Breaking News: మున్సిపాలిటీల్లో భారీగాఓటర్లుగల్లంతు..

నల్లగొండప్రతినిధి, ఏపీబీన్యూస్: మున్సిపాలిటీల్లో ఓటర్లు గల్లంతయ్యారు. ఒకటి, రెండు కాదు ఏకంగా వందల సంఖ్యలో ఓటర్లు ఒక వార్డు నుంచి మరొక వార్డుల్లో చేంజ్​ అయ్యారు. మాజీ కౌన్సిలర్లు ముసాయిదా జాబితాను ముందే సుకుని కుస్తీ పడుతున్నారు. గురువారం ప్రకటించిన ముసాయిదా జాబితా తప్పుల తడకగా మారిందని ఆరోపిస్తున్నారు. ఏకంగా పోలింగ్​ కేంద్రాలే మారిపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. వార్డుల సరిహద్దులు దాటి ఓటర్లు మరొక వార్డుల్లోకి మారిపోవడంతో ఓటర్ల సంఖ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది.

ఒక్కో వార్డులో మూడు వేల పై చిలుకు ఉండాల్సిన ఓటర్లు 2వేలు, 14 వందల ఓటర్లు మాత్రమే ఉన్నారు. దీంతో గల్లంతైన ఓటర్లు ఎక్కడున్నారో కనిపెట్టే పనిలో మాజీ కౌన్సిలర్లు బిజీగా ఉన్నారు. గత ఎన్నికల్లో పోలింగ్​ కేంద్రం పరిధిలో వెయ్యి ఓట్లు ఉండాలనే నిబంధన చేర్చారు. కానీ ఇప్పుడు 800 ఓట్లకు తగ్గించారు. ఇలా చేయడం వల్ల పోలింగ్​ కేంద్రాలు పెరిగి త్వరగా పోలింగ్​ ముగుస్తుందనే ఉద్దేశంతో ఓటర్ల సంఖ్యను తగ్గించినట్టు తెలుస్తోంది. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట, భువనగిరి, కోదాడ, హుజూర్​నగర్​ పెద్ద మున్సిపాలిటీల్లో ఈ తరహా తప్పులు ఎక్కువగా జరిగాయి.

నల్లగొండ మున్సిపాలిటీలో పద్మావతి నగర్​, ఆర్టీసీ కాలనీ, గొల్లగూడ, శ్రీనగర్​ కాలనీ తదితర ప్రాంతాల్లో భారీగా ఓట్లు గల్లంతయ్యాయి. ఒక వార్డు పరిధిలోని పోలింగ్​ కేంద్రాల ఓటర్లు మరొక వార్డుల్లోకి చేంజ్​ అయ్యాయి. దీంతో 41 వార్డులో 3వేల మంది ఓటర్లకు గాను కేవలం 15 వందలు మాత్రమే ఉన్నాయి. అదే విధంగా గొల్లగూడలో 42 వార్డుల్లో ఆర్టీసీ కాలనీ ఓటర్లు గల్లంతయ్యారు. దాదాపు 1200 ఓట్లు వేరొక వార్డులోకి మారిపోయాయి. ఈ వార్డుల్లో ఉండాల్సిన ఓటర్లు మరొక వార్డుల్లోకి మారిపోవడం వల్ల వాటిన్నింటి పైన అభ్యంతరాలు ఇచ్చేందుకు మాజీ కౌన్సిలర్లు సిద్ధమవుతున్నారు. ఇతర మున్సిపాలిటీల్లో సైతం ఇదేరకమైన తప్పిదాలు వచ్చాయని, ఇంటి నంబర్లు ఎంటర్​ చేయడంలో పొరపాట్లు తలెత్తడం వల్ల ఓటర్లు గల్లం తయ్యాయరని చెప్తున్నారు.

Share
Share