మిర్యాలగూడ, ఏపీబీ న్యూస్: మిర్యాలగూడలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ మేరకు మిర్యాలగూడలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బడుగుల లింగయ్య యాదవ్ మరియు నల్లమోతు భాస్కర్ రావు రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.
రేవంత్ రెడ్డి తీరు ‘వీధి రౌడీ’లా ఉంది: బడుగుల లింగయ్య యాదవ్
బీఆర్ఎస్ నేత బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తికి ఉండాల్సిన హుందాతనం రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు. మిర్యాలగూడ సభలో ఆయన మాట్లాడిన భాష చూస్తుంటే ఒక ప్రజాప్రతినిధిలా కాకుండా వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. “వ్యక్తిగత దూషణలు చేయడం హేయమైన చర్య. రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారు. వెంటనే భాస్కర్ రావుకి బహిరంగ క్షమాపణ చెప్పాలి” అని డిమాండ్ చేశారు.
కేసీఆర్ లేకపోతే ఆంధ్ర పాలకుల కాళ్లు మొక్కేవాడివి: భాస్కర్ రావు ఆగ్రహం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ పెట్టిన భిక్ష వల్లే నేడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారని గుర్తు చేశారు. కేసీఆర్ గనుక రాష్ట్రాన్ని సాధించకపోతే, రేవంత్ రెడ్డి ఇప్పటికీ ఆంధ్ర పాలకుల దగ్గర గులాంగిరి చేస్తూ వారి కాళ్లు మొక్కేవాడని ఎద్దేవా చేశారు.
భాస్కర్ రావు చేసిన కీలక వ్యాఖ్యలు:
- ఓటుకు నోటు కేసు: “ఓటుకు నోటు కేసులో దొరికిపోయి జైలుకు వెళ్లిన చరిత్ర నీది. నీవా మాకు నీతులు చెప్పేది?” అని ప్రశ్నించారు.
- బ్లాక్ మెయిల్ రాజకీయాలు: రేవంత్ రెడ్డి చేసే బ్లాక్ మెయిల్ రాజకీయాలు మిర్యాలగూడలో సాగవని హెచ్చరించారు.
- అభివృద్ధిపై సవాల్: “నేను చేసిన అభివృద్ధి ఏంటో నియోజకవర్గంలో ప్రతి గడపకూ తెలుసు. మాటలతో కోటలు కట్టడం మాకు రాదు, మేం చేతల్లో చూపించాం” అని స్పష్టం చేశారు.

అధికారంలో ఉండి భయపడుతున్నారా?
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ప్రతిపక్షంలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అనడం అత్యంత హాస్యాస్పదమని ఆయన కొట్టిపారేశారు. “అధికార యంత్రాంగం, పోలీస్ వ్యవస్థ అంతా చేతిలో ఉన్న ముఖ్యమంత్రి.. ప్రతిపక్ష నేతలు భయపెడుతున్నారని మాట్లాడటం ఆయన అసమర్థతకు నిదర్శనం” అని భాస్కర్ రావు ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ అభ్యర్థులకు వస్తున్న వ్యతిరేకతను చూసి ఓడిపోతామనే భయంతోనే రేవంత్ రెడ్డి ఇలాంటి అర్థరహితమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే అబద్ధాలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని భాస్కర్ రావు ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి, ప్రజల దృష్టిని మళ్లించడానికి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. “అభివృద్ధి చేయడం చేతకాక, పథకాలు అమలు చేయలేక దిక్కుతోచని స్థితిలో ముఖ్యమంత్రి అసత్యాలు మాట్లాడుతున్నారు” అని విమర్శించారు.
హుందాతనం మరచి విమర్శలు
ముఖ్యమంత్రి పదవికి ఒక గౌరవం ఉంటుందని, కానీ రేవంత్ రెడ్డి ఆ స్థాయిని మరచి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “కేసీఆర్ గారు ప్రాణాలకు తెగించి పోరాడి రాష్ట్రం తెస్తే.. ఆ ఫలాలను అనుభవిస్తూ ఆయననే విమర్శించడం సిగ్గుచేటు” అని ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటు కాకపోయి ఉంటే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటో ఆయనే ఆలోచించుకోవాలని హితవు పలికారు.
వాస్తవాలు తెలుసుకోకుండా, క్షేత్రస్థాయిలో జరిగిన అభివృద్ధిని విస్మరించి ,అహంకారంతో ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, లేదంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నాగార్జున చారి, సిద్ధార్థ, నారాయణ రెడ్డి, వీరకోటి రెడ్డి, బైరం సంపత్, కట్టా మల్లేష్ గౌడ్, ప్రకాష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.