- సూర్యాపేట, తిరుమలగిరి, మిర్యాలగూడ లోనే రెండెంకలు దాటిన స్థానాలు
- బలమైన అభ్యర్థుల్లేక ప్రజల్లో సన్నగిల్లిన నమ్మకం
- మాజీ ఎమ్మెల్యేల ఒంటెద్దు పోకడలతో మరింత నష్టం
- అవకాశం ఉన్న చోట కూడా గెలిపించుకోలేని దుస్థితి
- మిర్యాలగూడ, తిరుమలగిరిలోనే మిశ్రమ ఫలితం
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు పార్టీ పల్టీలు కొట్టింది. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉందని పట్టణ ఓటర్లు తమకే పట్టం కడ్తారని ఆశించిన మాజీ ఎమ్మెల్యేలకు నిరాశే మిగిలింది. 17 మున్సిపాలిటీలు, నల్లగొండ కార్పోరేషన్తో కలిపి బీఆర్ఎస్ 372 వార్డుల్లో పోటీ చేస్తే కేవలం 88 వార్డుల్లోనే గెలిచింది. కేవలం 23.65 శాతం మంది ఓటర్లే బీఆర్ఎస్కు మొగ్గు చూపారు. కాంగ్రెస్కు 63.88 శాతం మంది ఓటర్లు మద్థతు తెలిపారు. మిర్యాలగూడ, సూర్యాపేట మున్సిపాలిటీల్లో మాత్రమే ఆపార్టీకి రెండెంకెలు దాటాయి. తిరుమలగిరిలో బీఆర్ఎస్ బలమైన అభ్యర్థి దొరకడం తో అక్కడ పాలకవర్గాన్ని కైవసం చేసుకుంది. తిరుమలగిరి తరహాలోనే మిర్యాలగూడలో కూడా మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు గట్టి ప్రయత్నం చేశారు, దాంతోనే 14 వార్డులు కైవసం చేసుకుంది. ఇదే రకమైన స్పీడ్ను మిగతా మాజీ ఎమ్మెల్యేలు అందుకోలేకపోయారు.
ఎమ్మెల్యేలను, మంత్రులు లక్ష్యంగా విమర్శలు చేయడం తప్పా అభ్యర్థుల గెలుపోటముల గురించి పట్టించుకోలేదు. పార్టీ పంపిన ఫండ్ సైతం విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. గెలుపుకు అవకాశం ఉన్న వార్డుల్లో కాకుండా తమ వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకునేందుకు ఓడి పోతామని తెలిసిన వార్డులోనూ లెక్కలేనంత ఖర్చు పెట్టారు, దీని వల్ల చివరి నిమిషంలో డబ్బులు చాలక చాలా మంది అభ్యర్థులు చేతులు ఎత్తేశారు. నల్లగొండలో మేయర్ అభ్యర్థిగా బరిలో దిగిన చకిలం వసంత లక్ష్మీని సైతం గెలిపించుకోలేకపోయారు. తెలంగాణ ఉద్యమ కారుడైన చకిలం అనిల్ కుమార్ భార్య గెలుపు కోసం కేటీఆర్, హారీష్రావు వస్తారనే ప్రచారం కూడా జరిగింది, కానీ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రమేయం లేకుండానే వసంత లక్ష్మీ ని మేయర్గా ప్రకటించడం, ఆమె ఓటమికి ప్రధాన కారణమైందని అంటున్నారు. పోలీసులతో ఎప్పుడు ఘర్షణకు దిగుతారనే అపవాదును మూటగట్టుకున్న కంచర్ల భూపాల్ రెడ్డి ఒంటెద్దు పోకడలతోనే 15 వార్డులు గెలుస్తామని భావిస్తే చివరకు 9 వార్డులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అభ్యర్థుల ఎంపికలో సీనియర్ల అభిప్రాయాలు, సలహాలు పట్టించుకోలేదని సీనియర్లు విమర్శిస్తున్నారు.
మూడు నియోజకవర్గాల్లో అడ్రస్ గల్లంతు
కోదాడ, హుజూర్నగర్, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోయింది. నందికొండ, హాలియాలో కేవలం రెండు వార్డుల్లోనే గెలిస్తే కోదాడలో మూడింటితో సరిపెట్టుకుంది. హుజూర్నగర్లో 4 వార్డులు గెలిస్తే, నేరేడుచర్లలో 5 వార్డుల దగ్గరే ఆగిపోయింది. హుజూర్నగర్లో పార్టీకి దిక్కులేకుండా పోయింది. కోదాడలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి, బొల్లం మల్లయ్య యాదవ్కు మధ్య ఉన్న విభేదాలు ఇంకా సమసిపోలేదు. కోదాడలో కర్ల రాజేష్ హత్య పైన బహిరంగ సభ, కాంగ్రెస్ రౌడీ రాజకీయాల పైన మాజీ ఎమ్మెల్యే చేసిన రాద్ధాంతం పార్టీకి ఏమాత్రం కలిసిరాలేదు. సాగర్ లో బీఆర్ఎస్ బలగాన్ని మొత్తం ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి గంపగుత్తాగా కాంగ్రెస్లోకి సాగనంపారని, దాంతోనే అక్కడ పార్టీ మనుగడ లేకుండా పోయింది. ఇప్పుడు ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని మాత్రం మాజీ ఎమ్మెల్యే భగత్ పైన మోపేందుకు సిద్ధమయ్యారని ఇలాంటి పరిణామాలు పార్టీని ఎదగకుండా చేస్తాయని సీనియర్లు అభిప్రాయ పడుతున్నారు.
మాజీ ఎమ్మెల్యేల తీరు మారట్లే
అధికారం కోల్పోయి రెండేళ్లు దాటిన మాజీ ఎమ్మెల్యేల ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదని పార్టీ కేడర్ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. నల్గొండ కార్పోరేషన్లో 24 డివిజన్లలో పార్టీ ఖాళీ అయ్యింది. కొత్త నిర్మాణం చేపట్టలేదు, బలమైన అభ్యర్థులు లేకపోవడంతో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ బలంగా ఉన్న డివిజన్లలో సైతం బీజేపీ పాగా వేసింది. బీఆర్ఎస్, బీజేపీ వైఖరి వల్ల స్వతంత్రులు, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు సత్తా చాటారు. చండూరు, చౌటుప్పుల్లో బలమైన అభ్యర్థులు లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతులెత్తేశారు. చండూరులో గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఎన్నికల ఖర్చుకు వెనకడుగు వేశారు. చండూరులో ఆరు వార్డుల్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందని స్థానిక నాయకత్వం ఎంత చెప్పిన పట్టించుకోలేదు. చౌటుప్పుల్లో అయితే కొన్ని వార్డుల్లో అభ్యర్థులనే నిలబెట్టలేదు. పోచంపల్లిలో పార్టీకి మిశ్రమ ఫలితాలే వచ్చాయి. అదే భువనగిరిలో మాత్రం అసలు అభ్యర్థులే కరువయ్యారు, కనీసం 11 వార్డుల్లో గెలుస్తదని భావిస్తే కేవలం 4 వార్డులతోనే ఆగిపోయింది.
మొదటి నుంచి కాంగ్రెస్ బలంగా ఉన్న భువనగిరి పట్టణంలో పార్టీ బలోపేతం దిశగా మాజీ ఎమ్మెల్యే చర్యలు చేపట్టకపోవడంతో అక్కడ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. ఆలేరు, భువనగిరిలో మాజీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, చింతల వెంకటేశ్వర రెడ్డిలను ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెరవెనక నుంచి ప్రోత్సహించడం కూడా పార్టీకి నష్టం కలిగించింది, దీంతోనే ఆలేరులో మూడు వార్డులు, యాదగిరిగుట్టలో ఒక వార్డు మాత్రమే గెలిచింది. మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత, ఆమె భర్త మహేందర్ రెడ్డి అభ్యర్థుల గెలుపు కోసం శాయశక్తుల ప్రయత్నించారు. కానీ ఎన్నికల ఖర్చు, అధికార పార్టీ బెదిరింపులకు భయపడి వెనక్కి తగ్గారు. దేవరకొండలో జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కష్టానికి ఆరు వార్డులు దక్కాయి. చిట్యాలలో మాజీ ఎమ్మెల్యే చిరు మర్తి లింగయ్య ఎమ్మెల్యే వీరేశం పైన ఎదురుదాడికి దిగినప్పటికీ కేవలం రెండు వార్డుల్లోనే గెలిచింది.
బీఆర్ఎస్ గెలిచిన స్థానాలు – పట్టణాల వారీగా
| పట్టణం / మున్సిపాలిటీ | గెలిచిన స్థానాలు |
| నల్లగొండ | 9 |
| మిర్యాలగూడ | 14 |
| దేవరకొండ | 6 |
| నందికొండ | 1 |
| హాలియా | 1 |
| హుజూర్నగర్ | 4 |
| కోదాడ | 3 |
| సూర్యాపేట | 11 |
| నేరేడుచర్ల | 5 |
| చిట్యాల | 2 |
| చండూరు | 3 |
| చౌటుప్పల్ | 3 |
| భువనగిరి | 4 |
| పోచంపల్లి | 5 |
| యాదగిరిగుట్ట | 1 |
| ఆలేరు | 3 |
| తిరుమలగిరి | 10 |
| మోత్కూరు | 3 |