- నల్లగొండ బీజేపీలో…రచ్చకెక్కిన వర్గపోరు
- జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, సీనియర్ నేత, పిల్లి రామరాజు యాదవ్ మధ్య బాహాబాహీ
- సర్పంచ్ల సన్మాన కార్యక్రమం గురించి ఇరువర్గాలు గొడవ
- రామరాజు పైన చేయిచేసుకున్న ఉపాధ్యక్షుడు మోహన్‌రెడ్డి
- మీడియా కెమెరాల నుంచి వీడియోలు డిలీట్ చేసిన నాగం?
- రామరాజు గొడవ పడ్డ వీడియోలు మాత్రమే వైరల్
- వర్షిత్ ఆధిపత్యం పైన పార్టీలో తీవ్ర అసంతృప్తి
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లా బీజేపీ పార్టీలో నెలకొన్న ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. ఇన్నాళ్లు ఎంతో ఓపిక పట్టిన పార్టీ సీనియర్లు గురువారం రెచ్చి పోయారు. వాజ్పేయి జన్మదినం పురస్కరించుకుని కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు సన్మానం చేసేందుకు తలపెట్టిన కార్యక్రమం ఇరువర్గాల మధ్య దెబ్బలాటకు దారితీసింది. నల్లగొండ నియోజకవర్గంలో బీజేపీ మద్ధతుదారులు గెలుపొందిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులను సత్కరించేందకు పార్టీ సీనియర్ నేత పిల్లిరామరాజు యాదవ్ ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమం చేద్దామని జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని కోరగా, ఆయన పలుమార్లు వాయిదా వేశారు. రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు సమక్షంలో చేద్దామని జిల్లా పార్టీ ఇన్చార్జి ప్రతాప్ సూచించారు. దాంతో కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. ఇటీవల కేటీఆర్ జిల్లాకు రావడం, బీఆర్ఎస్ స ర్పంచ్లకు సన్మానం చేయడంతో ఇంకింత ఆలస్యం చేయడం మంచిది కాదని మరోసారి రామరాజు జిల్లా అధ్యక్షుడిని కోరారు.

సర్పంచ్ల సన్మానం..తన్నుకున్న నేతలు
వాజ్పేయి జన్మదినం రోజున సర్పంచ్లకు చేద్దామని ఫైనల్గా డిసై డ్ చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు రామరాజు బుధవారం చకచకా చేశారు. ఫ్లెక్సీలు, భోజన ఏర్పాట్లు జరిగిపోయాయి. ఫ్లెక్సీలో వర్షిత్ ఫోటో పెద్దగా ఉండాలని, జిల్లా అధ్యక్షుడిగా తనకు సరియైన గుర్తింపు ఇవ్వాలని రామరాజుతో ముందుగానే ఒప్పందం చేసుకు న్నారు. ఈ మేరకు ఫ్లెక్సీలు డిజైన్ చేశారు. కానీ బుధవారం రాత్రి 10గంటలకు వర్షిత్ రెడ్డి, రామరాజుకు ఫోన్ చేసి సన్మానం కార్యక్ర మం వద్దని సడన్గా చెప్పడంతో కంగుతిన్నారు. అప్పటివరకు చేసిన ఏర్పాట్లను రద్ధు చేయాల్సి వచ్చింది. కానీ సర్పంచ్లకు, పార్టీ కార్యకర్తలకు సమాచారం ఇవ్వలేకపోయారు. దాంతో గురువారం సర్పంచ్లు, పార్టీ కార్యకర్తలు జిల్లా ఆఫీసుకు చేరుకున్నారు. వాజ్పేయి జన్మదిన వేడుకలు ముగిశాక, ఉన్నపళంగా వర్షిత్ రెడ్డి అక్కడికి వచ్చిన సర్పంచ్లకు సన్మానం చేసేందుకు సిద్ధమయ్యారు. దాంతో రామరాజు సన్మానం వద్దని చెప్పి, మళ్లీ ఎట్లా చేస్తారని వర్షిత్ను నిలదీశారు. ఇద్దరి మధ్య మాటమాట పెరిగి పరస్పరం దూ షించుకున్నారు. రెచ్చిపోయిన వర్షిత్ రెడ్డి అనుచరుడు పార్టీ ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి రామరాజు పైన చేయిచేసుకున్నారు. దాంతో అతని కళ్లద్దాలు పగిలిపోయి మొఖం పైన స్వల్పగాయమైంది. అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్లు గొడవ దృశ్యాలను ఫోటోలు తీశారు. అవి బయటకు రావొద్దనే ఉద్దేశంతో వర్షిత్ రెడ్డి, కెమెరాలు లాక్కొని రామరాజును కొట్టిన ఫోటోలను తొలగించారు. దాంతో విలేకరులు, ఫోటోగ్రాఫర్లు వర్షిత్కు వ్యతిరేకంగా ఆఫీసు ముందు ఆందోళనకు దిగారు. ఇదంతా జరుగుతండగానే రామరాజు పైన గొడవ జరిగింద నే సమాచారం బయటకు వెళ్లడంతో ఆయన అనుచరులు పెద్ద ఎత్తున పార్టీ ఆఫీసుకు తరలివచ్చారు. రామరాజు పైన చేయి చేసుకున్న మరుక్షణమే గొడవ పెద్ద అవుతుందని భావించిన వర్షిత్ రెడ్డి, ఆఫీసులో పైన ఉన్న తన చాంబర్లోకి జారుకున్నారు.

ఇరువర్గాల మధ్య గొడవ…
ఆఫీసుకు వచ్చిన రామరాజు, అతని అనుచరులు ఆఫీసుకు చేరుకోగానే అక్కడే ఉన్న ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి మద్య గొడవ మరింత పెరిగింది. దాంతో రామరాజు మోహన్ రెడ్డి పైన చేయి చేసుకునేందుకు ప్రయత్నించగా, సీనియర్ నేత గోలి మధుసూధన్ రెడ్డి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే రామరాజు, మోహన్ రెడ్డి పైన దాడి చేస్తున్న దృశ్యాలను వర్షిత్ వర్గీయులకు బయటకు లీక్ చేశారు. దాంతో అవే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వర్షిత్ క్షమాపణ చెప్పాలని రామరాజు వర్గం ఆఫీసు ముందు ఆందోళనకు దిగింది. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. చివరకు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగడి మనోహర్ రెడ్డి రామరాజుకు ఫోన్ చేసి శుక్రవారం జిల్లాకు వస్తానని, అన్ని విషయాలు అక్కడే చర్చించి వర్షిత్తో సారీ చెప్పిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

జిల్లా అధ్యక్షుడు నాగం పైన సీనియర్లు ఫైర్
జిల్లా బీజేపీ ఆఫీసుకు వాస్తుదోషం పట్టుకుందనే ప్రచారం మొదలైంది. గత రెండు టర్మ్ల నుంచి జిల్లా అధ్యక్షుల పనితీరు పైన పార్టీలో జరుగుతున్న గొడవలే అందుకు నిదర్శనమని సీనియర్లు చెప్తున్నారు. గతంలో కంకణాల శ్రీధర్ రెడ్డి వ్యవహారి శైలి పైన కూడా అనేక విమర్శలు వచ్చాయి. దాంతో ఆయనకు రెండోసారి అవకాశం ఇవ్వలేదు. కానీ ఆ తర్వాత వచ్చిన వర్షిత్ రెడ్డికి మాత్రం రెండోదఫా ఛాన్స్ దక్కింది. అయితే మొదటి దఫాలోనే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న వర్షిత్ రెడ్డి పైన తనకున్న ఇమేజ్తో రెండోసారి అధ్యక్ష పదవి వరించింది. దాంతోనే బండారు ప్రసాద్, మాదగోని శ్రీనివాస్ గౌడ్, సాంబయ్య తదితరులు వర్షిత్ను వ్యతిరేకించారు. ఆ తర్వాత ఇరువర్గాలు కాంప్రమైజ్ అయ్యాయి. అయినప్పటికీ వర్షిత్ వైఖరిలో మార్పురాలేదని అంటున్నారు. ఆఫీసులోకి తన అనుమతి లేనిదే ఎవరినీ అనుమతించకపోవడం, ఫ్లెక్సీలు కట్టకుండా ఆంక్షలు విధించడం, పార్టీలో చర్చించకుండా ఏకపక్షంగా కార్యక్రమాలు పిలుపునివ్వడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని సీనియర్లు చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ తగలబెట్టే కార్యక్రమం గురించి పార్టీలో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయించడం వల్ల పోలీసులు తమ ఇళ్లలో చొరబడి నిర్భదించారని, ఇలాంటి చర్యలతో సోషల్ మీడియాలో ఆయన ఇమేజ్ పెంచుకోవాలనే ప్రయత్నం తప్పా పార్టీకి జరుగుతున్న డ్యామేజ్ గురించి అస్సలు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. పార్టీలో ఒకరి మీద మరొకరికి చాడీలు చెప్పడం గొడవలు సృష్టించడం వంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని, ఒకదశలో మాదగోని శ్రీనివాస్గౌడ్, రామరాజు మధ్య గొడవలు సృష్టించే కుట్ర కూడా చేసిండని చెప్తున్నారు.

మండల, జిల్లా కమిటీల్లో రామరాజు వర్గీయులకు ఒక్కరికి కూడా చోటు కల్పించలేదని, ఇటీవల జిల్లాకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తన బాధ చెప్పుకునేందుకు రామరాజు పర్సనల్గా ఆయన్ని కోరడం జరిగిందని, దీన్ని కూడా జీర్ణించుకోలేని వర్షిత్ రెడ్డి, నా ప్రమేయం లేకుండా కిషన్ రెడ్డితో నువ్వు ఒక్కడివే ఎలా మాట్లాడుతావ్ అని బెదిరించడని రామరాజు వర్గం చెప్తోంది. సోషల్ మీడియాలో స్టేటస్లు, పార్టీ కార్యక్ర మాలు అన్నీ పార్టీ శ్రేయస్సు కోసం కాకుండా తన సొంత ఇమేజ్ కోసం వైరల్ చేస్తుంటాడని, దాంతో తనకు మిలియన్ల సంఖ్యలో వీక్షకులు ఉన్నారని, నేను చెప్పినట్టు నడుచుకోకపోతే సెంట్రల్లో తన పలుకుబడి ఉపయోగించి ఏదైనా చేస్తానని బెదిరిస్తుంటాడని రామరాజు వర్గం చెప్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 30 వేల ఓట్లు సంపాధించి, అప్పుడున్న అధికార పార్టీని కాదని బీజేపీలో చేరితే బీసీ నేతగా తనను అవమానిస్తున్నారని, పార్టీలో నుండి బయటకు వెళ్ల గొట్టేందుకు బలమైన సామాజిక వర్గం లీడర్లు ఏకమై కుట్ర పన్నుతున్నారని రామరాజు వర్గీయులు చెప్తున్నారు.

