాలా ఆలస్యమైందని సీనియర్లు అభిప్రాయ పడుతున్నారు.