- సీపీఎంను సంస్థాగతంగా బలోపేతం చేయాలి, సభ్యత్వం చేపట్టాలి
- మహిళలతో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించాలి
- మున్సిపల్, జడ్పీ ఎన్నికల్లో పోటీ చేయాలి
- ఐద్వా జాతీయ సభకు జనసమీకరణ చేయాలి
- ధన ప్రవాహాం, పొత్తులు వల్ల లాభం ఉండట్లే
నల్లగొండ, ఏపీబీ న్యూస్: జిల్లాలో సీపీఎం పార్టీని సంస్థాగతం బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు పైన ఫోకస్ పెట్టాలని జిల్లా పార్టీ తీర్మానించింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆధ్వర్యంలో సీపీఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశం మంగళవారం నల్లగొండలో జరిగింది. ఈ సందర్బంగా ప్రధానమైన నాలుగైదు అంశాల పైన చర్చించారు. జిల్లా పార్టీ కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, పాలడుగు నాగార్జున తదితరులు హాజరయ్యారు. వెనుజులా వ్యవహారంలో అమెరికా వైఖరి పట్ల జాన్వెస్లీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అదేవిధంగా ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడానికే కేంద్రం జి రాంజీ జీ పేరు మార్చిందని, పాత చట్టానే యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
పార్టీ పరంగా జిల్లా లో చేపట్టాల్సిన సభ్యత్వ నమోదు పైన దృష్టి పెట్టాలని, సభ్యత్వాలను రెన్యువల్ చేయాలని సూచించారు. పార్టీలో కొత్త చేరికలను ప్రోత్సహించాలని చెప్పారు. పార్టీలో కొత్త సభ్యత్వాలు వస్తున్నప్పటికీ శాశ్వతంగా పార్టీ కోసం పనిచేసేందుకు ఆసక్తి చూపడం లేదని, సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయడం ఇష్టం లేక మధ్యలోనే పార్టీ వదిలేసి వెళ్లిపోతున్నారనే సమావేశంలో పలువురు సీనియర్లు అభిప్రాయ పడ్డారు. పార్టీలో ఎప్పటి నుంచో వారసులుగా ఉన్న కుటుంబాలు సైతం సభ్యత్వం తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదని అన్నారు. ఈ ఏడాది పార్టీ నీ బలోపేతం చేసేందుకు ప్రజా పోరాటాలను ఉదృతం చేయాలని సూచించారు.

హైదరాబాద్లో జరిగే ఐద్వా జాతీయ మహాసభలకు జిల్లా నుంచి జన సమీకరణ చేయాలని సూచించారు. రైతు, కూలీ, కార్మిక సంఘాల పోరాటాలను ఉదృతం చేయాలన్నారు. పార్టీ బలంగా ఉన్న మున్సిపాలిటీల్లో పోటీ చేయాలన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్తో పొత్తుల వర్కవుట్కాలేదని, ధన ప్రవాహాం వల్ల పార్టీతరపున అభ్యర్థులు నిలబడలేని పరిస్థితి వచ్చిందన్నారు. సంక్రాంతి సందర్భంగా పల్లెలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించాలన్నారు.