Countdown Begins: మరికొద్ది గంటల్లో తేలనున్న మున్సిపల్​ అభ్యర్థుల భవితవ్యం

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. ఉమ్మడి జిల్లాలోని 17 మున్సిపాలిటీలు, నల్గొండ కార్పోరేషన్ కలిపి 400 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు, రిజిస్టర్ పార్టీల క్యాండేంట్లతో కలిపి మొత్తం 1737 మంది పోటీ చేశారు. ఓట్ల లెక్కింపు ఆయా మున్సిపాలిటీల పరిధిలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో జరగనుంది. ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. మొదట అన్ని వార్డుల్లోని పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. అనంతరం బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్ల ను లెక్కిస్తారు. కౌంటిగ్ సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది.  

Municipal Election Results 2026 2

మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగడంతో రాజకీయ పార్టీలో టెన్షన్ నెలకొంది. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే ఉండొచ్చని భావిస్తున్నారు. నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, చౌటుప్పుల్ మున్సిపాలిటీల్లో బీజేపీ గట్టిపోటీ ఇచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీఆర్ఎస్, బీజేపీ చీలిస్తే అంతిమంగా కాంగ్రెస్ ప్రయోజనం కలుగుతుందని ఆపార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. అన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ఇప్పటికే ఎగ్జిట్పోల్స్ ఫలితాలు వెల్లడించాయి, కాకపోతే ఈ ఎన్నికల్లో అభ్యర్థులు భారీగా ఖర్చు పెట్టారు. దీంతో పోలింగ్ రోజున బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం అవగాహన వచ్చినట్టు తెలుస్తోంది. అదే జరిగితే మాత్రం కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు పైన ప్రభావం పడనుంది.

తిరుగులేని విజయాన్ని సాధిస్తామని భావిస్తున్న మున్సిపాలిటీల్లో అభ్యర్థులను అప్పుడే క్యాంపుకు తరలిచేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. 16న పాలకవర్గం ఎన్నిక ఉంటుంది. అప్పటి వరకు అభ్యర్థులు తమ కంట్రోల్లో ఉండేందుకు ప్లాన్ చేసుకుంటున్నాయి. మెజార్టీ వార్డులు గెలిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ చండూరు, చిట్యాల, సూర్యాపేట, మోత్కూరు, తిరుమలగిరి లాంటి మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గట్టిపోటీ ఇచ్చిందని అంటున్నారు. దాంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు పార్టీ విప్ జారీ చేసింది. గురువారం అభ్యర్థులందరికీ విప్ జారీ చేశారు. పార్టీ ఆదేశాలు దిక్కరించి ఎవరైన ప్రవర్తిస్తే కౌన్సిలర్ సభ్యత్వాన్ని రద్ధు చేసే అధికారం ఎన్నికల కమిషన్ కు అప్పగిస్తూ డీసీసీ అధ్యక్షులు విప్ జారీ చేస్తారు. ఈ మేరకు అభ్యర్థులు ప్రమాణ పత్రాల మీద సంతకాలు చేసి విప్ కాపీలను ఎన్నికల ఆఫీసర్లకు అందజేస్తారు. అయితే విప్ పత్రాల పైన చైర్మన్, వైస్ చైర్మన్ పేర్లు రాయకుండా ఖాళీ పేపర్ల పైన సంతకాలు తీసుకున్నట్లు తెలిసింది. 

బీఆర్ఎస్ అభ్యర్థులను మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గురువారం క్యాంపుకు తరలించారు. అదే క్రమంలో శుక్రవారం ఫలితాలు వెల్లడికాగానే గెలిచిన బీఆర్ఎస్ క్యాండేట్లను క్యాంపుకు షిఫ్ట్ చేయాలని పార్టీ హైకమాండ్ ఆదేశించింది. అభ్యర్థులు ఎవరూ కాంగ్రెస్ శిభిరం వైపు వెళ్లకుండా గురువారం అందరికీ విప్ జారీ చేసింది. మాజీ ఎమ్మెల్యే లు క్యాంపు ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.

Share
Share