- కోదాడలో కర్ల రాజేష్ మృతికి మంత్రి ఉత్తమ్ బాధ్యత వహించాలి
- అధికారులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహారిస్తున్నరు: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నల్లగొండ, ఏపీబీ న్యూస్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని కక్షసాధింపు రాజకీయాలు చేస్తోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ధ్వజమెత్తారు. గురువారం నల్లగొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కోదాడ రాజేష్ మృతికి మంత్రి ఉత్తమ్ బాధ్యత వహించాలి
కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేష్ అనుమానాస్పద స్థితిలో మరణించడంపై లింగయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. “రాజేష్ మృతికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు, అధికార పార్టీకి తొత్తులుగా మారి బాధితులనే వేధించడం సిగ్గుచేటు” అని ఆయన మండిపడ్డారు.
నకిరేకల్‌లో ఇసుక, మట్టి మాఫియా రాజ్యమేలుతోంది
స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం కనుసన్నల్లోనే నకిరేకల్ నియోజకవర్గంలో భారీ ఎత్తున ఇసుక అక్రమ రవాణా, మట్టి దోపిడీ జరుగుతోందని లింగయ్య ఆరోపించారు. అధికారులు చట్టాన్ని అమలు చేయాల్సింది పోయి, కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ అక్రమాలకు సహకరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ భూములను, సహజ వనరులను కాపాడాల్సిన బాధ్యతను అధికారులు మర్చిపోయారని ఎద్దేవా చేశారు.
హరీష్ రావుపై అక్రమ కేసులు – డైవర్షన్ పాలిటిక్స్
సింగరేణి బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టినందుకే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని లింగయ్య పేర్కొన్నారు. “కాంగ్రెస్ చేస్తున్న స్కామ్‌ల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే రాత్రికి రాత్రే సిట్ (SIT) ద్వారా నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారు. హరీష్ రావు లాంటి సీనియర్ నేతలపై కక్షసాధింపు చర్యలకు దిగడం రేవంత్ రెడ్డి పిరికిపంద చర్య” అని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ హెచ్చరిక
ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతున్న తమ నాయకులపై పోలీసులను ప్రయోగిస్తే ఊరుకునేది లేదని లింగయ్య హెచ్చరించారు. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనేనని, అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.