Good News: బ్రహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయి…!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉదయసముద్రం ప్రాజెక్టు అంతర్భాగమైన బ్రహ్మణ వెల్లంల రిజర్వాయర్కు మళ్ళీ మంచిరోజులు రాబోతున్నాయి. ఎంతోకాలం నుంచి పెండింగ్లో ఉన్న కుడి, ఎడమ కాల్వుల పనులు త్వరలో మొదలు పెట్టనున్నారు. ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం పెంచకుండా పనులు చేయలేమని మేఘా కన్స్ట్రక్షన్ కాంట్రాక్టు రద్ధు చేసుకుంది. దీంతో కొత్తగా సన్బీం ఎంటర్ప్రైజైస్, మహేందర్ రెడ్డి కనస్ట్రక్షన్స్కు కాంట్రాక్టు అప్పగించేందుకు ఇరిగేషన్ శాఖ సూత్రపాయంగా అంగీకరించింది. ప్రస్తుతం ఈ ఫైల్ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి పరిశీలనలో ఉంది. మంత్రి గ్రీన్సిగ్నల్ ఇవ్వగానే ప్రధాన కాలువల పనులు, డిస్ట్రిబ్యూటరీ, మేజర్లు, మైనర్లు, సబ్మైనర్ల పనులు మొదలు పెట్టనున్నారు. మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.823 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.470 కోట్ల పనులు పూర్తి చేశారు. రిజర్వాయర్ హెడ్వర్క్స్ మొత్తం పూర్తియ్యాయి. భూసేకరణ సమస్య వల్ల ప్రధాన కాలువల పనులు మధ్యలోనే ఆగిపోయింది. అప్పటి ప్రభుత్వం భూసేకరణ నిధులు సకాలంలో రిలీజ్ చేయకపోవడం వల్ల పనులు చేయలేదు. దీంతో పెరిగిన రేట్ల ప్రకారం అగ్రిమెంట్ రివైజ్ చేస్తే పనులు చేస్తామని మేఘా కనస్ట్రక్షన్ ప్రభుత్వాన్ని కోరింది. అగ్రిమెంట్ ప్రకారం రేట్లు పెంచడం కుదరదని చెప్పడంతో మేఘా సంస్థ నిర్మాణ బాధ్యతల నుంచి తప్పుకుంది.

బ్రహ్మణ వెల్లంల రిజర్వాయర్లో భాగంగా నిర్మించిన సొరంగ మార్గం సన్బీం ఎంటర్ప్రైజైస్ చేపట్టింది. దాదాపు 10.50 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గాన్ని సన్బీఎం సక్సెస్ చేసింది. తమ కంపెనీ ప్రతిష్ట పెంచుకునేందుకు సన్బీం పాత రేట్ల ప్రకారం పనులు చేసేందుకు ఆసక్తి చూపింది. మహేందర్రెడ్డి కన్స్ట్రక్షన్స్ అనే మరో సంస్థ కూడా ముందుకు వచ్చింది. దీంతో ఎడమ కాలువ సన్బీం, కుడి కాలువ మహేందర్ రెడ్డి సంస్థకు ఇవ్వాలని ఇరిగేషన్ ఆఫీసర్లు ప్రతిపాధించారు. ముందుగా ఎడమ కాలువ పనులు మొదలు కానున్నాయి. ఈ కాలువ పరిధిలో నల్లగొండ, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల్లో సుమారు 43 వేల ఎకరాలు సాగులోకి వస్తుంది. సెకండ్ ఫేజ్లో కుడి కాలువ పనులు స్టార్ట్ చేస్తారు. 

గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణకు నిధులు ఇవ్వకపోవడంతో రైతులు ఇప్పుడు భూసేకరణ అడ్డుకుంటున్నారు. ఇప్పుడున్న ధరల ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు, దాంతో భూసేకరణ కష్టంగా మారింది. రైతులను ఒప్పించేందుకు అధికారులు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. పాత రేట్ల ప్రకారం నష్టపరిహారం ఎకరాకు రూ.5 లక్షల నుంచి 12 లక్షల వరకు వచ్చింది. మళ్లీ 2021లో భూముల రేట్లు సవరించారు. దీంతో ఆ రేట్ల ప్రకారం ఇప్పుడు నష్టపరిహారం ఎకరాకు రూ.10 లక్షల వరకు వస్తోంది. గత పదేళ్లలో పెండింగ్లో ఉన్న భూసేకరణ నిధులు రూ. 61 కోట్లు రిలీజ్ అయ్యాయి. ప్రధాన కాలువల పనులు మొదలు పెట్టకాగానే, పెండింగ్లో ఉన్న భూములను సైతం సేకరించి, రైతులకు తక్షణమే పరిహారం ఇవ్వనున్నారు.

Share
Share