- కుటుంబాలను నాశనం చేసే ఇలాంటి రాజకీయాలు ఎవరిపైనా చేసినా తప్పే
- గతంలో కేటీఆర్ పైన కూడా దుర్మార్గపు ప్రచారం చేసిర్రు
- ఇప్పుడు సొంత పార్టీలోనే మొదలైంది: మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి
సూర్యాపేట, ఏపీబీ న్యూస్: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన పైన జరుగుతున్న కుట్రల పట్ల జాగ్రత్తంగా ఉండాల్సిందని, కుటుంబాలను నాశనం చేసే ఇటువంట దుర్మార్గపు రాజకీయాలు ఎవరి పైన చేసిన తప్పేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేటలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో కేటీఆర్ పైన కూడా ఇలాంటి దుర్మార్గపు ప్రచారం చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ సొంత పార్టీలోనే మొదలైందని అన్నారు. ముఖ్యమంత్రి ఆఫీసు లేదా గాంధీ భవన్ నుంచే ఇలాంటి ఘోస్ట్ ఛాన్సళ్లతో ప్రచారం చేస్తున్నారని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి ఫిర్యాదు చేసినప్పటికీ డీజీపీ, చీఫ్సెక్రటరీ ఎందుకు చర్యలు తీసుకోకుండా ఉన్నారో, వాళ్లను ఆపుతున్న పెద్ద శక్తి ఎవరో తెలియాల్సి ఉందన్నారు.
రాష్ట్రంలోని ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల సంఘం నిజంగానే ఇలాంటి చర్యల పైన ఉక్కుపాదం మోపితే వాళ్లను ఆపుతున్న శక్తి ఎవరో వాళ్లకే ఘోస్ట్ ప్రచారం గురించి తెలుసని జగదీష్రెడ్డి అన్నారు. పార్టీ సింబల్తో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు కష్టపడి పని చేయాలని, కాంగ్రెస్ మోసపూరిత చర్యలను ప్రజల్లో ఎండగట్టాలని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాల గురించే వివరించాలని చెప్పారు. సీఎం రేవంత్ పాలనలో అక్రమ కేసులు, భూముల అక్రమాలు తప్పా అభివృద్ధి శూన్యమని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు.