రాజన్న సిరిసిల్ల, ఏపీబీ న్యూస్: అభం శుభం తెలియని పసివాడిపై ఓ అంగన్వాడీ టీచర్ కర్కశత్వం ప్రదర్శించింది. క్రమశిక్షణ నేర్పాల్సిన చేతులతోనే ఆ చిన్నారిని విచక్షణారహితంగా చితకబాదిన ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. అల్లరి చేస్తున్నాడన్న చిన్న కారణంతో బాలుడి కన్ను పోయేలా దాడి చేయడంతో స్థానికంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
అసలేం జరిగింది?
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన కొంపెల్లి లక్ష్మి, విజయ్ కుమార్ దంపతుల కుమారుడు విద్వాన్ష్ (3) స్థానిక అంగన్వాడీ కేంద్రానికి వెళ్తున్నాడు. ఎప్పటిలాగే మంగళవారం (ఫిబ్రవరి 10) తల్లి తన కుమారుడిని కేంద్రంలో వదిలి పనులకు వెళ్ళింది. అయితే, మధ్యాహ్నం సమయంలో అంగన్వాడీ టీచర్ రాణి, తల్లి లక్ష్మికి ఫోన్ చేసి “మీ బాబుకు జ్వరం వచ్చింది, వెంటనే ఇంటికి తీసుకెళ్లండి” అని చెప్పారు.
కళ్ళు చెమర్చిన బాలుడి పరిస్థితి
టీచర్ ఫోన్ చేయడంతో కంగారుగా కేంద్రానికి చేరుకున్న తల్లికి అక్కడి దృశ్యం చూసి గుండె తరుక్కుపోయింది. జ్వరం అని చెప్పిన టీచర్ మాటలు అబద్ధమని, బాలుడి కుడి కన్ను తీవ్రంగా ఉబ్బిపోయి, రక్తం గడ్డకట్టి ఉండడం గమనించింది. అంతేకాకుండా బాలుడి చేతులు, కాళ్లపై కూడా తీవ్రమైన గాయాలు, వాతలు ఉండడంతో తల్లిదండ్రులు హతాశులయ్యారు. టీచర్ దాడిని దాచిపెట్టేందుకు జ్వరం అని అబద్ధం చెప్పడంపై వారు మండిపడ్డారు.
పోలీసుల రంగప్రవేశం – విచారణ
చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని సిరిసిల్లలోని ఆసుపత్రికి తరలించారు. బాలుడి తండ్రి విజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డిపేట పోలీసులు అంగన్వాడీ టీచర్ రాణిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (THRC) కూడా సీరియస్ అయ్యింది. జిల్లా కలెక్టర్ను సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
మరోవైపు, జిల్లా సంక్షేమాధికారి మరియు సీడీపీవో కూడా ప్రాథమిక విచారణ చేపట్టి, నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి, పసివాడిపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.