- మున్సిపల్ ఎన్నికల్లో దక్కని సీట్లు
- నామినేషన్ ఉప సంహరించుకున్న భార్గవ్, అతని భార్య
- పట్టణంలో 20 వేల ఓట్ల పైన తీవ్ర ప్రభావం
- క్రాస్ ఓటింగ్ జరిగితే బీఆర్ఎస్కు అనుకూలం
మిర్యాలగూడెం, ఏపీబీ న్యూస్: మిర్యాలగూడెం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రూపు పాలిటిక్స్ సస్పెన్స్ థ్రిల్లర్గా మారాయి. ప్రమాదం ఎటువైపు నుంచి పొంచుకొస్తుందో అర్ధంగాక కౌన్సిలర్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఒంటెద్దు పోకడలు ఈ ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చూపే అవకాశం ఉందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే తన కుటుంబ సభ్యులతో నామినేషన్ వేయించి అప్రతిష్ట మూటగట్టుకున్న ఎమ్మెల్యే తన అనుచరలకే టికెట్లు కట్టబెట్టడం అగ్గి రాజేసింది. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు, ముగ్గురు టికెట్ ఆశిస్తున్న లీడర్లను అడ్డుకునేందుకే తన కుటుంబ సభ్యులను రంగంలోకి దింపాల్సి వచ్చిందని ఎమ్మెల్యే అనుచరులు ప్రచారం చేస్తుండగా, ఎమ్మెల్యే మాత్రం మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు అభ్యర్థులను పోటీనుంచి తప్పుకోమని బెదిరించడంతోనే తన కుటుంబ సభ్యులచే నామినేషన్ వేయించాల్సి వచ్చిందని చేసిన వ్యాఖ్యలు పొంతన లేకుండా ఉన్నాయి. ఇంకోవైపు మాజీ చైర్మన్ తిరునగరు భార్గవ్ ను పార్టీలో కట్టడి చేసేందుకు ఎమ్మెల్యే హైడ్రామా క్రియేట్ చేయాల్సి వచ్చిందనే వాధన కూడా వినిపిస్తోంది. నిజంగా కూడా భార్గవ్, అతని భార్య నామినేషన్ విత్ డ్రా చేసుకోవడం చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది.

48 వార్డుల్లో భార్గవ్ వర్గానికి 15 వార్డుల్లో బలం
ఈ ఎన్నికల్లో 15 టికెట్లు కావాలని భార్గవ్ పట్టు బట్టారు. ఈ మేరకు ఎంపీ రఘువీర్, ఇంచార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సమక్షంలో చర్చలు కూడా జరిగాయి. అయితే ఈ చర్చలకు భార్గవ్ ను అనుమతించకుండా అతని అనుచరులతో చర్చలు జరిపారు. భార్గవ్ ను వదిలిపెట్టి తమవైపు వస్తేనే టికెట్లు ఇస్తానని ఎమ్మెల్యే పట్టుబట్టినట్టు తెలిసింది. ఎమ్మెల్యే ప్రతిపాధన ససేమిరా ఒప్పుకోని భార్గవ్ వర్గం రెబల్స్గా పోటీ చేయాలని భావించింది. కానీ పార్టీ హైకమాండ్ నుంచి భార్గవ్ కు తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చాయని చెప్తున్నారు. ఎమ్మెల్యే చెప్పినట్టు వినకుంటే భార్గవ్ వ్యాపారాల్లో లొసుగులను బయట పెట్టాల్సి వస్తదని ఎమ్మెల్యే వర్గం బెదిరింపులకు దిగినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో నామినేషన్ లు విత్ డ్రా చేసుకునే చివరి రోజు వరకు అభ్యర్థులను ప్రకటించుకుండా హైడ్రామా నడిపించారు. చివరకు సోషల్ మీడియాలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా వైరల్ అయ్యింది. ఈ జాబితాలో భార్గవ్ వర్గానికి ఏమాత్రం ప్రయార్టీ దక్కలేదు. ఒకరిద్దరు మినహా భార్గవ్ తో పాటు కాంగ్రెస్లో చేరిన కౌన్సిలర్ల కు హ్యాండిచ్చారు. పార్టీలో అణిచివేతను భరించలేని భార్గవ్ అప్పటి నుంచి సైలెంటయ్యారు.

టౌన్ లో 20 వేలకు పైగా ఆర్య వైశ్య ఓటర్లు
టౌన్లో ఆర్య వైశ్య ఓటర్లు సుమారు 20 వేలకు పైగా ఉంటారు, 15 వార్డుల్లో వైశ్యులు ప్రభావితం చేస్తారు. అందుకే గతంలో భార్గవ్ ను బీఆర్ఎస్ చైర్మన్ చేసింది. మళ్లీ అదే సామాజిక వర్గానికి చైర్మన్ ఇవ్వాలన్నది వైశ్యుల డిమాండ్, కానీ ఎమ్మెల్యే మాత్రం రెడ్డి వర్గానికి చెందిన వేణు గోపాల్ రెడ్డి భార్యను రంగంలోకి దింపారు. దీంతో వైశ్యులు ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా మారారు. వివిధ సర్వేల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ తర్వాత బీజేపీ కూడా బలంగా పుంజుకుంటోంది. ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరిగితే కాంగ్రెస్ ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు అంతిమంగా బీఆర్ఎస్ కు లాభం జరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే బత్తుల 20 వార్డుల్లో గెలిచారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఏకంగా పాలకవర్గం పైనే ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ లో గ్రూపుల పంచాయితీ తమకు అనుకూలంగా మారుతుందని, వివిధ వర్గాల ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు, అతని కొడుకు సిద్ధార్ధ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు.