Breaking News: డీసీఎం – బైక్ ఢీ.. ఎన్నికల విధుల్లో ఉన్న కానిస్టేబుల్ దుర్మరణం

నల్లగొండ, ఏపీబీ న్యూస్: విధి నిర్వహణ ముగించుకుని గమ్యస్థానానికి చేరుకోవాల్సిన ఒక పోలీస్ కానిస్టేబుల్ మార్గమధ్యలోనే రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని చందనపల్లి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మునుగోడు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ షేక్ ఖయ్యాం (34) అక్కడికక్కడే మృతి చెందారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. కానిస్టేబుల్ ఖయ్యాం నల్లగొండలో మున్సిపల్ ఎన్నికల విధులు ముగించుకుని, తిరిగి తన స్వస్థలమైన నకిరేకల్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. చందనపల్లి గ్రామం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఒక డీసీఎం (DCM) వాహనం ఖయ్యాం ప్రయాణిస్తున్న బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన ఆయన స్పాట్లోనే ప్రాణాలు వదిలారు.

మృతుడు షేక్ ఖయ్యాంకు భార్య మరియు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నట్లు తెలిసింది. కష్టపడి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఖయ్యాం అకాల మరణంతో ఆ కుటుంబం వీధిన పడింది. తండ్రి మరణవార్త విని చిన్నారి పిల్లలు, భార్య కన్నీరుమున్నీరవుతున్న తీరు స్థానికులను కలచివేసింది.

ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్ను అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Share
Share