హైదరాబాద్ (ఏపీబీ న్యూస్): భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి నేటి మరియు భావితరాలకు గొప్ప ఆదర్శ నాయకుడని ప్రముఖ సామాజికవేత్త, ఆదిలీల ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వీరబొమ్మ రమేష్ గుప్తా కొనియాడారు. వాజ్పేయి జయంతిని పురస్కరించుకొని గురువారం (డిసెంబర్ 25, 2025) బషీర్బాగ్లోని లిబర్టీ ప్లాజాలో గల ‘మాతృదేవోభవ సత్సంగ్’ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ కూడా అయిన రమేష్ గుప్తా మాట్లాడుతూ.. నిజాయితీకి, నిబద్ధతకు మారుపేరుగా నిలిచిన వాజ్పేయి గారు భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తం చేశారని అన్నారు. ప్రస్తుత కాలంలో రాజకీయాల్లోకి వస్తున్న యువ నాయకులు వాజ్పేయి గారి అడుగుజాడల్లో నడవాలని, ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. దేశానికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించే కేంద్ర ప్రభుత్వం ‘భారతరత్న’ పురస్కారంతో గౌరవించిందని, అది మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.

నిరుద్యోగ సమస్య పరిష్కారానికి వాజ్పేయి పేరుతో పథకం
అనంతరం ఆదిలీల ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆదినారాయణ మాట్లాడుతూ.. యువతకు చేయూతనిచ్చేలా, నిరుద్యోగ సమస్యను రూపుమాపేలా వాజ్పేయి గారి పేరు మీద ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని వాజ్పేయి సేవలను స్మరించుకున్నారు. కే.బి. శ్రీధర్: ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాతృదేవోభవ సత్సంగ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, అజయ్ శ్రీనివాస్ శర్మ (సామాజికవేత్త), నవీన్, శంఖపాణి నాయుడు, తదితర నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు.