పొత్తు పెట్టుకుందాం రండి! బీఆర్​ఎస్​, బీజేపీ, కమ్యూనిస్టులు ఫ్రెండ్లీ కాంటెస్ట్?

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్​: మున్సిపల్​ ఎన్నికల్లో పొత్తుల గురించి రాజకీయ పార్టీల్లో అప్పుడే చర్చ మొదలైంది. పార్టీ రహితంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్​ పోటీ చేయడంతో కాంగ్రెస్​ మద్ధతుదారులు చాలా చోట్ల ఓడిపోయారు. ఎమ్మెల్యేలు సొంత అభ్యర్థుల పక్షాన ప్రచారం చేసినప్పటికి రెబల్స్​ను నిలువరించలేకపోయారు. కానీ పార్టీ సింబల్స్​తో జరిగే మున్సిపల్​ ఎన్నికలు ప్రధాన పార్టీలకు పెద్ద పరీక్షగా మారనున్నాయి. కాంగ్రెస్​లో టికెట్ల పంచాయతీ అప్పుడే మొదలైంది. సొంత పార్టీ కౌన్సిలర్లు, వలసొచ్చిన కౌన్సిలర్లకు మధ్య పోటీ నెలకొంది. రిజర్వేషన్లు వస్తే తప్పా, ఎవరి సీటుకు ఎసరొస్తదో ఇప్పుడే కచ్చితంగా చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. కానీ బీఆర్​ఎస్​ మాత్రం ఈ విషయంలో ఒకింత ముందుగానే జాగ్రత పడుతోంది. పంచాయతీ ఎన్నికల తరహాలోనే తమతో కలిసొచ్చే బీజేపీ, కమ్యూనిస్టులతో ఫ్రెండ్లీ కాంటెస్ట్​కు సిద్ధమవుతోంది.

మున్సిపాలిటీల్లో బీఆర్​ఎస్​ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకడం లేదు. దాంతో కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపాలని చూస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన క్యాండేట్లకు ప్రజల్లో సానుభూతి ఉంటదనే కారణంతో వాళ్లనే పార్టీ అభ్యర్థులుగా ఎంపిక చేయాలని భావిస్తోంది. పట్టణాల్లో బీజేపీ ఓటు బ్యాంకు బలంగా ఉన్నప్పటికీ బలమైన అభ్యర్థులు లేకపోవడం అతి పెద్ద మైనస్​. కమ్యూనిస్టుల ప్రభావం రూరల్​ బ్యాక్​ గ్రౌండ్​ ఉన్న మున్సిపాలిటీల్లో మాత్రమే కనిపిస్తోంది. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, భువనగిరి, సూర్యాపేట, కోదాడ, హుజూర్​నగర్​లో బీజేపీ ఓటు బ్యాంకు ఉండగా, కమ్యూనిస్టులు చౌటుప్పుల్​, చండూరు, కోదాడ, హుజూర్​నగర్​, మిర్యాలగూడలో ప్రభావం చూపనున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు ఏపార్టీతో పొత్తు పెట్టుకుంటే రాజకీయంగా కలిస్తుందనే దాని పైనే ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయి.

2‌‌020 ఎన్నికల్లో కాంగ్రెస్​తో బీజేపీ, కమ్యూనిస్టులు కలిసొచ్చిన చోట ఫ్రెండ్లీ కాంటెస్ట్​ చేశారు. దీంతో బీఆర్​ఎస్​కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యంగా నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, నేరేడుచర్ల, చండూరు, చిట్యాల, మోత్కూరు, భువనగిరి మున్సిపాలిటీల్లో బీఆర్​ఎస్​కు గట్టిపోటీ ఇచ్చింది. ఈసారి సీన్​ రివర్స్​ కానుంది. అప్పుడు గెలిచిన బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు తిరిగి కాంగ్రెస్​లో చేరిపోవడంతో పార్టీ బలం పెరిగింది. కానీ పోటీ మాత్రం ఎక్కువైంది. అదే బీఆర్ఎస్​లో పోటీ చేయడానికి అభ్యర్థులు లేక కొత్త అభ్యర్థులను, అసంతృప్తుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రజల్లో సానుభూతి వర్కవుట్​ చేయడానికి గత ఎన్నికల్ల ఓటమిపాలైన క్యాండేట్లే సరియైన అభ్యర్థులుగా బీఆర్​ఎస్​ భావిస్తోంది. దీనికి తోడు బీజేపీతో అంతర్గత పొత్తు కుదిరితే కాంగ్రెస్​ను ఇరకాటంలో పెట్టొచ్చని చూస్తోంది. దీన్ని తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదిపేందుకు ఇప్పటి నుంచే ప్లాన్​ చేస్తోంది.

ప్రతిపక్ష పార్టీలోని అభ్యర్థులనే తమ కోవర్టులుగా వాడుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్​లో టికెట్​ దక్కని అభ్యర్థులను ఇతర పార్టీల్లోకి సాగనంపి వాళ్లతోనే కోవర్టు ఆపరేషన్​ నడపించాలని ప్లాన్​ జరుగుతోంది. గత ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్​ కలిసి పని చేసిన చోట ఇదే రకమైన ప్లాన్​ అమలు చేశారు. ఆ ఎన్నికల్లో చైర్మన్​ అభ్యర్థులను ముందుగానే డిసైడ్​ చేయడం వల్ల గట్టిపోటీ ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఈసారి సొంత పార్టీకి చెందిన కొంతమంది లీడర్లను ప్రత్యర్థుల కోటలోకి సాగనంపి మైండ్​గేమ్​ ప్లే చేయాలనే పథకం పన్నుతున్నారు.

మున్సిపాలిటీబీఆర్​ఎస్​కాంగ్రెస్​బీజేపీ
నల్లగొండ202006
మిర్యాలగూడ271801
దేవరకొండ110403
చండూరు020701
చిట్యాల060400
హాలియా050600
నందికొండ090300
సూర్యాపేట241505
నేరేడుచర్ల070700
తిరుమలగిరి110400
ఆలేరు080101
భువనగిరి151107
చౌటుప్పుల్080503
మోత్కూరు070500
పోచంపల్లి090201
యాదగిరిగుట్ట040400

నోట్: స్వతంత్రులు, ఇతరులు ఆలేరులో ఇద్దరు, యాదగిరిగుట్టలో ముగ్గురు, సూర్యాపేటలో నలుగురు, చిట్యాలలో ఇద్దరు, దేవరకొండలో ఇద్దరు, కొన్ని చోట్ల ఒక్కొక్కరు గెలుపొందారు.

పార్టీసాధించిన స్థానాలు
బీఆర్ఎస్218
కాంగ్రెస్131
బీజేపీ28
సీపీఎం06
సీపీఐ01
ఎంఐఎం01
స్వతంత్రులు18
Share
Share