Counter: అవమానాలకు కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్.. కేటీఆర్ ఓ ‘డ్రామారావు’: ఎంపీ చామల ధ్వజం

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: బీఆర్ఎస్ నేత కేటీఆర్ పర్యటనలు, వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ తీరును ‘అబద్ధాల రావును మించిన డ్రామారావు’ అంటూ అభివర్ణించారు.

“కేటీఆర్ అమెరికా నుంచి రాగానే జగిత్యాల, ఇబ్రహీంపట్నం పర్యటనలు చేస్తున్నారు. బావ హరీష్ రావు పార్టీలో మంచిగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారని, తన ఉనికిని చాటుకోవడానికే కేటీఆర్ ఈ డ్రామాలు ఆడుతున్నారు” అని చామల ఎద్దేవా చేశారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ అన్యాయం చేసిందని మాట్లాడుతున్న కేటీఆర్, గతంలో తమ పార్టీలో సీనియర్లకు జరిగిన అవమానాలను గుర్తు చేసుకోవాలని సూచించారు.

బీఆర్ఎస్ హయాంలో నేతలు పడ్డ అవమానాలను ఎంపీ ఈ సందర్భంగా ఏకరువు పెట్టారు:

రాజయ్య & ఈటల: ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను ఆరు నెలలకే బర్తరఫ్ చేశారని, బీసీ బిడ్డ ఈటల రాజేందర్ను అవమానకరంగా బయటకు పంపారని గుర్తు చేశారు.

తుమ్మల & జూపల్లి: పాలేరులో తుమ్మలకు సభ్యత్వ పుస్తకాలు ఇవ్వకుండా, కొల్లాపూర్లో జూపల్లిని అవమానించింది బీఆర్ఎస్ కాదా? అని ప్రశ్నించారు.

సొంత కుటుంబంలోనే: కవితను, హరీష్ రావును కూడా ఆ పార్టీలో అవమానించారని, అలాంటి పార్టీ నేతలు కాంగ్రెస్ గురించి మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు.

“2018లో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి బీఆర్ఎస్ మోసం చేసింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చినట్లుగా 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసి చూపించారు” అని కిరణ్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నా, హైదరాబాద్ అభివృద్ధి పథంలోనే ఉందన్నారు.

కుటుంబ పాలన చేస్తూ హైదరాబాద్ చుట్టూ ఫామ్ హౌస్లు కట్టుకున్న బీఆర్ఎస్ నేతలకు అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారని ఎంపీ గుర్తు చేశారు. కాంగ్రెస్ 90 మున్సిపాలిటీలు గెలిస్తే, కేటీఆర్ మాత్రం ఒక్క మున్సిపాలిటీ గెలిచి సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ముఖ్యంగా జీవన్ రెడ్డి వ్యవహారాన్ని కేటీఆర్ అస్త్రంగా చేసుకుంటే, బీఆర్ఎస్ గత చరిత్రను చామల కిరణ్ రెడ్డి తిరగదోడారు. రాజకీయ వారసత్వ పోరు, రైతు సమస్యలు మరియు మున్సిపల్ ఎన్నికల ఫలితాల చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి.

Share
Share