డ్రగ్స్ పరీక్షలపై ఛాలెంజ్ లు విసరడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం: బి.వి.రాఘవులు

సూర్యాపేట, ఏపీబీ న్యూస్: పాలక, ప్రతిపక్షాలు డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలని చాలెంజులు విసరటం రాజకీయ దిగజారుడుకు నిదర్శనమని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు విమర్శించారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విజయ్ కన్వెన్షన్ హాల్ లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం నాలుగవ వర్ధంతి సందర్భంగా సిపిఎం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో “ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ దాడులు దాని పర్యవసానాలు ” అనే అంశంపై జరిగిన సెమినార్ కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, మాట్లాడుతున్న మాటలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనంగా ఉన్నాయన్నారు.  ప్రధాన రాజకీయ పార్టీలు, బూర్జవా నాయకులు డ్రగ్స్ వాడుతున్నాయంటే రాజకీయాలు ఎలా దిగజారుతున్నాయో అర్థమవుతుందన్నారు. అలాంటి వాళ్లను ఆయా పార్టీలు ప్రక్షాళన చేసేందుకు ఏమి చర్యలు తీసుకుంటాయో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. డ్రగ్స్ కేసులో దొరికిన వారికి నోటీసులు ఇవ్వడమే కాదని ఆయా పార్టీలు వారిని సస్పెండ్ చేయాలన్నారు. ఈ కేసులో సంబంధం ఉన్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇరాన్ పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్ వెంటనే చొరవ తీసుకోవాలన్నారు.

దేశంలో గ్యాస్ కొరత తీవ్రంగా ఉందని దాని పర్యవసనాలు భవిష్యత్తులో మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందన్నారు. అమెరికాకు బిజెపి దాసోహం అయ్యిందన్నారు. తక్షణమే బిజెపి యుద్ధాన్ని ఖండించాలని కోరారు. పార్లమెంట్ లో మహిళా బిల్లు వెంటనే ప్రవేశపెట్టి ఆమోదింప చేయాలన్నారు. జనాభా లెక్కలు, డీలిమిటేషన్ తర్వాత పార్లమెంట్ లో పెడతామని చెప్పడంలో అర్థం లేదన్నారు. రోహిత్ వేముల చట్టాన్ని వెంటనే తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీరనారి మల్లు స్వరాజ్యం జీవితం స్ఫూర్తిదాయకమని ఈ తరానికి ఆమెఒక స్ఫూర్తి అని ఆమె పోరాటం అందరికీ ఆదర్శం అని అన్నారు. తుపాకీ పట్టి నిజాం కడగల్లాలించి ఆడవాళ్లు అబలలు కాదు సభలు అని నిరూపించిన యోధురాలు మల్లు స్వరాజ్యం అన్నారు.

బిజెపి, ఆర్ఎస్ఎస్(RSS) దుర్మార్గంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మతం రంగు వస్తుందన్నారు. ఇది ఆనాటి అమరవీరుల త్యాగానికి ద్రోహం చేసినట్టునని బిజెపి పై మండిపడ్డారు. వీర తెలంగాణ సాయుధ పోరాట వారసత్వమైన లౌకికత్వాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉందన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్ లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, పెళ్లి సైదులు, కోట గోపి తదితరులు పాల్గొన్నారు.

Share
Share