- మున్సిపల్ ఎన్నికల్లో తెరపైకొచ్చిన రాజకీయ వారసులు
- భవిష్యత్తులో అసెంబ్లీలో అడుగుపెట్టే ఆలోచన
- దానికోసం మున్సిపల్ ఎన్నికల నుంచే వ్యూహాం
- చిట్యాల పోరులో చక్రం తిప్పిన గుత్తా అమిత్ రెడ్డి
- మిర్యాలగూడలో కాంగ్రెస్కు చెమటలు పట్టించిన సిద్ధార్ద్
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మున్సిపల్ ఎన్నికల వేళ జిల్లా రాజకీయాల్లో మరొక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజకీయ వారసులుగా భవిష్యత్తుల్లో అసెంబ్లీలో అడుగుపెట్టాలనే ఆలోచనతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్రావు కొడుకు సిద్ధార్ధ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటారు. తమ శక్తి సామర్ధ్యాల పైన పార్టీ కేడర్లో, ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు పుర పోరులో ప్రత్యర్థులకు చెమటలు పట్టించారు. చిట్యాల లో కాంగ్రెస్ను గెలిపించేందుకు అమిత్ పదునైన వ్యూహాన్ని అమలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు వెనక అమిత్ చేసిన కృషిని పార్టీ హైకమాండ్ గుర్తించింది. నవీన్ యాదవ్ను గెలిపించేందుకు అమిత్ నైపుణ్యం కలిగిన సర్వే టీమ్లను రంగంలోకి దింపి అక్కడి లోపాలను సరిదిద్దారు. ఈ సర్వే ఆధారంగానే పార్టీ అమలు చేసిన ఎన్నికల వ్యూహాం సక్సెస్ అయ్యింది.
జూబ్లీ తరహాలో చిట్యాలలో ఆపరేషన్
జూబ్లీహిల్స్ తరహాలోనే చిట్యాలలో కూడా అమిత్ పార్టీ ఇంచార్జి బాధ్యతలు తీసుకున్నారు. సొంతంగా 40 మంది టీమ్తో సర్వేలు చేయించారు. ఎంపిక చేసిన అభ్యర్థుల పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను సేకరించిన అనంతరం అమిత్ తెరపైకొచ్చారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాం గురించి ఎమ్మెల్యే వీరేశంతో కలిసి పక్కగా అమలు చేశారు. ఆ తర్వాత హైకమాండ్ అమిత్ను గాంధీ భవన్లో వార్ రూమ్ ఇంచార్జిగా నియమించడంతో తెరవెనకాల చిట్యాల ఆపరేషన్ సక్సెస్ చేశారు. దీంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోబోతుంది.
నియోజకవర్గాల పునర్విభజన పైనే దృష్టి
నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అమిత్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ నకిరేకల్ జనరల్గా మారినా లేదంటే మళ్లీ రామన్నపేట నియోజకవర్గం రూపాంతరం చెందితే అమిత్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ తండ్రి గుత్తా మాదిరే భువనగిరి, నల్గొండ ఎంపీగా ఛాన్స్ లభిస్తుంది. గత ఎంపీ ఎన్నికల్లో అమిత్ భువనగిరి ఎంపీ సీటు ఆశించిన సంగతి తెలిసిందే.
గూడెంలో సిద్ధార్ధ దూకుడు
మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల్లో నలమోతు సిద్ధార్ధ దూకుడు ప్రదర్శించారు. గతంలో ఎప్పుడు కనిపించినంత స్థాయిలో రెచ్చిపోయారు. తండ్రి భాస్కర్ రావు అడుగుజాడల్లో తనదైన శైలిలో కేడర్లో పురపోరు వేడిని రగిల్చారు. ఏకంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిని లక్ష్యంగా చేసుకుని పదునైన విమర్శలు చేశారు. అప్పటికే పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో పట్టుసాధించిన సిద్ధార్ద అదే స్పీడ్ మున్సిపాలిటీలోనూ ప్రదర్శించారు. కాంగ్రెస్లో నెలకొన్న గ్రూపు తగాదాలను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో సిద్ధార్ద్ సక్సెస్ అయ్యారు. అభ్యర్థుల ఎంపిక మొదలు, ప్రత్యర్ధుల ఎత్తులను చిత్తు చేయడంలో వ్యూహాత్మంగా వ్యవహారించారు. అభ్యర్థుల ఎంపిక కోసం సర్వేలు చేయించడమేగాక, సొంతగా ఎన్నికల ఖర్చు భరించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రికి వారుసుడిగా పోటీ చేయాలనే ముందుచూపుతోనే పూణెలో తన వ్యాపార, ఉద్యోగాలను విడిచిపెట్టి కుటుంబంతో సహా హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. తన తండ్రి అండదండలతో వచ్చే ఎన్నికల్లో పార్టీ అవకాశం ఇస్తే ఎమ్మెల్యే లేదంటే ఎంపీగా తన సత్తా చూపేందుకు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారు.