హైదరాబాద్(APB News): ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులు కాకుండా.. రైతులు మళ్లీ కొత్తగా ఎందుకు ప్రమాణ పత్రాలు ఇవ్వాలి..? అని రేవంత్ రెడ్డి సర్కార్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. రైతులు కాదు ప్రమాణపత్రాలు ఇవ్వాల్సింది.. రేవంత్ రెడ్డి ఇవ్వాలి అని కేటీఆర్ సూచించారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా హామీలు ఇచ్చారు. ఎన్నికలప్పుడేమో కాంగ్రెస్ నేతలు బాండ్ పేపర్లు రాసిచ్చారు.. ఇప్పుడేమో రైతులు ఊర్లలో ప్రమాణపత్రం ఇవ్వాలట. ఇంతకంటే విచిత్రమైన ముచ్చట వినలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ప్రజాపాలన అని కింద అన్ని వర్గాల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇండ్ల కోసం కోటి 6 లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. మరి ఈ సమాచారం ప్రభుత్వం దగ్గర ఉండాలి కదా..? ఇప్పుడేందుకు కొత్తగా రైతులను ప్రమాణపత్రాలు అడుగుతున్నారని కేటీఆర్ అడిగారు.
ప్రమాణపత్రం ఇస్తేనే రైతుభరోసా పైసలు ఇస్తాం అంటున్నారు..
అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాపాలన అన్నారు.. మొన్నటి దాకా కుల గణన, ఇప్పుడ మళ్లా కొత్తగా ప్రమాణ పత్రం ఇవ్వాలని అంటున్నారు. ప్రమాణపత్రం ఇస్తేనే రైతుభరోసా పైసలు ఇస్తాం అంటున్నారు. రైతును శాసించే స్థాయికి కేసీఆర్ తీసుకొచ్చారు. వీళ్లేమో రైతును యాచించే స్థాయికి తీసుకెళ్తున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సన్నాసులు.. అఫిడవిట్లు దేవుండ్ల వద్ద పెట్టారు.. మేం రాగానే అమలు చేస్తామని డిక్లరేషన్ల పేరిట బిల్డప్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు దిక్కుమాలిన విధానాలు తీసుకొస్తున్నారు అని కేటీఆర్ మండిపడ్డారు.
రైతు భరోసా కింద ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు..
రైతు భరోసా కింద ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వానాకాలం పంట పెట్టుబడి ఎగ్గొట్టారు.. వదిలిపెట్టం.. దాన్ని జమ చేసే వరకు పోరాడుతాం. ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా.. ప్రమాణపత్రం ఎవ్వరివ్వాలి.. నీవు, నీ ప్రభుత్వం ప్రమాణపత్రం ఇవ్వాలి. ఏ ఊర్లో ఏ రైతుకు ఎంత రుణమాఫీ అయిందో దమ్ముంటే బయటపెట్టు. ప్రజలకు కూడా తెలుస్తది. ఈ ఊరిలో ఎంత మంది భూ యజమాలు, కౌలు రైతులు ఉన్నారో స్పష్టంగా చెప్పాలి. ఏ ఊరిలో బోనస్ ఎంత మందికి ఇచ్చావో బయటపెట్టు. రైతు కూలీలు ఎంత మంది ఉన్నారో బయటపెట్టు అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు ఊరురా నిలదీయాలి..
నీతి తప్పిన ప్రభుత్వం ఇది. రైతు బంధు పథకాన్ని బొందపెట్టే ప్రయత్నం చేస్తున్నది. కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తున్నానని రేవంత్ చెప్పినట్టే.. దీన్ని కూడా మింగేస్తాడు అని రైతులు గ్రహించాలి. రైతుబంధులో రూ. 22 వేల కోట్లు పక్కదారి మళ్లాయని బద్నాం చేస్తున్నారు సీఎం, అధికారులు. మరి రూ. 22 వేల కోట్లు ఎవరి ఖాతాలో పోయాయో ప్రజలకు తెలియాలి. ఇది పచ్చి దొంగమాట. చెత్తమాట. ఎందుకంటే.. వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే.. పత్తి రైతు, కంది రైతు, చెరుకు, పసుపు రైతులు, పోడు రైతులకు రెండో పంట పండదు.. దాంట్లను కూడా ఇండ్లకే నూకాం.. అయినా రైతు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో రెండో పంటకు కూడా రైతుబంధు వేశాం. అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారంటే రైతుబంధు పథకానికి బొంద పెట్టడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంలాగా కనబడుతుంది. రైతున్నలు ప్రభుత్వాన్ని నిలదీయండి. ప్రజా పాలనలో దరఖాస్తు ఇచ్చాం కదా.. మళ్లీ ప్రమాణ పత్రం ఎందుకు అని నిలదీయండి. 70 లక్షల ఖాతాలు నీ దగ్గర ఉన్నాయి.. పొలం వివరాలు అన్నీ తెలుసు.. తెలిసీ కూడా ఈ ప్రయత్నం చేస్తున్నావంటే కటింగ్ పెట్టుందకు ప్లాన్ చేస్తున్నవ్.. కాబట్టి రైతులు ఊరురా నిలదీయాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని కేటీఆర్ సూచించారు.