- నల్లగొండ కార్పోరేషన్‌తో సహా, 16 మున్సిపాలిటీలు కైవసం
- జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేల సమిష్టి విజయం
- పట్టణాల్లో పట్టుకోల్పోయిన బీజేపీ, బీఆర్ఎస్,
- 260 వార్డుల్లో కాంగ్రెస్, 88 వార్డుల్లో బీఆర్ఎస్, 19 వార్డుల్లో బీజేపీ, సీపీఐ 4, సీపీఎం రెండు
- నేరేడుచర్లలో ఖాతా తెరిచిన జనసేనా
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లాలోని మున్సిపల్ కార్పోరేషన్లను కాంగ్రెస్ వశం చేసుకుంది. కాంగ్రెస్ కంచుకోటగా పేరొందిన జిల్లాలో మరోసారి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. పల్లెల్లోనే గాక, పట్టణ ఓటర్లు సైతం కాంగ్రెస్కు పట్టం కట్టారు. 17 మున్సిపాలిటీలు, నల్లగొండ కార్పోరేషన్కు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 16 మున్సిపాలిటీలు, నల్లగొండ కార్పోరేషన్ కైవసం చేసుకుంది. తొలిసారిగా ఏర్పాటైన నల్లగొండ కార్పోరేషన్ పైన కాంగ్రెస్ జెండా ఎగుర వేసింది. ఇక బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీని సొంతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న గ్రూపుల వల్ల అక్కడ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కాంగ్రెస్ అభ్యర్థులు అన్ని చోట్ల భారీ విజయం సాధించారు. బీఆర్ఎస్, బీజేపీ ఘోరంగా దెబ్బతిన్నాయి. మొత్తం 407 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 260 వార్డులు (63.8 8శాతం) స్థానాలు గెలుచుకుంది. బీఆర్ఎస్ 372 వార్డుల్లో పోటీ చేయగా కేవలం 88 వార్డుల్లోనే (23.65శాతం) గెలిచింది. బీజేపీ 338 వార్డుల్లో పోటీ చేయగా కేవలం 19 వార్డుల్లో (5.62శాతం) మాత్రం గెలుపొందింది. సీపీఐ ఐదు చోట్ల పోటీ చేయగా నాలుగు వార్డులు కైవసం చేసుకుంది. సీపీఎం 27 చోట్ల పోటీ చేస్తే కేవలం రెండు చోట్ల మాత్రమే గెలిచింది. ఎంఐఎం నల్లగొండలో రెండు డివిజన్లు, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు 9 మంది గెలిచారు. వీళ్లలో నల్లగొండలో నలుగురు, మిర్యాలగూడలో ఒకరు ఉన్నారు. స్వతంత్రులు 327మంది పోటీ చేయగా 27మంది సత్తా చాటారు. జనసేన తొలిసారిగా జిల్లాలో నేరేడుచర్లలో ఒక వార్డులో ఖాతా తెరిచింది.
పేట జిల్లాలో ఆపరేషన్ ఉత్తమ్ సక్సెస్
జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో నాలుగు కాంగ్రెస్ సొంతం చేసుకోగా, తిరుమలగిరిలో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. హుజూర్నగర్, సూర్యాపేట, కోదాడ, నేరేడుచర్ల లో ఉత్తమ్ సమీక్షలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకునేందుకు దోహదపడ్డాయి. అభ్యర్థులను వెంటపెట్టుకుని ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరిగి ఓటర్లను అభ్యర్థించారు. మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామనే హామీ మేరకు ఓటర్లు కాంగ్రెస్ వైపు ఆకర్షితులయ్యారు. సూర్యాపేట జిల్లాలో 141 వార్డుల్లో కాంగ్రెస్ 137 వార్డుల్లో పోటీ చేయగా 90 చోట్ల గెలిచింది. హుజూర్నగర్లో కాంగ్రెస్ 19 వార్డులు గెలిస్తే, కోదాడలో 26 వార్డుల్లో గెలుపొందింది. నేరేడుచర్లలో 9 వార్డులు సొంతం చేసుకుంది. సూర్యాపేటలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నివేధితను ప్రకటించడంతో ఇక్కడ అభ్యర్థులు సునాయసంగా గెలిచారు. మంత్రి ఉత్తమ్ సపోర్ట్ తో రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వేణారెడ్డి చేసిన కృషి కారణంగా ఏకంగా 31 వార్డులను కైవసం చేసుకుంది.
నల్లగొండ, భువనగిరి జిల్లాల్లో కాంగ్రెస్ జోష్
నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్షోలతో కార్పోరేషన్లో 27 వార్డుల్లో కాంగ్రెస్ గెలిచింది. మిర్యాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన తర్వాత కాంగ్రెస్లో జోష్ కనిపించింది. అప్పటి వరకు గ్రూపు పంచాయతీలను సైతం పక్కన పెట్టి సమిష్టిగా పనిచేయడం తో 31 వార్డుల్లో కాంగ్రెస్ విజయ భేరి మోగించింది. ముందు నుంచి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మీద వస్తున్న ఆరోపణలు ఈ ఫలితాలతో తుడిచి పెట్టుకుపోయాయి. ఎమ్మెల్యేలు బాలూ నాయక్, వేముల వీరేశం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి, కుందూరు జైవీర్ రెడ్డిలు ఎన్నికల్లో అభ్యర్థుల వెన్నంటే ఉండి ప్రచారం చేయడంతో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో బీజేపీ, బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతైంది. దేవరకొండలో రెబల్స్కు చెక్ పెట్టడంతో ఎమ్మెల్యే సక్సెస్ అయ్యారు. చిట్యాలలో వీరేశంతో కలిసి అమిత్ చేసిన జాయింట్ ఆపరేషన్ విజయవంతమైంది. పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బీర్ల అయిలయ్య ఈ ఎన్నికల్లో జాగ్రత్త పడ్డారు. దీంతో చండూరు, భువనగిరితో సహా, ఆరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.
పార్టీల వారీగా గెలిచిన వార్డులు ఇవీ
| పార్టీ పేరు | పోటీ చేసిన వార్డులు | గెలిచిన స్థానాలు |
| కాంగ్రెస్ | 407 | 260 |
| బీఆర్ఎస్ | 372 | 88 |
| బీజేపీ | 338 | 19 |
| సీపీఎం | 27 | 2 |
| సీపీఐ | 5 | 4 |
| ఏఐఎం | – | 2 |
| ఫార్వర్డ్ బ్లాక్ | – | 9 |
| స్వతంత్రులు | 327 | 27 |
| జనసేన | 43 | 1 |
నల్లగొండ జిల్లా
| మున్సిపాలిటీ | మొత్తం స్థానాలు | కాంగ్రెస్ | బీఆర్ఎస్ | బీజేపీ | ఇతరులు |
| నల్లగొండ | 48 | 27 | 9 | 4 | – |
| నందికొండ | 12 | 11 | 1 | – | – |
| దేవరకొండ | 20 | 11 | 6 | 1 | – |
| చండూరు | 10 | 6 | 3 | – | సీపీఐ 1 |
| హాలియా | 12 | 11 | 1 | – | – |
| మిర్యాలగూడ | 48 | 31 | 14 | 1 | 2 |
| చిట్యాల | 12 | 9 | 2 | – | స్వతంత్ర 1 |
సూర్యాపేట జిల్లా
| మున్సిపాలిటీ | మొత్తం స్థానాలు | కాంగ్రెస్ | బీఆర్ఎస్ | బీజేపీ | ఇతరులు |
| సూర్యాపేట | 48 | 31 | 11 | 1 | – |
| కోదాడ | 35 | 26 | 3 | – | స్వతంత్ర 6 |
| నేరేడుచర్ల | 15 | 9 | 5 | – | జనసేన 1 |
| తిరుమలగిరి | 15 | 5 | 10 | – | – |
| హుజూర్నగర్ | 28 | 19 | 4 | – | సీపీఎం 1, సీపీఐ 1 |
యాదాద్రి జిల్లా
| మున్సిపాలిటీ | మొత్తం స్థానాలు | కాంగ్రెస్ | బీఆర్ఎస్ | బీజేపీ | ఇతరులు |
| భువనగిరి | 35 | 22 | 4 | 4 | – |
| యాదగిరిగుట్ట | 12 | 8 | 1 | 2 | సీపీఐ 1 |
| మోత్కూరు | 12 | 8 | 3 | – | – |
| పోచంపల్లి | 13 | 6 | 5 | 2 | – |
| ఆలేరు | 12 | 7 | 3 | 2 | – |
| చౌటుప్పుల్ | 20 | 13 | 3 | 3 | సీపీఎం 1 |