చిట్యాల, ఏపీబీ న్యూస్: చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల పోరులో ఒక అరుదైన మరియు చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. మున్సిపాలిటీ చరిత్రలో తొలిసారిగా ఒక ట్రాన్స్జెండర్ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగి అందరి దృష్టిని ఆకర్షించారు. మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు శివనేనిగూడెం గ్రామానికి చెందిన నాగిళ్ల కావేరి సుధాకర్, శుక్రవారం తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో, తన మద్దతుదారులతో కలిసి వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సై అన్నారు.
చిట్యాల రాజకీయ చరిత్రలో ఒక ట్రాన్స్జెండర్ కౌన్సిలర్ పదవికి పోటీ చేయడం ఇదే మొదటిసారి కావడంతో స్థానికంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. సామాజిక మార్పు కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాను పోటీ చేస్తున్నట్లు కావేరి సుధాకర్ పేర్కొన్నారు. ఈ పరిణామం మున్సిపల్ ఎన్నికల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, సమ్మిళిత రాజకీయాలకు వేదికగా నిలిచింది.