జనగామ, ఏపీబీ న్యూస్: గత కొద్దిరోజులుగా రాజకీయ సెగలు పుట్టించిన జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఎట్టకేలకు ముగిసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహాత్మక అడుగులు, పార్టీ నేతల సమన్వయంతో జనగామలో కాంగ్రెస్ జెండా ఎగిరింది.
హోరాహోరీగా సాగిన ఎన్నిక
మున్సిపల్ చైర్మన్ పదవి కోసం జరిగిన ఈ ఎన్నికల్లో బలబలాలు సమానంగా ఉండటంతో ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం సభ్యుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే:
- కాంగ్రెస్ పార్టీ: 15 మంది కౌన్సిలర్లు + 1 ఎక్స్-అఫీషియో సభ్యుడు (మొత్తం 16)
- బీఆర్ఎస్ పార్టీ: 15 మంది కౌన్సిలర్లు + 1 ఎక్స్-అఫీషియో సభ్యుడు (మొత్తం 16)
ఇరుపక్షాలకు సమానంగా 16 ఓట్లు రావడంతో అధికారులు నిబంధనల ప్రకారం ‘డ్రా’ (లక్కీ డిప్) నిర్వహించారు. ఈ డ్రాలో అదృష్టం కాంగ్రెస్ వైపు నిలిచింది. కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి కడకంచి బాలమణి పేరు రావడంతో ఆమెను విజేతగా అధికారులు ప్రకటించారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఎంపీ చామల ధ్వజం
ఈ విజయం అనంతరం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ప్రజాస్వామ్య విలువలు, దేవుడి తీర్పు ముందు పల్లా రాజేశ్వర్ రెడ్డి రౌడీ రాజకీయం, డబ్బు రాజకీయం ఓడిపోయాయి. ఎన్ని కుట్రలు చేసినా అంతిమంగా ధర్మమే గెలిచింది” అని ఆయన పేర్కొన్నారు. ఈ గెలుపు జనగామ ప్రజల విజయమని ఆయన కొనియాడారు.
పాల్గొన్న ముఖ్య నేతలు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. మున్సిపల్ అబ్జర్వర్గా వ్యవహరించిన ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొని నూతన చైర్మన్ బాలమణికి శుభాకాంక్షలు తెలిపారు.