ప్రభుత్వం పథకాలు రైతులకు చేరాలి…బ్యాంకు టర్నోవర్​ రూ.4వేల కోట్లు

నల్లగొండ, ఏపీబీ న్యూస్​: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు చేరవేయడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్​, డీసీసీబీ పర్సన్​ ఇంచార్జి ఇలా త్రిపాఠి అన్నారు. డీసీసీబీ పాలకవర్గం రద్ధు అయిన తర్వాత పర్సన్​ ఇన్​చార్జిగా కలెక్టర్​ను ప్రభుత్వం నియమించిన అనంతరం తొలిసారిగా సోమవారం బ్యాంకు విజిట్​ చేశారు. ఈ సందర్భంగా డీసీసీబీ మాజీ చైర్మన్​ కుంభం శ్రీనివాస్​ రెడ్డి కలెక్టర్​కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ…పంట రుణాలు, బంగారు రుణాలను పెద్ద ఎత్తున ఇవ్వాలని డిపాజిట్​లను భారీగా సేకరించి, బ్యాంకును ప్రగతి పథంలో నడిపించాలన్నారు. టర్నోవర్​ మరింత పెంచేలా అధికారులు, సిబ్బంది పనిచేయాలన్నారు.

డీసీసీబీ పాలకవర్గం ముగిసే నాటికి బ్యాంకు టర్నోవర్​ రూ.3,666 కోట్లకు పెరిగిందని మాజీ చైర్మన్​ కుంభం శ్రీనివాస్​ రెడ్డి అన్నారు. 15 నెలల్లో పెద్ద ఎత్తున టర్నోవర్​ సాధించడం గర్వకారణమని చెప్పారు. గతేడాది జులైలో చైర్మన్​గా బాధ్యతలు చేపట్టే నాటికి బ్యాంకు టర్నోవర్​ రూ2,342 కోట్లు ఉందని, ఏడాదిన్నర కాలంలో బ్యాంకు వృద్ధిని రూ.1324 కోట్లకు పెంచామని, దాంతో టర్నోవర్​ రూ.4వేల కోట్లకు చేరిందని, బ్యాంకు లాభం రూ.60 కోట్లకు పెరిగిందని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనంతగా గతేడాది రూ.100 కోట్లు డిపాజిట్లు సేకరించామని, ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.52 కోట్లు డిపాజిట్లు సేకరించామని తెలిపారు.

ప్రతి ఏడాది పంట రుణాల బడ్జెట్​ కేవలం రూ.20,30 కోట్లు మాత్రమే ఉండేదని, కానీ తాను చైర్మన్​ అయినప్పటికీ నుంచి పంట రుణాల పరిమితి రూ.100 కోట్లకు పెంచామని తెలిపారు. బంగారు రుణాలు గతంలో రూ.390 కోట్లు మాత్రమే ఉన్నాయని, ఈ ఏడాదిన్నర కాలంలో బంగారం ధరలు పెరగడంతో వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల రుణాలు రూ.1160 కోట్లకు చేరిందని తెలిపారు. రాష్ట్రంలో నల్లగొండ డీసీసీబీ రెండో స్థానంలో నిలిచిందని, నాబార్డ్​ నుంచి బెస్ట్​ ఫెర్మాంగ్​ అవార్డు వచ్చిందని, ఐఎస్​ఓ సర్టిఫికెట్​ ఫర్​ అగ్రికల్చర్​ డెవలప్మెంట్​, నాస్కాబ్​ నుంచి అసోసియేట్​ మెంబర్​షిప్​, ప్రమోటింగ్​ అచీవ్​మెంట్​ ప్రమోషన్​ నుండి ఆలిండియా బెస్ట్​ చైర్మన్​ ఫెర్మాన్స్​ అవార్డు పొందడం జరిగిందని మాజీ చైర్మన్​ శ్రీనివాస్​ రెడ్డి వివరించారు.

Share
Share