ఒకే రోజు మూడు ఆకస్మిక తనిఖీలు: కలెక్టర్ అనురాగ్ జయంతి

యాదాద్రి, ఏపీబీ న్యూస్: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శనివారం పోచంపల్లి మండల పరిధిలో ఒకే రోజు మూడు కీలక ప్రభుత్వ సంస్థలను ఆకస్మికంగా పరిశీలించారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (KGBV), షెడ్యూల్డ్ కులాల బాలికల వసతి గృహం మరియు పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను స్వయంగా తనిఖీ చేసి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

పోచంపల్లి మండలం జలాల్పూర్లోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ అనురాగ్ జయంతి సందర్శించారు. డార్మెటరీ, స్టోర్ రూమ్, కిచెన్, తరగతి గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. మెనూ ప్రకారం సరైన భోజనం అందుతుందా అని విద్యార్థినులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. 9వ తరగతి మరియు 11వ తరగతి తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. వంటకు అవసరమైన సరుకులు, సామాగ్రిని స్వయంగా పరిశీలించారు.

బాలికలను ఆప్యాయంగా పలకరిస్తూ ఇష్టంగా చదువుకోవాలని, లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించే దిశగా కృషి చేయాలని విద్యార్థినులలో స్ఫూర్తి నింపారు. పాఠశాల పరిసరాల్లో అట్టి స్థలాన్ని శుభ్రపరిచి విద్యార్థులు ఆడుకునేందుకు ప్లేగ్రౌండ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన పోషకాహారం అందించాలని కలెక్టర్ స్పష్టంగా సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ఇందిరా, పోచంపల్లి MRO శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత అధికారులు, వసతి గృహ సిబ్బంది పాల్గొన్నారు.

పోచంపల్లి మండల కేంద్రంలోని షెడ్యూల్డ్ కులాల బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థినుల నివాస సదుపాయాలు, భోజన నాణ్యత, పారిశుధ్యం, భద్రతా ఏర్పాట్లు మరియు విద్యా వాతావరణాన్ని సమగ్రంగా పరిశీలించారు. వసతి గృహంలో అందిస్తున్న ఆహారం నాణ్యతను స్వయంగా పరీక్షించి, మెనూ ప్రకారం పోషకాహారం తప్పనిసరిగా అందించాలని సిబ్బందిని హెచ్చరించారు.

గదుల పరిశుభ్రత, తాగునీటి సరఫరా, మరుగుదొడ్లు, విద్యుత్ వసతి, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు స్పష్టంగా ఆదేశించారు. విద్యార్థినులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు తెలుసుకున్నారు. సౌకర్యవంతమైన వాతావరణంలో చదువుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని, ఏ లోపం ఉన్నా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ తాఖీదు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శేఖర్ రెడ్డి, తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, వసతి గృహ సిబ్బంది పాల్గొన్నారు.

పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణ దశలను స్వయంగా పరిశీలించిన కలెక్టర్, లబ్ధిదారులు నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం నిర్ణీత విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకోవాలని, నిర్మాణ దశలకు అనుగుణంగా బిల్లులు మంజూరు అవుతాయని లబ్ధిదారులకు స్పష్టంగా వివరించారు. నిర్మాణాన్ని తక్షణమే ముమ్మరం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శేఖర్ రెడ్డి, తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, వసతి గృహ సిబ్బంది పాల్గొన్నారు.

Share
Share