APB Exclusive: నామినేటెడ్​ ఆశావహులకు ఉగాది ముహూర్తం.. నాలుగు నియోజకవర్గాల్లో ఆశావహుల్లో తీవ్ర అసంతృప్తి

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నామినేటెడ్ పదవులకు ముహూర్తం సమీపిస్తోంది. ఉగాది సందర్భంగా నామినేటెడ్ పదవులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పలువురు ఆశావహులతో పీసీసీ నాయకత్వం చర్చలు జరిపింది. పంచాయతీ ఎన్నికల తర్వాత జిల్లాల వారీగా పలువురు సీనియర్లతో పీసీసీ నాయకత్వం చర్చలు జరిపింది. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వం క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యంలో నామినేటెడ్ పదవుల పంపకం ఇక ఏమాత్రం ఆలస్యం చేయోద్దని భావిస్తోంది. ఇప్పట్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా ఉండవని సంకేతాలు అందుతున్నాయి. ఉగాది సందర్భంగా పెండింగ్లో ఉన్న నామినెటెడ్ పదవులు భర్తీ చేస్తారని, ఆమేరకు పలువురు ఆశావహుల జాబితా హైకమాండ్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. సహకార సంఘాలకు సైతం ఎన్నికలు నిర్వహించకుండా వ్యవసాయ మార్కెట్ కమిటీల తరహాలోనే నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్లు, డైరక్టర్లను నియమించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. డీసీసీబీ చైర్మన్, బ్యాంకు డైరక్టర్లతో సహా, అన్ని రకాల కార్పోరేషన్ డైరక్టర్లను, చైర్మన్లను నియమించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

నామినేటెడ్ పదవుల్లో ఈదఫా పార్టీ విధేయులకే పెద్దపీట వేస్తారని చెపుతున్నారు. తొలి విడతలో ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్, టీడీపీ నుంచి వలసొచ్చిన నేతలకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు. కాబట్టి ఈ విడతలో పార్టీ విధేయులకు ప్రయార్టీ ఇవ్వనున్నారు. ఎస్సీ, బీసీ, రెడ్డి సామాజికవర్గాల నుంచి పలువురు సీనియర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా పార్టీ సీనియర్ నేత జా నారెడ్డి అనుచరుడు పీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య పేరు (ఎస్సీ మాదిగ) వినిపిస్తోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు మాజీ జడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, కోదాడలో సీనియర్ నేత లక్ష్మీనారాయాణ రెడ్డి, యాదాద్రి జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు అండెం సంజీవ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెప్తున్నారు. వీళ్లతోపాటు బీసీ సామాజికవర్గం నుంచి మరికొంత మంది ఆశావహులు ప్రయత్నిస్తున్నారు.

పీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్యకు అవకాశాలు వచ్చినట్టే వచ్చి చివరి నిమిషంలో చేజారిపోతున్నాయి. 2008 నుంచి నకిరేక ల్లో పార్టీకి వెన్నుదన్నుగా ఉంటున్న మల్లయ్యకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని గత మూడు ఎన్నికల నుంచి ఆశచూపించారు. చిరుమర్తి లింగయ్య పార్టీ మారిన నేపథ్యంలో నకిరేకల్లో ఆపర్టీ కేడర్కు వెన్నుదన్నుగా ఉంటున్న మల్లయ్యకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ ఖాయమని సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నకిరేకల్లో సక్సెస్ చేశారు. కానీ పార్టీలో ఎలాంటి సభ్యత్వం లేని, బీఆర్ఎస్ నుంచి అప్పటికప్పుడు పార్టీలో చేరిన వేముల వీరేశానికి, తుంగుతుర్తిలో మందుల సామేలుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో మల్లయ్య తీవ్ర నిరాశకు లోనయ్యారు. కోమటరెడ్డి బ్రదర్స్ వల్ల రెండు చోట్ల ఎమ్మెల్యే ఛాన్స్ మిస్సైంది. గత 40 ఏళ్ల నుంచి పార్టీకి విశిష్ట సేవలు అందిస్తున్న మల్లయ్యను కాదని, వలసొచ్చిన వీరేశం, సామేలు ఎమ్మెల్యేలు అయ్యారు. వీరేశానికి టికెట్ ఇచ్చిన క్రమంలో మల్లయ్యకు కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని జానారెడ్డి బుజ్జగించారు. ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఆశీస్సులు కూడా ఆయనకు ఉన్నాయని చెపుతున్నారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రుల మద్ధతు కూడగట్టే పనిలో మల్లయ్య ఉన్నట్టు తెలిసింది.

కోదాడ నుంచి మంత్రి ఉత్తమ్ అత్యంత సన్నిహితుడు పార్టీ సీనియర్ నేత చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రాష్ట్రపతి భవన్ నుంచి కోదాడలో అడుగుపెట్టినప్పటి నుంచి ఉ త్తమ్కు వెన్నుదన్నుగా ఉంటున్న లక్ష్మీనారాయణ రెడ్డి మొదట్లో సాగర్ ఎడమకాల్వ చైర్మన్గా చేశారు. ఇక ఆ తర్వాత ఎలాంటి చెప్పోదగ్గ పదవి లభించలేదు. తొలి విడతలోనే కార్పోరేషన్ పదవి వస్తదని భావించారు. కానీ మైనార్టీ కోటాలో వైస్ చైర్మన్గా జబ్బార్కు అవకాశం కల్పించారు. ఆలేరులో సైతం యాదాద్రి జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి పేరు జాబితాలో ఉన్నట్టు తెలిసింది. దివంగత సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి నాటి నుంచి పార్టీనే నమ్ముకున్నారు. చివరకు సంపాధించిన ఆస్తులు సైతం పార్టీకోసం పోగొట్టుకున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఎంపీలుగా గెలుపొందడంలో కృషి చేశారు. ఆలేరులో బీర్ల అయిలయ్యను గెలుపుకు దోహదపడ్డారు. రెండోసారి డీసీసీ పదవి రెన్యువల్ అవుతుందని ఆశించిన ఆయనకు వయసు రీత్యా ఛాన్స్ మిస్సైంది.

నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు గుమ్మల మోహన్ రెడ్డి నామినేటెడ్ పదవి ఎపుడు వస్తదా అని ఎదురుచూస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్సీ, డీసీసీ, నల్లగొండ మేయర్ ఇలా అనేక పదవుల పైన పెట్టుకున్న ఆశలన్నీ నీరుగారిపోయాయి. మొన్న జరిగిన మేయర్ ఎన్నికల్లో నామినేటెడ్ పదవి ఇస్తానని మంత్రి మరో సారి హామీ ఇచ్చారని చెప్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఆదుకున్న మోహన్కు నామినేటెడ్ పదవి ఇవ్వాలనే పట్టణంలోని అనేక మంది ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల పట్టణం లో మోహన్ పట్టణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బల ప్రదర్శన సక్సెస్ అయ్యింది. పార్టీ హైకమాండ్ దృష్టిలో పడేందుకు తన సత్తా ఏంటో పార్టీ కార్యక్రమాల ద్వారా నిరూపించారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి విడతలో వలస నేతలకే నామినేటెడ్ పదవులను ఎగిరేసుకుపోయారు. లేదంటే ఆ జాబితాలో కొండేటి మల్లయ్య, మోహన్ రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డిలకు పదవులు దక్కాల్సి ఉంది. కానీ సీఎం రేవంత్ రెడ్డితో టీడీపీలో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా వారికే పెద్దపీట వేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి (విజయ్ డెయిరీ చైర్మన్) ఆలేరులో బండ్రు శోభారాణి (మహిళా సాధికారితక కార్పోరేషన్ చై ర్మన్), సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డి ( టూరిజం కార్పోరేషన్ చైర్మన్), కోదాడలో జబ్బార్ (మైనార్టీ కార్పోరేషన్ వైస్ చైర్మన్), తుంగతుర్తిలో ప్రీతమ్ (ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్), హుజూర్నగర్లో ముత్తినేని వీరయ్య (వికలాంగుల సంక్షేమ శాఖ చైర్మన్), చివరకు డీసీసీ పదవులు కూడా విధేయులకు దక్కలేదు. బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల సమీకరణాల నేపథ్యంలో నల్లగొండ, యాదాద్రి బీసీలకు, సూర్యాపేట ఎస్సీలను నియమించారు. కాబట్టి ఈ దఫా విధేయులకే నామినేటెడ్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు.

ఉమ్మడి జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ముగ్గురు, నలుగురు నేతలు కీలకమైన పదవుల్లో రాణిస్తున్నారు. నాగార్జునసాగర్, దేవరకొండ, భువనగిరి, నకిరేకల్, నల్లగొండ నియోజకవర్గాల నుంచే నామినేషన్ పదవులు ఎవరికీ దక్కలేదు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, ముగ్గురు కీలకమైన పదవుల్లో ఉన్నారు. అదేవిధంగా తుంగతుర్తిలో ఎమ్మెల్యే, ఎంపీ, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్, డీసీసీ అధ్యక్ష పదవి, ఆలేరులో ప్రభుత్వ విప్, డీసీసీ అధ్యక్ష పదవి, మహిళా సాధికారిత చైర్మన్, సూర్యాపేటలో టూరిజం కార్పోరేషన్, కోదాడలో ఎమ్మెల్యే, మైనార్టీ కార్పోరేషన్ వైస్ చైర్మన్, హుజూర్నగర్లో మంత్రి పదవి, వికలాంగుల కార్పోరేషన్ చైర్మన్, మునుగోడులో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్ష పదవి లభించాయి. నల్లగొండలో మంత్రి, దేవరకొండ, నాగార్జున సాగర్, భువనగిరి, నకిరేకల్లో ఎమ్మెల్యేలు తప్పా నామినేటెడ్ పదవులు ఎవరికీ దక్కలేదు. ఈ నేపథ్యంలో ఎస్సీ, రెడ్డి, బీసీ సామాజి వర్గాలకు ఈ నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం లభిస్తదని ఆశిస్తున్నారు.

Share
Share