- ఎస్సారెస్పీ కాలువల పట్ల బీఆర్ఎస్ నిర్లక్ష్యం
- పదేళ్లలో కాలువల మెయింటెన్స్, రిజర్వాయర్లు పట్టించుకోలే
- కోదాడ వరకు 70 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూటర్లు ఆగమాగం
- తుంగతుర్తిలో శంకుస్థాపనకే పరిమితమైన వంద పడకల దావఖాన
- అర్వపల్లిలో కేజీబీవీ స్కూల్ చెరువులో కట్టిర్రు
- సూర్యాపేటలో మార్కెట్ యార్డ్ పనులు నాసిరకం ..రూ.50కోట్లు వృథా
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఫైర్
సూర్యాపేట, ఏపీబీ న్యూస్: సూర్యాపేట జిల్లాలకు సాగు, తాగునీరు అందించే శ్రీరాంసాగర్ రెండో దశ కాలువల పనులు, రిజర్వాయర్లు నిర్మించుకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. శనివారం తుంగతుర్తి, సూర్యాపేటలో పర్యటన సందర్భంగా ఆమె మట్లాడుతూ గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సారెస్పీ రెండో దశ కింద చేయాల్సిన పంట కాలువల మెయింటెన్స్, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణాల కోసం నయాపైసా విడుదల చేయలేదని అన్నారు. రిజర్వాయర్లు నిర్మిస్తామని చెప్పిన గత ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని చెప్పారు. కోదాడ వరకు 70 కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన డిస్ట్రిబ్యూటరీలు అధ్వాన్నంగా మారాయని మండిపడ్డారు.
తుంగతుర్తిలో ఎప్పుడో పూర్తిచేయాల్సిన వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి గత ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయని, అప్పటి మంత్రులు హారీష్రావు, ఎమ్మెల్యేలు ఫౌండేషన్ వేసిన బిల్డింగ్కే, మళ్లీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫౌండేషన్ వేయడం తప్పా పనులు మాత్రం ముందుకు సాగలేదన్నారు. ఈ ఆసుపత్రిలో నెలకు కేవలం రెండు డెలవరీలు మాత్రమే అవుతున్నాయని, గ్రామీణ ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకి గురివుతున్నారని ధ్వజమెత్తారు.

అర్వపల్లిలో కేజీబీవీ భవనాన్ని చెరువులో కట్టారని, దాంతో వర్షాలు వచ్చినప్పుడు బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ నీటిలో మునిగిపోతుందని, కలెక్టర్ విజిట్ చేసి కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. సూర్యాపేటలో రూ.50 కోట్లతో నిర్మించిన సమీకృత మార్కెట్ యార్డ్ పనులు నాసిరకంగా ఉన్నాయని, గాలి, వెలుతురు లేక ఇబ్బంది పడుతున్నట్టు రైతులు చెప్తున్నారని, ఇలాంటి లోపబూయిష్టమైన పనులతో ప్రజాధనం దుర్వినియోగం చేశారని కవిత మండిపడ్డారు.

ఆరుగ్యారెంటీలు ఎక్కడా..?
పెన్షన్లు పెంచుతాం, ఫ్రీ కరెంట్, ఫ్రీ గ్యాస్, రైతు బంధు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది, కానీ ఇచ్చిన హామీల్లో ఏదీ నెరవేర్చలేదని విమర్శించారు. పిడికిలెత్తి గట్టిగా నిలదీయకపోవటంతోనే ప్రభుత్వం హామీలు విస్మరిస్తోందని ఇప్పుడు ఓట్లు లేవు, నేను ఓట్లు అడగటానికి కూడా రాలేదని, గత 10, 15 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పనులను ప్రభుత్వం పై ఒత్తిడి పెంచి చేయిస్తున్నామన్నారు. ప్రజలంటే ఓట్లు వేసే మెషీన్లు అని నాయకులు అనుకునే పరిస్థితి వచ్చిందని, ప్రజలకు అవసరాలుంటాయి, వాటిని తీర్చాలన్న సోయి నాయకులకు లేకుండా పోయిందని మండిపడ్డారు. రాజకీయాల్లో ఇలాంటి సంస్కృతి పోయి…కొత్త పంథా రావాలని సూచించారు.
ఉద్యమకారులకు సాయం అందె వరకు పోరాటం..
తెలంగాణ సాయుధ పోరాటం నాటి నుంచి ఎన్నో ఉద్యమాల్లో ఎంతో మంది అమరులయ్యారు. ఉద్యమ సమయంలో మనమే 12 వందల మంది అమరులయ్యారని చెప్పాం, కానీ వారందరికీ సాయం చేయలేదన్నారు. అమరుల కుటుంబాలకు కోటి సాయం అందే వరకు పోరాటం చేస్తామని వెల్లడించారు. ఉద్యమకారులకు ప్రభుత్వం ఇస్తామన్న 250 గజాల స్థలం, రూ. 25 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ భూమి ఇచ్చే వరకు ప్రతి జిల్లాలో ప్రభుత్వ భూమిని మేమే ఆక్రమించి ఉద్యమకారులకు పట్టా రాసి ఇస్తున్నామని ప్రకటించారు.