సిద్దిపేట, ఏపీబీ న్యూస్: సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ ఉప ఎన్నికల్లో అనూహ్య ఫలితం వెలువడింది. అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇస్తూ.. 2వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కమలాపురం గీతాంజలి ఘనవిజయం సాధించారు. రాజకీయ కక్షసాధింపులకు కాలం చెల్లిందని, ప్రజలే సరైన తీర్పునిచ్చారని ఈ విజయం నిరూపించింది.
ఉత్కంఠ పోరులో భారీ మెజారిటీ
మున్సిపాలిటీలోని 2వ వార్డుకు జరిగిన ఉప ఎన్నిక ఫలితాల్లో గీతాంజలి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 223 ఓట్ల భారీ మెజారిటీతో విజయం నమోదు చేశారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుండే ఆమె ఆధిక్యం కొనసాగించగా, తుది ఫలితం వెలువడగానే బీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.
భర్తపై సస్పెన్షన్ వేటు.. ప్రజల్లో వ్యతిరేకత?
ఈ ఎన్నికల ప్రచార సమయంలో గీతాంజలి భర్త రమేష్ను (పోలీస్ కానిస్టేబుల్) ప్రభుత్వం సస్పెండ్ చేయడం తీవ్ర సంచలనంగా మారింది. గీతాంజలి బీఆర్ఎస్ తరపున పోటీ చేయడమే లక్ష్యంగా చేసుకొని, రాజకీయ ఒత్తిళ్లతో అర్ధరాత్రి పూట ఆయనపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారని ఆరోపణలు వచ్చాయి.
గీతాంజలి ఆవేదన:
“నా భర్త ఎలాంటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. పైగా డీసీపీ స్థాయిలో వేధింపులకు గురై ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేవలం నేను పోటీ చేస్తున్నాననే కక్షతోనే ఆయన ఉద్యోగాన్ని ఇబ్బంది పెట్టారు.”
ఈ ఘటనపై గీతాంజలి గతంలోనే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన వ్యక్తం చేశారు. భర్తపై జరిగిన అన్యాయమే తనకు ప్రజల్లో సానుభూతిని, నైతిక బలాన్ని తెచ్చిపెట్టిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విజయంతోనైనా తన భర్తపై ఉన్న సస్పెన్షన్ను ప్రభుత్వం ఎత్తివేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.