మాఫియాను తలపిస్తున్న కాంగ్రెస్ పాలన: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

నల్లగొండ, ఏపీబీ న్యూస్: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మాఫియాను తలపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఇటీవల చండూరు మండల కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఘర్షణలో గాయపడి, నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ కార్యకర్తలను రామచంద్రరావు బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని విమర్శించారు. ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తున్నా పోలీసులు వారిపై నామమాత్రపు కేసులు పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారు. గంజాయి, మత్తుమందులు, భూ కబ్జాలు, దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు.

కేంద్రంలో మేం అధికారంలో ఉన్న విషయం మర్చిపోతున్నారని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీనే అధికారం చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దాడులు చేస్తే సహించేది లేదని, మరోసారి బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడితే ప్రతిదాడులు తప్పవని హెచ్చరించారు. ఘటనకు కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, బీజేపీ జిల్లా అద్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, పిల్లి రామరాజు, గోళి మధుసూదన్ రెడ్డి, వీరెళ్ళి చంద్రశేఖర్, బండారు ప్రసాద్, పొతేపాక సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Share
Share