- ఉమ్మడి జిల్లాలో నల్గొండ కార్పొరేషన్, 17 మున్సిపాలిటీల్లో రేపు ఎన్నికలు
- బరిలో 1632 మంది అభ్యర్డులు
- పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది
- పకడ్బందీగా పోలీస్ బందోబస్తు
- ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ కార్పోరేషన్, 17 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు అధికారం యంత్రాంగం సన్నద్ధమైంది. మంగళవారం సాయంత్రం వరకు పోలింగ్ సిబ్బంది, భద్రత బలగాలు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. అన్ని పట్టణాల్లో పోలీస్ పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచేశారు. అభ్యర్థులకు మంగళవారం ఒక్కరోజే మిగిలి ఉండటంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే బిజీలో పడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఓటుకు రెండు వేలు, బీఆర్ఎస్ వెయ్యి వరకు పంపిణీ చేస్తోంది. ప్రీమియం లిక్కర్ బ్రాండ్లు ఇంటింటికి పంపిణీ చేశారు. పోటీ ఎక్కువగా ఉన్న వార్డుల్లో సిగ్నేచర్, 100 పైపర్స్, బ్లాక్ అండ్ వైట్, మద్యం బాటిళ్లు పంపిణీ చేస్తుండగా, మాస్ ఓటర్లు ఉన్న ఏరియాల్లో రాయల్ స్టాగ్, బ్లండర్ స్పైడ్, యువకులకు బీర్లు పంపిణీ చేశారు.

400 వార్డులు, 1737 మంది అభ్యర్థులు
నల్గొండ కార్పొరేషన్, 17 మున్సిపాలిటీలలోని 400 వార్డుల్లో మొత్తం 1737 మంది అభ్యర్డులు బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా ఎన్నికల సామగ్రిని పోలింగ్ సిబ్బంది మంగళవారం భారీ బందోబస్తు నడుమ కేంద్రాలకు తరలించారు.
జిల్లాల వారీగా వివరాలు
నల్గొండ కార్పొరేషన్, మిర్యాలగూడ, దేవరకొండ, నందికొండ, చిట్యాల, చండూరు, హాలియా మున్సిపాలిటీలలో 162వార్డులు ఉండగా 3,09,097 మంది ఓటర్లు ఉన్నారు. హాలియా మున్సిపాలిటీలో ఒక వార్డ్ ఏకగ్రీవం అయింది. మిగిలిన 161 వార్డులలో 712 మంది అభ్యర్డులు పోటీ చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 475 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహించనుండగా 620 బాక్సులను సిద్దం చేశారు. 70 మంది ఆర్వో(RO)లు, 68 మంది ఏఆర్వో(ARO)లు, 475 మంది పీవో(PO)లు, 812 ఏపివో(APO)లు, 1425 మంది ఒపివో(OPO)లు కలిపి 2850 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు.

పకడ్బందీగా పోలీస్ బందోబస్తు
నల్లగొండ కార్పొరేషన్ తో పాటు ఆరు మున్సిపాలిటీలలో జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో ఒక అడిషనల్ ఎస్పీ, ఆరుగురు డీఎస్పీలు, 29 మంది సీఐలు, 84 మంది ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బందితో కలిపి మొత్తం 1097 మంది 5 ప్లాటున్ల టిజిఎస్పీ పోలీస్ సిబ్బందిని నియమించారు. 66 సమస్యాత్మక పోలింగ్ స్టేషనులను గుర్తించి, ఆయా పోలింగ్ స్టేషన్ పరిధిలో అదనపు బలగాలు, 07 స్ట్రైకింగ్ ఫోర్స్, 14 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 47 రూట్ మొబైల్ పార్టీలు, 08 ఎస్స్టీ ఎఫ్ టీంలు ఏర్పాటు చేశారు.

సూర్యాపేట జిల్లాలో
సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీలలో 141 వార్డులు 2,26,586 మంది ఓటర్లు ఉండగా కోదాడలో 03, హుజూర్ నగర్ మున్సిపాలిటీలో ఒక వార్డ్ ఏకగ్రీవం అయింది. మిగిలిన 137 వార్డులలో 567 మంది అభ్యర్డులు పోటీ చేస్తున్నారు. మొత్తం 372 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా వీటిలో 158 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు, 28 హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లను గుర్తించారు. 5 మున్సిపాలిటీ పరిదిలో మొత్తం 59 రూట్ లను ఏర్పాటు చేయగా 61 మంది జోనల్ ఆఫీసర్స్, 59 రూట్ ఆఫీసర్స్, 70 మంది ఆర్ఓ(RO), 68 మంది ఏఆర్ఓ(ARO), 475 మంది పిఓ(OP), 475 మంది ఏపిఓ(APO),1425 మంది ఓపిఓ(OPO), 158 మంది మైక్రో అబ్జర్వర్స్ కలిపి మొత్తం 2850 మంది సిబ్బంది ఎన్నికల విదులలో పాల్గొంటున్నారు. ఐదు మున్సిపాలిటీ కేంద్రాల్లో 1250 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో
ఆలేరు, భువనగిరి, చౌటుప్పల్, మోత్కూరు, భూదాన్ పోచంపల్లి, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో 104 వార్డులున్నాయి. 1.32 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో చౌటుప్పల్లోని 17 వార్డు, యాదగిరిగుట్టలోని 10వ వార్డు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 102 వార్డుల్లో 353 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. జిల్లాలో 212 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వీటిలో 51 క్రిటికల్ పోలింగ్ సెంటర్లుగా గుర్తించారు. 449 పోలింగ్ బాక్స్లు రెడీగా ఉన్నాయి. 42 మంది ఆర్వోలు, అసిస్టెంట్ ఆర్వోలు 42 మందిని నియమించారు. పీవోలు, ఏపీవోలు, ఓపీవోలు కలిపి 1196 మందిని నియమించారు.