Viral: భోపాల్‌లో ‘శుభలగ్నం’ సీన్ రిపీట్: రూ. 1.5 కోట్లకు భర్తను ప్రియురాలికి అప్పగించిన భార్య

భోపాల్, ఏపీబీ న్యూస్: సినిమా తెరపై చూసిన అసాధారణ కథలు నిజ జీవితంలో కూడా జరుగుతాయని మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన ఒక ఉదంతం నిరూపించింది. తన భర్తను మరొక మహిళకు (ప్రియురాలికి) ఏకంగా రూ. 1.5 కోట్ల ఒప్పందంతో అప్పగించి, తన 23 ఏళ్ల వైవాహిక బంధానికి ఓ మహిళ స్వస్తి పలికిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. భోపాల్కు చెందిన 42 ఏళ్ల వ్యక్తికి 23 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంసారం సజావుగా సాగుతున్న క్రమంలో, సదరు వ్యక్తి తాను పనిచేసే కార్యాలయంలో తనకంటే వయసులో పెద్దదైన (52 ఏళ్లు) ఓ మహిళా సహోద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కాలక్రమేణా భార్యాపిల్లలను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు.

తల్లిదండ్రుల మధ్య నిత్యం జరుగుతున్న గొడవలతో విసిగిపోయిన పెద్ద కుమార్తె, తన తండ్రి తమను పట్టించుకోవడం లేదని, పరాయి మహిళతో తిరుగుతున్నాడని భోపాల్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు ముగ్గురినీ (భర్త, భార్య, ప్రియురాలు) పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించింది.

న్యాయస్థానం పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ, ఆ వ్యక్తి తన భార్యతో కలిసి ఉండటానికి నిరాకరించాడు. తన ప్రియురాలితోనే కలిసి జీవిస్తానని భీష్మించుకుని కూర్చున్నాడు. ఈ క్రమంలో భర్తను మార్చడం అసాధ్యమని గ్రహించిన భార్య, తన ఇద్దరు కుమార్తెల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది.

భర్తను ప్రియురాలికి వదిలివేయాలంటే తనకు భారీ పరిహారం కావాలని భార్య డిమాండ్ చేసింది. దీనికి భర్త ప్రియురాలు కూడా అంగీకరించింది. కుదిరిన ఒప్పందం ప్రకారం:

  • నగదు: రూ. 27 లక్షలు.
  • ఆస్తి: సుమారు రూ. 1 కోటి విలువ చేసే ఒక విల్లా (డూప్లెక్స్ ఇల్లు).
  • మొత్తంగా రూ. 1.5 కోట్ల విలువైన ఆస్తి, నగదును భార్యకు అప్పగించేలా ఒప్పందం కుదిరింది.

ఈ ఆస్తులు మరియు నగదు బదిలీ ప్రక్రియ పూర్తయిన తర్వాత, భార్య తన భర్తకు విడాకులు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ వినూత్న పరిష్కారాన్ని ఫ్యామిలీ కోర్టు కూడా అధికారికంగా ధ్రువీకరించింది. ఇప్పుడు ఆ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి కొత్త ఇంట్లోకి మారగా, భర్త తన ప్రియురాలితో కలిసి ఉండటానికి మార్గం సుగమమైంది.

Share
Share