చైర్మన్​ పీఠం పై బీఆర్​ఎస్​ గురి..పొత్తులతో కాంగ్రెస్ ​ను దెబ్బతీసేందుకు వ్యూహాం

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మిర్యాలగూడెం బీఆర్ఎస్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చైర్మన్ స్థానాన్ని మరోసారి కైవసం చేసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్రావు పదునైన వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన ఆయన పొత్తుల పైన పలు పార్టీ లీడర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీన్నే అవకాశంగా భావిస్తున్న బీఆర్ఎస్ నాయకత్వం తమతో కలిసొచ్చే బీజేపీ, కమ్యూనిస్టులతో పొత్తులు కుదుర్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మొత్తం 48 వార్డుల్లో బీజేపీ 12, సీపీఎం ఐదు వార్డులు ఇవ్వాలని కోరుతున్నాయి. అయితే కుడిఎడ తేడాతో సీట్లు సర్ధుబాటు చేసుకుని పోటీకి దిగేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ఓకొలిక్కి వచ్చింది. అయితే చైర్మన్ స్థానం జనరల్ మహిళకు రిజర్వు కావడంతో మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు కొడలు, సిద్ధార్ధ భార్య రాణి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ పార్టీలో ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతే సిద్ధార్ధ భార్యను పోటీకి దింపాలని భావిస్తున్నారు. మరోవైపు బీసీలు సైతం చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. భాస్కర్రావు ఫ్యామిలీ నివాసం ఉంటున్న 20వ వార్డు జనరల్ మహిళలకు రిజర్వు కాగా, ఈ ఎన్నికల్లో వాళ్ల ఓట్లు 21 వార్డులోకి మారాయి. ఈ వార్డు కూడా బీసీ మహిళ కు రిజర్వు అయ్యింది.

మున్సిపల్ ఎన్నికల్లో సిద్ధార్ధ విజయం సాధించేందుకు పాత మిత్రులను కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్లో చక్రం తిప్పిన అమరేందర్ రెడ్డి లాంటి సీనియర్లను సైతం టచ్లోకి తీసుకుంటున్నారు. మాజీ చైర్మన్ తిరునగరు భార్గవ్ సపోర్ట్ కూడా కోరుతున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన భార్గవ్ ను పార్టీ అంతగా పట్టించుకోవట్లేదు, భార్గవ్ వర్గం పది వార్డుల్లో ప్రభావం చూపనుంది. ఆయన అనుచరులకు టికెట్లు ఇవ్వని పక్షంలో భార్గవ్ ప్రత్యామ్నయ మార్గం వెతుకునే పరిస్థితి కనిపిస్తోంది.

Share
Share