భువనగిరి, ఏపీబీ న్యూస్: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.

ప్రజాబలం కాంగ్రెస్ వైపే:
ఈ సందర్భంగా ఎంపీ చామల మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే ‘గెలుపు గుర్రాలనే’ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దింపుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఆయన విమర్శించారు. ముఖ్యంగా మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు.

ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు:
ఎన్నికల సమయంలో కుల, మత వైషమ్యాలను రెచ్చగొట్టి లబ్ధి పొందడం బీజేపీకి అలవాటుగా మారిందని ఎంపీ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల వల్ల నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయని, బంగారం, వెండి సామాన్యులకు అందనంత దూరంలోకి వెళ్లిపోయాయని ఆరోపించారు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ బలహీనపరిచిందని విమర్శించారు.కార్యకర్తలకు దిశానిర్దేశం: మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నాయకత్వంలో భువనగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.